Saturday, June 8, 2024

కుంభకర్ణుడి మృతి రావణ వినాశనానికి బీజమా?

ప్రప్రధమ రామ-రావణ యుద్ధంలో రామబాణాల దెబ్బ లకు నొప్పులు పుట్టిన శరీరంతో రావణుడు తిరిగి లంక కు వెళ్ళాడు. తన దగ్గరున్న రాక్షసులతో తన మనస్సులో వున్నదున్నట్లు ఇలా చెప్పాడు. ”అయ్యో! ఎంతోమందిని జయించిన నేను ఈరోజున యుద్ధ భూమిలో ఒక మనుష్యుడిని గెలవలేకపోయాను. ఎంతటి విపరీత కాలం వచ్చిందో కదా! వరాలిచ్చినప్పుడే బ్రహ్మదేవుడు నాకు మను ష్యుల వల్ల భయం కలుగుతుందని చెప్పాడు. ఆ మాటలు నేడు యదార్థమయ్యాయి కదా! ఎవరితో చావకుండా బ్రహ్మ వరం పొం దాను. అప్పుడు దురహంకారంతో మనుష్యులు ఏమి చేయగలరని భావించి వారి పేరు చెప్పలేదు. అది ఇప్పుడు నా ప్రాణానికే అపా యం అయింది. నాకు హతం బోధించిన కొందరు, విష్ణువే మనుష్య రూపంలో రాముడిగా నన్ను చంపడానికి వచ్చాడనీ, అతడితో సంధి చేసుకొమ్మనీ చెప్పారు. గతంలో, ఇక్ష్వాకు రాజైన అరణ్యుడనే వాడిని యుద్ధంలో ఓడించాను. అతడు తన వంశంలో నన్ను చంపేవాడు పుడతాడని చెప్పాడు. ఆ రాజు అన్నమాట నేటికి చెల్లుతున్నది కదా! నేను చేసిన పనికి అవమానపడి, కోపంతో వేదవతి అనే తపశ్శా లినైన స్త్రీ, నన్ను నా కులాన్ని నాశనం చేస్తానని శపించింది. ఆ వేదవతే ఇప్పుడు విదేహరాజుకు కూతురై సీతగా పుట్టింది. ఆ వేదవతి ఋషి కన్య. మనుష్య స్త్రీ కాబట్టి సీత కూడా మనుష్య స్త్రీనే. కాబట్టి సీతా రాములిద్దరూ మనుష్య జాతివారే. మనుష్యులు కాబట్టే ఒకరినొకరు వివాహం చేసుకున్నారు కాని, రాముడు విష్ణువైతే మనుష్య స్త్రీని వివాహం చేసుకుంటాడా? సీత లక్ష్మి అయితే మనుష్యుడిని వివాహం చేసుకుంటుందా? కాబట్టి లక్ష్మీనారాయణుల వాదన నాకు సమ్మ తంకాదు. పార్వతి, రంభ, నందీశ్వరుడు నన్ను గురించి చెప్పింది జరగడం ఆరంభమైంది. ఇవి నాకున్న శాపాలు. ఇది తెలుసుకున్న మీరు విరోధులను సంహరించే ఉపాయం ఆలోచించండి. నిద్ర బోతున్న కుంభకర్ణుడిని లేపండి.”
ఆయన ఆజ్ఞానుసారం కుంభకర్ణుడిని నిద్రలేపడానికి రాక్షసు లు అనేకవిధాలైన ప్రయత్నాలు చేశారు. కుంభకర్ణుడు కళ్లు తెరిచి, తననెందుకు నిద్రలేపారని అడిగాడు. రావణుడి క్షేమం గురించి విచారించాడు. యూపాక్షుడనే మంత్రి ”ఇప్పుడు మనకు అర్థంకాని మహాభయం మనుష్యుల వల్ల కలిగింది. వానరులు లంకను ముట్ట డించారు. సీతాదేవిని అప హరించడంవల్ల బాధపడుతున్న రాము డితో రాక్షసులకు చావుకాలం వచ్చింది. ఇంతకుముందు ఒక వాన రుడు వచ్చి లంకను కాల్చాడు. ఇప్పుడు సూర్యతేజస్సుకల రాము డు బలవంతుడై వచ్చి రావణుడు చచ్చేట్లు యుద్ధంలో పరుగెత్తించి మరీ కొట్టాడు. అవమానంవల్ల, రాముడి బాణాల దెబ్బలవల్ల, రావ ణుడు నీమీద ఆశతో ప్రాణాన్ని బిగబట్టుకుని బతికున్నాడు.”
మత్తు వదిలించుకుని అన్న రావణుడిని చూడడానికి కుంభక ర్ణుడు వెళ్ళాడు. తమ్ముడిని చూడగానే రావణుడు ”నాయనా వచ్చావా!” అని సంతోషంగా ఎదురెళ్ళి కౌగలించుకున్నాడు.
”తమ్ముడా! సుగ్రీవుడి సహాయంతో వానరసేనతో రాముడు సముద్రం దాటివచ్చి రాక్షస సేననంతా నాశనం చేస్తున్నాడు. అస మాన తేజస్సుకలవాడా! ఈ నగరాన్ని నువ్వే రక్షించాలి. నీ బలంతో వానర సమూహాన్ని చంపాలి.” అంటున్న రావణుడిని చూసి నవ్వా డు కుంభకర్ణుడు. ”గతంలో నీకు ఎలాంటి కీడు మూడుతుందో అని మేము నిశ్చయించామో అలాంటి కీడే నేడు కలిగింది. యుద్ధం జరిగితే మనవారిలో కొందరైనా చస్తారు కదా? ఒక ఆడదాని కోసం నీ మేలుకోరేవారిని చంపుకుంటున్నావు. నీ కామానికి ఫలితం అను భవిస్తున్నావు. అనుకున్న దానికి విరుద్ధంగా ఏదీ జరగలేదు. పాపం చేసినవాడికి నరకానుభవం తప్పదన్నట్లు నువ్వు చేసిన పాపకార్యా నికి వెంటనే ఫలితం కనబడ్దది. దాన్ని అనుభవిస్తున్నావు.” అన్నాడు.
కుంభ కర్ణుడి మాటలకు కోపం తెచ్చుకున్న రావణుడు ”నా మీద నీకు అమితమైన ప్రేమ వున్నా, నీ బలశౌర్యాలు ఎంతో నీకు తెలి సివున్నా, ఇప్పటి యుద్ధ ప్రయత్నం నిరాక్షేప కార్యమని నీకు తోచినా, వెంటనే నేను నీతిమాలి చేసిన పనిని నీ శౌర్యంతో సరిదిద్దు. ఆపద కలిగిందని తెలిసి దు:ఖపడేవాడికి సహాయం చేసేవాడే స్నేహితుడు. నీతిమాలిన పనిచేసి దు:ఖ పడేవాడిని రక్షించేవాడే బంధువు.”
ఈవిధంగా రావణుడు చెప్పగా ఇక నీతులు చెప్పి ప్రయోజనం లేదని భావించిన కుంభకర్ణుడు ”రాక్షస రాజా! నీ మేలుకోరే వాస్త వాన్ని, హతాన్ని చెప్పాను. అది నీకు రుచించలేదు. కాబట్టి, అసమా నమైన నా శౌర్యంతో యుద్ధం చేసి నీ పగ తొలగిస్తాను. సర్వ రాక్షసు లు రాముడు చావగా నన్ను ప్రీతితో చూద్దురు గాక. రాముడు మొద ట నన్ను యుద్ధంలో చంపితే ఆ తరువాత నిన్ను చంపకుండా వదల డు. ఇది సత్యం. నేను చేతిలో త్రిశూలం తీసుకుని యుద్ధంలో వుండ గా నన్ను ఎదిరించడానికి ఇంద్రుడు, అగ్ని, వాయువు కూడా సరిపో రు. శత్రువులంతా చావరా?”అంటూ అన్నకు ప్రదక్షిణ చేసి, నమ స్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని కుంభకర్ణుడు సింహనాదం చేస్తూ యుద్ధానికి బయలుదేరాడు సైన్యంతో.
కుంభకర్ణుడిని చూసి కోతి గుంపులు చెల్లాచెదరై చెదిరిన పాదర సంలాగా అయిపోయాయి. పరుగెత్తిపోతున్న వీరులను అంగదుడు సమీపించి ”వీరులారా! మనల్ని రాక్షసులు భయపెట్తే భయపడాలా? అందుకే వారొక బొమ్మను తెచ్చారు. రండి, దాన్ని పడగొడ్దాం” అంటూ అంగదుడు వారిని యుద్ధభూమికి మళ్లించాడు.
యుద్ధభూమికి మరలి వచ్చిన వానరులను కుంభకర్ణుడు మింగుతున్నప్పటికీ మిగిలినవారు ఉత్సాహంగా యుద్ధం చేశారు. అప్పుడు ద్వివిదుడు కోపంతో ఒక శిఖరాన్ని కుంభకర్ణుడి మీదికి విసి రాడు. యుద్ధం భయంకరంగా మారింది. ఆ సమయంలో వచ్చాడు హనుమంతుడు. జడివాన కురిసినట్లు ఆకాశాన తిరుగుతూ కుంభ కర్ణుడి తలమీద కొండ శిఖరాలను, చెట్లను వేశాడు. కుంభకర్ణుడు వాటిని తన శూలంతో నరికాడు. వారిద్దరి మధ్య యుద్ధం సాగింది. వానర సమూహాన్ని కుంభకర్ణుడు బక్షించాడు. చావగా మిగిలిన వానరులు వెళ్ళి రాముడి శరణు జొచ్చారు.
అంగదుడు పడిపోగానే కుంభకర్ణుడు తన శూలంతో సుగ్రీవుడి మీదికి పోగా, సుగ్రీవుడు ఒక శిఖరాన్ని ఎత్తుకుని అతడి మీదికి వేశా డు. అది కుంభకర్ణుడిని తాకి ముక్కలవగానే రాక్షసులు సింహనాదా లు చేశారు. కుంభకర్ణుడు ఒక త్రిశూలాన్ని తీసుకుని సుగ్రీవుడి మీద ప్రయోగించాడు. దానికి ఆంజనేయుడు అడ్డుపడి దాన్ని విరిచి వేశా డు. తన శూలం విరిగిపోగానే కుంభకర్ణుడు లంక దగ్గరున్న మలయ పర్వత శిఖరాన్ని పీకి దాంతో సుగ్రీవుడిని కొట్టాడు. సుగ్రీవుడు స్మృతి తప్పి పడిపోయాడు. కుంభకర్ణుడు పడిపోయిన సుగ్రీవుడి దగ్గరికి వచ్చి, అతడిని ఎత్తుకుని లంకకు వెళ్ళాడు. సుగ్రీవుడు చిక్కడం అం టే రాముడి సేనంతా చిక్కినట్లే అని కుంభకర్ణుడు భావించాడు. ఇదం తా చూస్తున్న ఆంజనేయుడు, సుగ్రీవుడు కుంభకర్ణుడి నుండి తప్పించుకుని వస్తాడని నమ్మాడు. మూర్ఛనుండి తేరుకున్న సుగ్రీవుడు, చివాలున ఆకాశానికి ఎగిరి రాముడిని చేరాడు. మరల కుంభకర్ణుడు యుద్ధభూమికి వెళ్ళి దొరికిన వానరులను మింగసాగాడు.
లక్ష్మణుడు కుంభకర్ణుడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. కుంభ కర్ణుడు లక్ష్మణుడిని లక్ష్యపెట్టక రాముడు వున్నచోటుకు వెళ్లాడు. అప్పుడు రాముడు రౌద్రాస్త్రం సంధించి కుంభకర్ణుడి రొమ్ము తాకే ట్లు వేశాడు. బాణాల బాధవల్ల కుంభకర్ణుడి చేతిలో వున్న ఆయుధా లు వాటంతట అవే జారిపడిపోయాయి. అయుధాలు పడిపోవడం తో చేతులతో యుద్ధం చేస్తూ రాక్షసులను, వానరులను మింగుతూ, ఒక కొండ శిఖరాన్ని తెచ్చి వడిగా రాముడి మీదికి వేశాడు. రాముడు దాన్ని ఏడు బాణాలతో ఖండించాడు. తరువాత తాను వేస్తున్న బాణాలు కుంభకర్ణుడిని కొట్టే సామర్థ్యం లేదని గ్ర#హంచిన రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి అతడి హస్తాన్ని ఆయుధంతో సహా నేలపడగొట్టాడు. రాముడు వేసిన బాణాలకు కాళ్లు విరిగి స్మృతి తప్పి పడిపోయాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రంతో సమానమైన ఐంద్రాస్త్రాన్ని విల్లులో సంధించి విడిచాడు. అది పిడుగులావెళ్ళి రాక్షసుడి తలను తుంపగా అది పైకి ఎగిసి నేల మీద పడగా, మొండెం వానరులను చంపుకుంటూ పోయి సముద్రంలో పడింది. యుద్ధంలో అలా కుంభకర్ణుడిని సంహరించాడు రాముడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు, 8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement