Wednesday, May 1, 2024

పసిడి రాసుల పర్వదినం- అక్షయ తృతీయ

మన భారతీయ సంస్కృతి అనేది అక్షయ పాత్ర వంటిది. ఎవరికి ఏది ఎంత ఎప్పుడ వసరమో దానిని సమకూర్చే పెన్నిధానమది. అక్షయమంటే క్షయము లేనిది అం టే నశింపనిది అని అర్థం. అక్షయమైన రీతిలో కావలసిన వాటిని పొందడం కోసం రోహణీ నక్షత్రంతో కూడిన వైశాఖ శుద్ధ తదియనాడు ‘అక్షయ తృతీయ’ అనే పండుగను జరుపుకోవడం గొప్ప ఆచారంగా అనాదిగా ఉత్తర భారతదేశాన పాటించబడుతూ ప్రస్తుతం యావద్భారతావనిలోనూ జరుపుకోబడుతోంది. అంతులేని శ్రేయస్సునిచ్చే పండుగగా దీనిని హందువులు, జైనులు భావిస్తారు. ఎంతో విశిష్టమైన ఈ శుభదినాన అనేక గొప్ప కార్యాలు జరిగినట్లుగా వివిధ పురాణాలు చెబుతున్నాయి.
పాలకడలిలో సిరుల తల్లి శ్రీలక్ష్మీ దేవి వైశాఖ శుద్ధ తదియనాడే జన్మించింది అనీ, ఆ రోజే ఆమె శ్రీహరిని చేపట్టిందనీ పురాణోక్తి. ఈరోజుననే దశావతారాలలో ఒకటైన పరశురా ముని జయంతి కూడా. పరమేశ్వరుడు తన చెలికాడైన కుబేరుని ధనాధిపతిగా, నవనిధుల కు అధిపతిని చేసిందికూడా ఈరోజే. శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడైన సుదామునికి అక్ష యమైన సిరిసంపదలను ప్రసాదించిన దినమూ ఇదే. వన వాసంలో ఉన్న పాండవులకు ఆహారం కొరత రాకుండా సూర్యభగవానుడు వారికి ‘అక్షయ పాత్ర’ను ప్రసాదించినదీ ఈరోజే. ఆదిశంకరులు కనకధా రాస్తోత్ర ముతో శ్రీమహాలక్ష్మిని ప్రసన్నురాలిని చేసు కొని పేదరాలింట బంగారు ఉసిరి కాయల వర్షం కురిపిం చిన రోజూ ఇదే.
అక్షయ తృతీయ నాడు ఆచరించ వలసిన విధి విధానాలను ‘మత్స్య పు రాణం’ ఇలా పేర్కొనింది.
”వైశాఖ శుక్ల పక్షే తు తృతీయాయాం ఉపోషిత:
అక్షయం ఫలమాప్నోతి సర్వస్య సుకృతశ్యచ”
వైశాఖ శుద్ధ తదియ నాడు ఉపవాసం చేసి, ఏ చిన్న పుణ్యకార్యం చేసి నా దానికి అక్షయమైన ఫలితం ప్రాప్తిస్తుందని శివుడు పార్వతికి చెప్పా డు ఈ పురాణంలో. స్నానం, దానం, జపం, యజ్ఞం, ధ్యానం మొద లుగా ఏ పుణ్యకార్యం చేసినా దానికి అత్యధికమై న, అక్షయమైన ఫలం లభి స్తుంది. గంగాది నదులలో నూ, సముద్రంలోనూ, ఈవేళ స్నానం చేస్తే మంచిదనీ, అలా చేయ లేని వారు ఇంట్లోనే కనీసం గంగాదిన దులను స్మరిస్తూనైనా స్నానం చేయాలనీ అంటారు. వైశాఖమాసం అంటే వసంతానికి చివరి దశ, గ్రీష్మానికి స్వాగతం పలికే సమయం. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే కాలం. కనుక చల్లని నీటి కుండలు, పళ్ళరసాలు, పండ్లు, మజ్జిగ పెరుగు, అటుకులు, పెసలు, శనగలు, వంటి చలువను చేకూర్చే పదార్థాలతో కూడిన కల శాలను దానం చేయడం అక్షయ తృతీయ నాడు శుభకరమని చెబుతారు. జైనులు చెరకు రసాన్ని ఒకరికొకరు ఈనాడు ఇచ్చిపుచ్చుకొంటారు. వారు, మొలకెత్తిన గిం జలను, మిఠాయిలను కూడా ఈవేళ పంచుతారు.
మన విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు, బంగారానికి చాలా సంబంధం ఉన్నట్లు గా అనిపిస్తుంది. గండకీనదిలో సాలగ్రామాల గర్భం నుండి అక్షయ తృతీయనాడే బంగా రం మొదట కనుగొనబడిందనీ, దేవలోహమయిన పసిడికి ప్రపంచమంతటా ఉన్న విలువ ఎనలేనిది కనుక అక్షయ తృతీయనాడు కనీసం కాసంతయినా బంగారమైనా కొని తెచ్చుకో వాలనీ, ఈరోజును పసిడిరాసుల పర్వదినంగా జరుపుకోవాలనీ విశ్వసిస్తారు. ఈరోజు బం గారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువుతీరుతుందని చాలామంది నమ్ముతారు. బంగా రం కేవలం అలంకారానికేకాక, మన ఆర్థిక అవసరాలకు తక్షణం ఆదుకొనే వస్తువు కూడా కనుక దానిని ఏటా కొంత కొని దాచడం మంచిది అనే ఆంతర్యం ఇందులో ఉంది. కొనిన బంగారంలో పదహారవ వంతు, కనీసం పదహారు గింజల బరువున్న బంగారాన్నయినా అక్షయ తృతీయ రోజు సదాచారపరాయణులైన వారికి దానమివ్వాలనే నియ మం కూడా ఉంది. కానీ, బంగారమైతే కొంటాం కానీ దానమివ్వటానికి మనసొప్పదు చాలామందికి. మరికొందరైతే తమకు బంగారం కొనే శక్తి లేకపోయినా అప్పుచేసి మరీ కొనడానికి తాపత్ర య పడతారు. అప్పుల పాలయ్యే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా.
కనుక మనం ఈరోజు పవిత్రమైన మనసుతో, ప్రాత:కాలాననే గంగాస్మరణతో స్నాన
మాచరించి, ఇంటిని పరిశుభ్రము చేసుకొని, పూజామందిరా న్ని అలంకరించి, ఒక పీటపై క్రొత్త వస్త్రాన్ని పరచి, పసుపు, కుంకుమ, బి య్యం నాణాలు నింపిన కలశాన్ని ప్రతిష్ఠించి, దాని ముందు తమలపాకుపై పసుపుతో చేసిన వినాయకుడిని ఉంచుకొని, ఆవునేతితో దీపారాధన చేసి, గణపతిని, లక్ష్మీనారాయణులను పూజించి, ఇంటిలో డబ్బును, బంగారు నగలను ఉం చే బీరువాలను, అష్టోత్తర నామాలతో, ధ్యానావహనాది పూజలతో పూజించి, చక్కెర పొం గలి దైవానికి నివేదించి, అతిథి, అభ్యాగతులకు పెట్టి శక్తికొలది ధన, ధాన్య, జల, ఫలాదు లను దానంచేసి, వీలైతే ఉపవాసంచేసి అక్షయ తృతీయను ఆనందంగా జరుపుకొందాం. పుణస్థలాలను సందర్శించడం, శుభకార్యాలను ప్రారంభించడం పిల్లలకు విద్యాభ్యాసం ప్రారంభించడం వంటివి ఈరోజు చేస్తే మంచిదంటారు.
”య: కరోతి తృతీ యాయాం కృష్ణం చందన భూషితం
వైశాఖస్య సితే పక్షే సయాత్యచ్యుత మందిరం”.
అక్షయ తదియ నాడు అచ్యుతునికి జరిపే పూజలు చేసిన వారు, చేయించిన వారు, చూచిన వారు, వైకుంఠుని సాన్నిధ్యం పొందగలరని శాస్త్ర వచనం. బృందావనంలో బంకేబిహారి ఆలయంలో శ్రీకృష్ణుని నిజపాద దర్శన భాగ్యం సంవత్సరంలో ఒక్క అక్షయ తృతీయ నాడే లభిస్తుంది. పూరీలో జగన్నాథ రథనిర్మాణ క్రతువు అక్షయ తృతీయనాడే ప్రారంభమవుతుంది. అక్షయమైన, అనంత పుణ్యప్రదమైన అక్షయ తృతీయ పండుగ వేళ సత్కర్మాచరణలతో గడిపి పునీతులము అవుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement