Friday, May 10, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 3
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

ఒఙ్గి యులగళన్ద ఉత్తమన్‌ పేర్‌ పాడి
నాఙ్గళ్‌ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్‌
తీఙ్గిన్ఱి నాడెల్లామ్‌ తిఙ్గళ్‌ ముమ్మారిపెయ్‌దు
ఓఙ్గు పెరుఞ్జెన్నెల్‌ ఊడు కయ లుగళ
పూఙ్గువళై ప్పోదిల్‌ పొఱివండు కణ్‌ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్‌త్తములై పత్తి
వాఙ్గ క్కుడమ్‌ నిఱౖక్కుమ్‌ వళ్ళల్‌ పెరుమ్‌పశుక్కల్‌
నీఙ్గాద శెల్వమ్‌ నిఱౖ న్దేలో రెమ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
తాము ఈ వ్రతము నాచరించుటకు అం గీకరించిన వ్రేపల్లెలోని వారికి చక్కని పాడిపంటలు కలుగవలయునని ఆకాక్షించుచున్నారు. పెరిగి లోకములను కొలచిన ఉత్తముడగు త్రివిక్రముని నామమును కీర్తించెదము. మేము మా వ్రతము అను మిషతో స్నానమాడినచో సకల లోకములు ఆనందించును. ఈతి బాధలు లేకుండగా దేశమంతా నెలకు మూడు వానలు కురియును. ఈ వ్రతము వలన లోకములో పాడిపంటలు సమృద్ధిగా యుండును. పెరిగిన పెద్ద వరి చేలలోచేపలు త్రుళ్ళి పడుచుండును. పూచిక కలువ పూవులో అందమైన తుమ్మెదలు నిద్రించుచుండును. జంకకుండ కొట్టములో ప్రవేశించి కూర్చుండి బలిసియున్న పొదుగును పట్టిపాలు పిదుకుచుండగా కుండల కుండల పాలను అచట ఆవులు ఇచ్చుచుండును. ఇవి ఉదారములగు ఆవులు. లోకమంతట తరగని సంపద నిండియుండును.
ఇచట ఉత్తముడగనగా గురువు. మూడు అడుగుల నేల యిచ్చుటకు అంగీకరించగానే బలిచక్రవర్తి దగ్గర వామనుడు త్రివిక్రముడైనట్లు మూడు రహస్యముల తెలియుటకు అంగీకరింపగనే శిష్య సందేహ నివృత్తికి ఆచార్యుడు తన యధార్థ స్వరూపమును ప్రదర్శించును. పరమాత్మ జీవుడను విత్తనమును ఈ శరీరమనుక్షేత్రమున నాటును. ఈ ఆత్మసస్యము ఫలించుటకు ఈతిబాధలు లేకుండ వలయును. ఈతిబాధలు లోకమున ఆరు. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దుష్టులగు రాజులు. అట్లే ఆత్మ విషయమున కూడా ఆరు ఈతి బాధలు 1. దేహాత్మ బుద్ధి, 2. నేను స్వతంత్రుడనను బుద్ధి, 3. పరమాత్మ అని కాక ఇతరులకు చెండిన వాడను అను బుద్ధి, 4. తనను తాను రక్షించుకొనగలనను బుద్ధి, 5. శరీర బంధువులే బంధువులను బుద్ధి, 6. శబ్దాది విషయములను అనుభవింపవలయునని బుద్ధి.

- Advertisement -

ఇక మూడు వానలనగా
1. పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడనుగాను అను బుద్ధి
2. పరమాత్మయే తప్ప ఇతరమగునది ఉపాయము కాదు అను బుద్ధి
3. పరమాత్మానుభవము తప్ప ఇతరమగునది నాకు రుచింపదు అను బుద్ధి.
క్షేత్రమనగా శరీరము. క్షేత్రమున అడుగున జలమనగా పరమాత్మ. చేపలనగా భగవద్ధ్యానముతో మాత్రమే జీవించగలుగు భక్తులు, ఈ నీటిలో కలువ పూలనగా జీవుల హృదయములు. అందులోని తుమ్మెదలు అనగా లక్ష్మీనారాయణులు. వారి కలహము జీవుల పరిపాలన విషయముననే.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement