Sunday, May 5, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

16. నిను నా వాకిలి (గావు మంటినా?మరున్నీలాలక భ్రాంతి ( గుం
టెనబొమ్మంటినో?యెంగిలిచ్చి తిను, తింటే గాని కాదంటినో?
నినునెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబురక్షింప జే
సిన నా విన్నప మేల చేకొనవయా?శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!,నిను – నిన్ను, నా వాకిలిన్- నా గుమ్మమును,కావుము – అంటిన్- ఓ – కాపలా కాయమని అన్నానా?,మరుత్ – నీల ్శ అలక భ్రాంతిన్ – దేవతా స్త్రీల పై గల వ్యామోహముతో,కుంటెన – రాయబాబారానికి, పొమ్ము – అంటిని – ఓ – వెళ్ళమని అడిగానా?,ఎంగిలి – ఇచ్చి – ఎంగిలి చేసిన ఆహారం ఇచ్చి, తిను – తిన వలసినది,తింటేన్ – కాని- తినిననే తప్ప, కాదు – అంటిని – ఓ – కుదరదు అన్నానా?,నిను – నిన్ను,నెమ్మిన్ – ప్రేమతో,తగ విశ్వసించు – బాగుగా నమ్మిన, సుజన – అనీకంబున్ – సజ్జన సముదాయమును,రక్షింపన్ – రక్షించుమని, చేసిన – విన్నవించిన, నా విన్నపము – నా ప్రార్థన, ఏల – ఎందులన,చేకొనవయా – వినిపించుకోవటంలేదయ్యా ప్రభూ.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను నా గుమ్మం వద్ద కాపలాదారుగా ఉంచలేదు కదా. దేవతాస్త్రీలపై (అప్సరసలపై) వ్యామోహంతో వారి వద్దకు రాయబారిగా పంపలేదు కదా. ఎంగిలిమాంసము తెచ్చిపెట్టి, తినకపోతే ఊరుకోను అని బెదిరించ లేదు కదా! నేను నిన్ను కోరినదల్లా నిన్ను నిండు మనస్సుతో నమ్మిన సజ్జనులను రక్షింపుమని. నా ఈ ప్రార్థన నేల వినకున్నావు?
విశేషం: ఒకప్పుడు బాణాసురుడు శివుని తన గుమ్మం వద్ద కాపుగా ఉంచాడు. తిన్నాడు ఎంగిలిమాంసము తెచ్చి పెట్టి ఊరుకోక – నైవేద్యం పెట్టటం అంటే దైవం చేత తినిపించటం అనుకొని – తిన మని సామ దాన భేద దండోపాయాలతోకోరాడు.
కాపలాగా ఉంచినా, దూతగా పంపినా – అవి స్వార్థచింతనతో కూడినవి. ఎంగిలి తినమనటం మూర్ఖత్వం. పోనీ, మూఢత్వం. ధూర్జటి తాను అటువంటి స్వార్థపూరితమైన కోరికలో మూర్ఖపుకోరికలో కోరటం లేదని స్పష్టంచేశాడు. పైగా ధూర్జటిదిపరహితార్థము. పరమేశ్వరుణ్ణి అంతులేని భక్తితో సేవించే సత్పురుషులను  సత్ప్రవర్తన కలిగి ఉండటమే భక్తికి నిదర్శనం- రక్షించమని ప్రార్థించాడు. సత్పురుషులని రక్షించేట్లయితేతానూ రక్షించ బడతాడు. తన గురించి ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు.
ఇతరుల కోసం కోరితే అది కోరిక అవదు. యజ్ఞార్థక్రియ అవుతుంది. తన కోసం కోరితే అది స్వార్థం అవుతుంది.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement