Monday, April 29, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు నారసింహావతార వైభవాన్ని గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
నారసింహావతారం
దితి కుమారులు అయిన హిరాణ్యాక్ష, హిరణ్యకశిపులలో హిరణ్యాక్షుడిని వరాహ స్వామి వధించగా హిరణ్యకశిపుడిని నరసింహ స్వామి వధించాడు. హిరణ్యకశిపుని కుమారుడు పరమభక్తాగ్రేసరుడు అయిన ప్రహ్లాదుని హరిభక్తిని మానిపించడానికి చిత్రహింసలు పెట్టినా మాననప్పుడు శ్రీహరి ఎచట ఉన్నాడో చూపమని అడుగగా ”ఇందుగలడు అందులేడని సందేహము వలదు” అంటూ పరమాత్మ సర్వాంతర్యామి అని ప్రకటించాడు. ఇది నమ్మని హిరణ్యకశిపుడు పరీక్షించడానికి స్థంభమున శ్రీహరిని చూపమని దానిని పగుల గొట్టగా అందులో నుంచి మహాభయంకర ఆకారంగా నరసింహ రూపునిగా అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు స్వామి. వాస్తవానికి వైకుంఠం నుంచే శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించ వచ్చు కాని తన భక్తుడు తాను అంతటా ఉన్నానని ప్రకటించడంతో భక్తుని మాట నిలబెట్టడానికి ప్రత్యక్షం అయ్యి తాను సర్వాంతర్యామి అని నిరూపించుకున్నాడు నరసింహ స్వామి. అమితమైన భక్తవాత్సల్యం, ఆశ్రిత పక్షపాతం, అద్వితీయమైన దయా గుణాలకు ప్రత్యక్ష తార్కాణం నారసింహావతారం.
శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement