Thursday, April 25, 2024

పోలి పాడ్యమి… పోలి స్వర్గం

ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణు వును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజు పోలిస్వర్గం. కార్తిక మాసం నెలరోజులు కార్తిక స్నానాలు చేసి తెల్లవారుజామునే దీపం పెట్టి, హరిహరుల ఆరాధన, పంచాక్షరి మననంతో పునీతులయ్యారు మహి ళలు. ఈ మాసం ముగింపును పురస్కరించుకొని మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి పంపుతారు. దీనిలో భాగంగా నదీ స్నానం చేసి ఆవునేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, ఆత్మ స్వరూపమైన ఆ దీపాలను నదీప్రవాహంలో వదులుతారు.
అత్తగారు, ఐదుగురు కోడళ్ళు, అత్తగారి అహంకారం ఇలా సాగుతుంది పోలి వృత్తాంతం. దీనిలోని పరమార్థం చూస్తే అహంకారానికి నలుగురు కోడళ్ళు సహకరించి వారు కూడా అజ్ఞానంలో కూరుకుపోవడం. ఇక చిన్నకోడలైన ‘పోలమ్మ’ పోలి.ఇక కథలోకి వెళితే… ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆఖరి కోడలు అయిన పోలమ్మకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. పెళ్ళి అయిన తర్వాత ఆమె పూజలకు గండిపడింది. పోలమ్మ అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. భక్తురాలు అయిన పోలమ్మ కారణంగా తన పేరు పోతుందని భావించి ఆమెకు ఇంటిపనులు అన్నీ అప్పగించి, ఇంటివద్దనే వుంచి మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది. కార్తిక మాసం అంతా కూడా మిగతా కోడళ్లతో అత్త నదీస్నానానికి వెళ్లేది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నాన చేసి పత్తిచెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్లకవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించేది. ఇలా నెలరోజులు గడిచింది. అమావాస్య రోజు కూడా పోలమ్మ అలాగే చేసింది. మిగిలిన విషయాలను పక్కనపెట్టి ఒక్క భక్తి మార్గమే ఎంచుకుని ఇంటి పనులు అన్నీ ఒక్కతే చేసి తనకు అందుబాటులో వున్న వస్తువులతో దీపాన్ని వెలిగించి ఆ పరమాత్మను ఆరాధించిన పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరివారు, అత్త, తోడికోడళ్ళు అందరూ చూస్తుండగా పోలి ఆ విమానంలో ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే తాను స్వర్గానికి వెళ్ళకుండా పోలి వెళ్ళడం చూసిన అత్త పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళుపట్టుకుంది. మిగిలిన కోడళ్ళు కూడా ఒకరికాళ్ళు ఒకరు పట్టుకుని వేలాడ సాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడేశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మార్గశిర పాడ్యమి రోజు దీపాలను నదిలో వదిలి… ఈ కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement