Friday, May 3, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

11. వీడెంబబ్బినయప్పుడున్దమనుతుల్విన్నప్పుడుం(కావ్యకుల్) బొట్టలో
గూడున్నప్పుడు శ్రీ విలాసములు పైకొన్నప్పుడుంగాయకుల్
పాడంగావినునప్పుడుంజెలగుదంభప్రాయవిశ్రాణన
క్రీడాసక్తులనేమి చెప్పవలెనోశ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!వీడెంబు ్స తాంబూలము,అబ్బిన – అప్పుడున్ – దొరికి నప్పుడునూ, తమ నుతుల్ – తమను గుర్చిన పొగడ్తలు,విన్నప్పుడున్ -వినినప్పుడునూ,పొట్టలోన్ – కడుపులో, కూడు- ఉన్నప్పుడున్- ఆహారం ఉన్నప్పుడునూ, శ్రీ విలాసములు – సంపదల వైభవములు,పైకొన్నప్పుడున్ -అతిశయించినప్పుడునూ, గాయకులు – పాటగాండ్రు,పాడంగాన్ – పాడుచుండగా,వినునప్పుడున్ -వినేసమయంలోనూ, చెలగు – ప్రదర్శించు, విజృంభించు,దంభప్రాయ – ఆడంబరంతో కూడిన,విశ్రాణన -దానగుణమనెడి,క్రీడాసక్తులన్ – వినోదముల యందు లగ్నమై పోయిన వారిని గూర్చి,ఏమి – ఏమని, చెప్పవలెను -ఓ – చెప్పవలెనో ఏమో.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! తమకు తాంబూలము లభించినప్పుడును, తమ నెవ్వరైన పొగడుతూ ఉంటే వింటూఉన్నప్పుడును, కడుపు నిండుగా ఆహారం ఉన్నప్పుడును సంపదల వలన పొందు వైభవములు మితిమీరినప్పుడును, గాయకులు పాడుతుండగా వింటున్నపుడును, అతిశయంతో, ఆడంబరంకోసం, దాన ధర్మాలు చేస్తూ, వినోదాలలో నిమగ్నమై పోయి ఉండే వారి నేమనాలో తెలియదు. భగవంతుణ్ణిమరచిన వారి నేమనాలోతెలియదని భావం.
విశేషం: తాంబూలం భోగచిహ్నము. తాంబూల మబ్బినప్పుడు అంటే, భోగాలలో మునిగి తేలుతున్నప్పుడు అని అర్థం. అంతే కాదు, తాంబూలం భారతీయులకి ఒప్పందానికి రావటానికి సంకేతం. పూర్వం రాజులు సేనాపతిని యుద్ధానికి పంపేటప్పుడు, కవులని కావ్యం రచించి ఇవ్వమని అర్థించే సమయంలోను, కళాకారులని తమ కొఱకుఏదైనా చేయమని అడిగే సమయంలోను కర్పూర తాంబూల మిచ్చి వారిని సన్మానించటం సంప్రదాయంగా ఉండేది. తాంబూల మబ్బినప్పుడు అంటే రాజసన్మానం లభించినప్పుడు అని కూడా అర్థం.
ఇతరులు తనను పొగుడుతున్నప్పుడు, దానికి కారణం అయిన పరమేశ్వరుణ్ణి తాను నుతించాలన్న సంగతి గుర్తుకు రావాలి.
అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మానవుడు భగవంతుణ్ణి స్మరించడు. పైగా దానధర్మాలు తన గొప్పతనం ప్రదర్శించుకోటానికే చేస్తాడు. దానం చేయటం అవతలివారి మీద ప్రేమతో, గౌరవంతో, వినయంతో చేయాలి. “ శ్రద్ధయాదేయం,హ్రియాదేయం,భియాదేయం,సంవిదాదేయం…..” అంటు దానం ఎట్లా చేయాలో చెప్పబడింది. అంతే కాని ఆడంబరం కోసం కాదు. ఆడంబరం కోసం చేసింది నిరుపయోగం. పరమాత్ముణ్ణి ధ్యానించక పోవటం వల్లనే అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. భక్తుడైన వాడికి సర్వజీవులలో రుద్రుడు దర్శన మిస్తాడు కనుక,శివార్పణం అంటు దానం ఇస్తాడు. అట్లా కాక చేసిన దానం నిష్ఫలం. మానవుడీ సంగతిని గుర్తించ డేమాయని ధూర్జటి విచారం.
భోగాలలో మునిగి మానవుడు,క్రీడాప్రాయంగా జీవితాన్ని నడుపుతాడే కాని ,భగవంతుణ్ణితలచడుఅని ధూర్జటి ఆవేదన.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement