Sunday, May 5, 2024

సమతా కుంభ్ – 2023 మహోత్సవం..

ఈ రోజు ప్రాతఃకాలంలో ఆచార్య సన్నిధిలో ఆచార్యులతో పాటు అంగన్యాసం, కరన్యాసం సహిత భగవత్‌ ధ్యానం, అష్టాక్షరి మంత్ర జప అనుష్ఠానంతో యాగశాలలో కార్యక్రమం ఆరంభమైంది. తరువాత పెరుమాళ్ల ఆరాధన, సేవాకాలం, మంగళాశాసనములు, శాంతి పాఠం, వేద విన్నపాలు, వేద పారాయణములు వరుసగా కొనసాగాయి.

ఆచార్యులు ఉపదేశిస్తూ భగవంతుని కనులలోని కరుణా జలములలో మనం పునీతులమైనట్లు భావించుకొని హృదయ కమలములో భగవంతుని ఆయన దేవేరులు, నిత్యసూరులు, ఆళ్వార్లు ఆసీనులైనట్లు భావన చేయమన్నారు. బయటి నుంచి వినిపించే శబ్దములు, కలకలములేవైనా భగవంతుని సంబంధంగా భావించి అనుష్ఠానం కొనసాగించవచ్చునన్నారు. అలా అనుదినం సాధన చేయమని ఉపదేశించారు. విచ్చేసిన భక్తులందరికీ ఆచార్య తీర్థాన్ని అనుగ్రహించారు. మనం కూర్చున్నా నిలుచున్నా, పనులు చేసుకుంటున్నా ప్రసాదం తీసుకోనంత వరకు మంత్రస్మరణ చేసుకోవచ్చునన్నారు. ఈ రోజు మకర మాస హస్త నక్షత్రం.. రామానుజాచార్య మిత్రులు, శిష్యులు, ఉప కారకులు, కూరేశులు (కూరత్తాళ్యాన్‌) తిరునక్షత్రం. వీరు అద్భుతమైన పాండిత్యం కలిగిన మహానుభావులు అన్నారు. బ్రహ్మ సూత్రాల రచనలో రామానుజ వారికి తోడుగా ఉన్నటువంటి వారు. అద్భుతమైన ప్రచార మార్గాన్ని చూపిన మహానుభావులు కూరత్తాళ్వాన్‌. రాజు గారు రామానుజులకు హాని తలపెట్టాలని తన భటులను పంపగా కూరేశులు తామే రామానుజుల వేషంలో వెళ్లి రాజు ఆజ్ఞపై తమ కళ్లను సైతం త్యాగం చేసి రామానుజులకు రక్షకులయ్యారు. కూరత్తాళ్వాండ్లను నడిచే వ్యాకరణం అన్నారు. వీరు పంచస్తవం రచించారు. నిరాడంబర ప్రవృత్తి కలిగిన వారు. వీరు రామానుజస్వామి కంటే పెద్దవారైనప్పటికీ రామానుజాచార్య స్వామి ప్రభావానికి వారి ప్రచార విధానానికి వశులై, ముగ్ధులై వారి శిష్యులయ్యారు. వేదమంతా ఒక నారీమణిగా భావిస్తే కూరత్తళ్వాన్‌ వ్యాఖ్యానం, వివరణం ఆ స్త్రీ మూర్తికి మంగళ సూత్రాలుగా భావిస్తారు. అంత పవిత్రమైనవి. ఆయన స్మరణగా భక్తులందరితో వారి తనియన్లను అనుసంధింపజేశారు. స్వామివారు భక్తులందరికీ పెరుమాళ్ల తీర్థాన్ని అనుగ్రహించారు. యాగశాలలో పూర్ణాహుతి జరిపి యజమానులకు మంగళాశాసనాలు, వేదవిన్నపాలు, ప్రసాద వితరణ జరిగింది. బలిహరణతో కార్యక్రమం సుసంపన్నమైంది.

ఉదయం 9 గంటల నుంచి సామూహిక ఉపనయనములు జరిపించారు. తర్వాత 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు తిరుమంజన సేవ జరిపించారు.

సాయంత్రం శ్రీ చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం జరిగింది.

- Advertisement -

త్రిదండి చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా ఆలయ స్తపతులకు సత్కారాల కార్యక్రమం జరిగింది.
స్తపతి ప్రసాద్‌కు స్తాపత్య కళా సామ్రాట్‌ అనే బిరుదును శ్రీ చినజీయర్‌ స్వామి ప్రకటించారు. ప్రసాద్‌ దంపతులను డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు శాలువాతో సత్కరించారు.

శ్రీ చినజీయర్‌స్వామి మాట్లాడుతూ..
సమతా మూర్తి కేంద్రం ఏర్పడి ఏడాది అయింది. ఇది ఏర్పడటానికి పూర్వరంగంగా మొదట సమతాస్పూర్తి మూర్తిగా ఒక్కరే ఉంటే చాలు అని మొదట ఆరంభమైనా ఆ తర్వాత ఆ మూర్తిని దర్శించిన వారికి ప్రేరణ కలిగేలా చేయడం రామానుజులవారి మహోన్నత వ్యక్తిత్వానికి తగ్గట్టు ఉంటుందని భావించి 108 దివ్య దేశాలను ఇక్కడికి తేవాలని సంకల్పం కలిగింది. 2017లో జరగాల్సిన ఆవిష్కరణ కాస్త ముందుకు సాగింది. 2022లో పూర్తయింది. రామానుజుల వారికి ప్రేరణ ఇచ్చిన దివ్యక్షేత్రాలు మన దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఉన్నట్టుగానే గర్భమూర్తి, గర్భాలయం, పైన ఉండే విమానాలను యథాతధంగా ఆవిర్భించేలా చేశాం. నేర్పరులైన స్తపతుల ద్వారా ఈ కార్యక్రమం చేయించాం. ప్రసాద్‌కు ఈ బాధ్యతను జూపల్లి రామేశ్వరరావుగారు అప్పగించారు. కానీ ఇప్పటికీ ఇది 60శాతమే పూర్తయింది. మరో 40 భాగం మిగిలే ఉందని చినజీయర్‌స్వామి అన్నారు. భక్తులకు వసతులు, ఇతర వ్యవస్థలు కావాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలోని డైనమిక్‌ ఫౌంటెన్‌ సరదా కోసం కాదు. మనం ప్రేమతో రామానుజులకు అర్పించే అభిషేకం. రామానుజుల క్షేత్రంలో అన్నీ 9 సంఖ్యతోనే ఉన్నాయని జీయరుస్వామి అన్నారు.

మైహోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు కామెంట్స్‌
స్వామివారు 2013లో తమిళనాడులో రోశయ్య గవర్నర్‌గా ఉన్నప్పుడు 2017 వెయ్యి సంవత్సరాల పండుగ కానుకగా ఆ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ స్థలం తీసుకుని రామానుజుల స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని 2012లో ప్రాసెస్‌ మొదలైంది. రామానుజుల స్వామివారిని ప్రపంచానికి గుర్తుండేలా చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాం. అక్కడ అనుకున్న సహకారం దొరకలేదు. రామానుజులు అనుకున్నట్టున్నారు ఇక్కడికి రావాలని. శిలాఫలకంతో చేయాలని చూశాం, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ ఇక్కడికి రావడం జీయరుస్వామి రూపకల్పన, సంకల్పం గొప్పది. మనమంతా చిన్నచిన్న పాత్రధారులం, చాలా అదృష్టవంతులం.

ప్రసాద్‌ స్తపతి ఎంతో కష్టపడ్డారు. ఏ కార్యక్రమం కూడా ఇంత ఇబ్బంది లేకుండా జరిగింది. ఇది ప్రపంచ స్థాయిలో కొన్ని వేల టెలివిజన్ల ద్వారా ఏ మూలకు పోయినా ఈ ప్రాజెక్ట్‌ గురించే మాట్లాడుతున్నారు. బెంగళూరు ఆర్టిటెక్ట్‌తో మొదలుపెట్టాం. చివరికి ఓ ఆకారం తీసుకొచ్చాం. ఏడు సంవత్సరాలపాటు పనిచేసిన ప్రసాద్‌ టీమ్‌ను అభినందిస్తున్నాం. జీయరుస్వామి సంకల్పం, రామానుజాచార్యుల మీద ఉండే నమ్మకమే దీన్ని నడిపించింది.

స్తపతి ప్రసాద్‌ కామెంట్స్‌
స్వామివారి అనుగ్రహంతోనే ఇంతపెద్ద ప్రాజెక్ట్‌ చేయగలిగాం
చిన్నప్పటి నుంచి చినజీయర్‌స్వామి ప్రవచనాల ప్రభావం నాపై ఉంది
రామాయణ, భాగవతాల పరమార్థం స్వామీజీ వల్లే తెలిసింది
శాస్త్రీయ శిల్ప కళా నైపుణ్యంతో పాటు జీయరువారి ఆశీస్సులతోనే ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాం
డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావుగారి సహకారం మరువలేనిది, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు

ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన ప్రతిఒక్కరికి రామానుజులవారి ఆశీస్సులు ఉంటాయి.

రాత్రి 8 గంటలకు సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవతో పాటు 18 దివ్యదేశాల మూర్తులకు గరుడ సేవలు నిర్వహించారు.

ఈ రోజు దివ్యదేశాధీశులకు జరిగే గరుడ సేవల వివరాలు

1.తిరునీర్‌మలై
పెరుమాళ్‌: నీర్‌ వణ్ణన్‌ పెరుమాళ్‌
అమ్మవార్లు: అణిమామలర్‌మంగైనాయకి, భూదేవి

2.తిరువిడైవెన్దై
పెరుమాళ్‌: నిత్య కళ్యాణ పెరుమాళ్‌/జ్ఞానప్పిరాన్‌
అమ్మవారు: కోమలవల్లీ తాయార్‌/అఖిలవల్లి

3.మహాబలిపురం
పెరుమాళ్‌: స్థలశయన పెరుమాళ్‌
అమ్మవార్లు: నిలైమంగై నాచ్చియార్‌, భూదేవి

4.తిరువల్లిక్కేణి
పెరుమాళ్‌: పార్థసారథి
అమ్మవారు: రుక్మిణీదేవి

5.షోలింగర్‌
పెరుమాళ్‌: యోగనారసింహస్వామి
అమ్మవార్లు: అమృతఫలవల్లీ తాయార్‌, భూదేవి

6.తిరుమల
పెరుమాళ్‌: శ్రీనివాసుడు/వేంకటేశ్వర పెరుమాళ్‌/తిరువేంగడం ఉడైయాన్‌
అమ్మవార్లు: పద్మావతి, భూదేవి

7.అహోబిలం
పెరుమాళ్‌: నరసింహస్వామి
అమ్మవార్లు: లక్ష్మీదేవి, భూదేవి

8.అయోధ్య
పెరుమాళ్‌: శ్రీరాముడు
అమ్మవారు: సీతాదేవి

9.నైమిశారణ్యం
పెరుమాళ్‌: దేవరాజ పెరుమాళ్‌
అమ్మవార్లు: పుండరీకవల్లి, భూదేవి

10.ముక్తినాథ్‌
పెరుమాళ్‌: శ్రీమూర్తి/ముక్తినాథ పెరుమాళ్‌
అమ్మవారు: శ్రీదేవి

11.బదరీనాథ్‌
పెరుమాళ్‌: బదరీనారాయణుడు
అమ్మవారు: అరవిందవల్లి

12.దేవ ప్రయాగ
పెరుమాళ్‌: నీలమేఘ పెరుమాళ్‌/రఘునాథుడు
అమ్మవార్లు: పుండరీకవల్లి, భూదేవి

13.జోషీమఠ్‌
పెరుమాళ్‌: పరమపురుష పెరుమాళ్‌
అమ్మవారు: పరిమళవల్లి

14.మథురా
పెరుమాళ్‌: శ్రీకృష్ణుడు
అమ్మవార్లు: రుక్మిణి, సత్యభామ

15.ద్వారక
పెరుమాళ్‌: ద్వారకాధీశ పెరుమాళ్‌
అమ్మవార్లు: కళ్యాణదేవి, భూదేవి

16.గోకులం
పెరుమాళ్‌: నవమోహన కృష్ణ పెరుమాళ్‌
అమ్మవార్లు: రుక్మిణి, సత్యభామ

17.క్షీరసాగరం
పెరుమాళ్‌: వ్యూహవాసుదేవ పెరుమాళ్‌
అమ్మవార్లు: క్షీరాబ్ధి పుత్రి మహాలక్ష్మి, భూదేవి

18.పరమపదం
పెరుమాళ్‌: పరమపదనాథుడు/పరవాసుదేవుడు

అమ్మవార్లు: శ్రీదేవి, భూదేవి, నీళాదేవులు

రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement