Monday, April 29, 2024

Editorial – మ‌ణిపూర్ పై ప్ర‌ధాని నోరు విప్పాలి…

దేశాన్ని కుదిపేస్తున్న ప్రధానమైన సమస్యపై పార్లమెంటు ఉభయ సభల్లో ఐదారు రోజులుగా సభా కార్యక్రమాలను ప్రతిపక్షాలు సాగనివ్వకుండా చేస్తున్న ప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడకపోవ డాన్ని దేశ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. ఆయనకు సరైన సమాచారం సమగ్రంగా అందలేదేమోనని అను కోవాలా?లేక తాను నోరు విప్పితే సమస్య మరింత ముదురుతుందన్న అనుమానమా? ఏదో ఒకటి కార ణమై ఉండాలి. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులను ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు. ప్రతి పక్షాల్లో తనకు దీటుగా సమాధానమిచ్చే నాయకు లెవ రూ లేరన్న నమ్మకం ఆయనకు ఉండి ఉండవచ్చు. వాగ్ధా టిలో, సమయానుకూలంగా సమాధానమివ్వడంలో తనకు సాటి ఎవరూ లేరని ఆయన అనుకోవచ్చు, ఇవ న్నీ నిజమే కావచ్చు. కానీ, మీడియాలో, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణల్లో వెలువడుతున్న విషయంలో ఏ మేరకు నిజం ఉందో, ఏది కల్పితమో ప్రభుత్వాధినేతగా సభాముఖంగా చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఆయన కు ఉంది. మణిపూర్‌ ఈశాన్య రాష్ట్రాల్లో అతి ముఖ్యమై నది.

మయన్మార్‌కి సరిహద్దుల్లో ఉంది. మణిపూర్‌లో గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్న హింసపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. స్థానికంగా ఉన్న తెగల మధ్య ఘర్షణ కారణమని అంటున్నారు కానీ, అది కొత ్తగా తలెత్తింది కాదు. ఎంతో కాలంగా ఉన్న ఈ సమస్యపై ఇప్పుడు అగ్గి రాజేయడానికి కారకులెవరో కనుగొనడం పెద్ద కష్టమేమీ కాదు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో వేగుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. వారందించిన సమాచారం మేరకు రాష్ట్రమూ, కేంద్రమూ వెంటనే చర్యలు తీసుకుని ఉండి ఉంటే రావణకాష్టం అయ్యేది కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభు త్వమే అయినప్పుడు ఈ సమస్యను పరిష్కరించడం కేం ద్రానికి మరింత సులభం. అయితే, కేంద్రం ఆ పనిచేయ కపోవడం వల్లనే చినికిచినికి గాలి వాన అయింది. ఆందోళనకారులంతా ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నందున తొలి దశలోనే కేంద్రం జోక్యం చేసుకుని ఉండాల్సింది. పక్క రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఆందోళనకారుల నాయ కుడు ముయివా ఇతర దేశాల్లో తలదాచుకుని స్వరా ష్ట్రంలో ఉద్యమం నడిపించేవాడు.

అటువంటి క్లిష్ట సమస్యను సైతం పూర్వపు ప్రధానమంత్రి పీవీనరసిం హారావు ఎంతో నేర్పుగా, చాకచక్యంగా కేంద్రం దూత పద్మనాభ య్య ద్వారా పలు దఫాలు చర్చలు జరిపించి సమస్యకు సానుకూలమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. దానితో పోలిస్తే ఇదేమంత కష్టమైన పని కాదు. కేంద్రం లో ఇప్పటికీ అటువంటి దౌత్య కౌశలం కలిగిన అధికా రులు ఉన్నారు. వారి సేవలను వినియోగించుకుని ఉంటే ఈ సమస్య గోటితోపోయేది. అయితే, దీనిని ప్రస్తుత ప్రభుత్వం రాజకీయంగా పరిష్కరించాలనుకుంది. అందువల్ల పరిష్కారానికి అందకుండా పోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈశాన్య రాష్ట్రాల్లో చాలా పర్యాయాలు పర్యటించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు తాను చేసిన మంచి పనులను గురించి ప్రచారం చేసుకునేందుకైనా ప్రధానమంత్రి మణిపూర్‌పై సభాముఖంగా తన వాదాన్ని వినిపించి ఉండాల్సింది. మణిపూర్‌పై ప్రధానమంత్రి సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుపట్టినప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరిగిన లైంగిక దాడుల గురించి కూడా చర్చించేందుకు అనుమతించాలంటూ కమలనాథులు పట్టుపట్టడం సమంజసంగా లేదు. అం తే కాదు. ఏ నిబంధన కింద చర్చించాలో సభా పతులు నిర్ణయిస్తారు. దానికి కూడా ఇటు ప్రతిపక్షాలు కానీ, అటు ప్రభుత్వ పక్ష సభ్యులు కానీ పట్టపట్టడం సబబుకాదు. చర్చ అనంతరం ఓటింగ్‌ జరగాలన్న నిబంధనను మధ్యలో తీసుకుని రావడం కూడా అసంగతమే.

ఒక వేళ ఓటింగ్‌లో ప్రభుత్వ పక్షం ఓటమి పాలైతే రాజీనా మా చేసే పరిస్థితి ఇప్పుడు ఎలాగూ లేదు. ప్రభుత్వం వి ఫలమైందని చెప్పడమే ప్రతిపక్షాల ఉద్దేశ్యం అయిన ప్పుడు ఏ నిబంధన కింద చర్చ జరిగినా ఆ విషయం లోకానికి తెలుస్తుంది. అందువల్ల ఈ అంశంపై సాగ దీయడంలో ప్రతిపక్షాలు కూడా పట్టువిడుపులు ప్రద ర్శించాలి. అంతిమంగా రోజుల తరబడి సభ సాగకపోవ డం వల్ల ప్రజల సొమ్ము వృధా అవుతోంది. అంతకన్నా ముఖ్యం.. మణిపూర్‌ మాడిమసైపోతున్నది.ఆ సరిహద్దు రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? సరిహద్దు రాష్ట్రాలు బాగుం టనే సరిహద్దులు బాగుంటా యన్న ఇంగితాన్ని ఉభయ పక్షాలు మనసులో పెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఇరుపక్షాలూ గుర్తించి మణిపూర్‌పై చర్చించి సానుకూల పరిష్కారాన్ని కనుగొనాలి. ఇంకెంత మాత్రం కాలయాపన, సమయం వృథా తగదు!

Advertisement

తాజా వార్తలు

Advertisement