Friday, May 17, 2024

వాలి యోగ స్థితి!

శ్రీరాముని బాణానికి వాలి పడిపోయాడు. తనను చెట్టు చాటునుండి కొట్టిన శ్రీరాము ణ్ణి మాటలతో దులిపివేసి మౌనంగా ఉండిపోయాడు. అంతవరకు దూరంగా ఉన్న హను మంతుడు మొదలయినవారు దగ్గరకు వచ్చి చూచారు. అప్పుడు వాలి వారికి ఇలా కనిపిం చాడు.

గీ. హనుమదాదులు దూరంబునందు నుండి
నికట దేశంబునకు వచ్చి నిలిచి కనిరి
హాల హల పానవేళా మహానుభావు
నీలలోహితువలె యోగనిభృతు వాలి|
(శ్రీమద్రామయణ కల్పవృక్షం- కిష్కింధ కాండ 159)

హాలాహల విషం త్రాగిన పరమేశ్వరుడు ఆ విష ప్రభా వం తనపై పడకుండా యోగ సమాధిలోకి వెళ్ళినట్లు, వాలి రామబాణ తీవ్ర వేదన తనకు తెలియకుండా యోగంలో మునిగిపోయాడని పై పద్యం భావం.
అయితే, ఇక్కడ తమ్ముడిని తరిమి, తమ్ముని భార్యతో కులికే వాడిని పరమేశ్వరునితో పోల్చడమేమిటి? అని ప్రశ్న తలెత్తుతుంది.
వ్యక్తిపరంగా జాగ్రదవస్థలో ఉన్న శరీరం నేను అని అభిమానించేవాడు విశ్వుడు. కల లో ఉన్న శరీరం సూక్ష్మ శరీరం దానిని అభిమానించేవాడు తైజసుడు. గాఢ నిద్రలో శరీరం కారణ శరీరం. దానిని అభిమానించేవాడు ప్రాజ్ఞుడు. ఈ మూడవస్థలూ దాటి తురీయ స్థితి లో ఉండేవాడు శుద్ధ చైతన్యరూపుడు.
సమష్టిలో కనబడే సమస్త విశ్వం నేనని అభిమానించే ఆయన విరాట్పురుషుడు. సకల సూక్ష్మ శరీర సమష్టిని నేనని భావించే ఆయన హిరణ్యగర్భుడు. సకల కారణ శరీర సమష్టిని నేనని అభిమానించే ఆయన ఈశ్వరుడు. ఏ శరీరాన్ని అభిమానించనిది నిర్గుణ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ, శుద్ధ చైతన్యం ఒకటే. కనుక తురీయ స్థితిలో ఉండేవాడిని ఈశ్వరునితో పోల్చ డం తప్పుకాదు. తమ్ముని ద్వేషించి, అతణ్ణి తరిమి, అతని భార్యతో కులికేవాడికి తురీయ యోగస్థితి రావడమేమిటి అని మరో ప్రశ్న.
ధ్యానంలోకి వెళ్ళేముందు, మరణించడానికి పూ ర్వమందు ఉండే మనోవృత్తి చరమ వృత్తి. ఆ చరమ వృత్తి లో ఏ భావం ఉంటే అట్టి స్థితి ఆ తరువాత సిద్ధిస్తుంది.

శ్లో|| యంయం వాపి స్మరన్‌ భావం త్యజ త్యన్తే కళేబరం
తంతమేవైతి కాన్తేయ సదా తద్భావ భావిత:

ఏ భావాన్ని స్మరిస్తూ శరీరం వదలుతారో సదా ఆ భావమే స్మరిస్తూ ఆ తత్త్వాన్నే పొందుతారు. అని భగవా నుని ఉపదేశం. ధ్యానం చేసే యోగికి చరమ వృత్తి వలన బ్రహ్మాను భూతో లేక ఎవరిని ధ్యానం చేశాడో ఆ దేవతానుభూతో కలుగుతుంది. మరణించే వ్యక్తి చరమ వృత్తితో పరమాత్మ భావన ఉంటే ఆ పరమాత్మను పొందుతాడు.
పూర్ణావతారుడైన శ్రీరాముని బాణాగ్నిచే సకల పాపాలు దగ్ధమైన వాలి మనస్సులో ఉన్న భావ కాలుష్యంతో శ్రీరాముని నిందించినా, శ్రీరామ దివ్య సుందర రూపం, పురుషు లకు కూడా మోహం కలిగించే ఆ రూపం చూసి యోగ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకే భగవానుని చేతిలో మరణించినవారికి మోక్షం వస్తుందని అంటారు. ఇంత గంభీరమైనది విశ్వనాథవారి పద్యం. ఇదీ ఆయన కవి త్వ వైశిష్ట్యం. అందుకే ఆయన కవి సమ్రాట్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement