Friday, May 17, 2024

దేవుడు అనుగ్రహిస్తాడా

ఆఆధ్యాత్మికానికి సంబంధించి మనకెన్నో సందేహాలు. ఎన్నెన్నో సంశయాలు. దేవుని మీదా దేవుని ఆర్తత్రాణ పరాయణత్వం మీదా బోలెడన్ని అనుమా నాలు. దేవుడు భక్తులను ఆదుకుంటాడా? భక్తుల కోర్కెలు తీరుస్తాడా? ఎప్పుడు ఎలా ఏ రకంగా కాపాడుతాడు? ఎవరిని అనుగ్రహస్తాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు. ”గోవిందా!” అని మనం పిలవగానే ”ఇదిగో యిందా!” అని భగవంతుడు ఎదురు నిలుస్తాడంటారు. ”రామా!” అనగానే ”ఏమ్మా!” అని ప్రేమతో పలుకుతా డంటారు. ”శంభో శంకరా!” అనగానే ”ఇక్కడే ఉన్నానురా!” అని అంటాడంటారు. ”రావోయి” అని ఎలుగెత్తి పిలవగానే ”ఏమోయి!” అని ప్రత్యక్షం అయిపోతా డంటారు. ”రా రా” అని ప్రార్థించగానే ”ఏరా” అని జవాబు ఇస్తాడంటారు. ”ఈశా!” అంటే ”చూసా” అంటూ కనిపిస్తాడంటారు. ”ఉన్నావా?” అనడిగితే ”విన్నాను” అనే జవాబు వస్తుందంటారు.
అయితే ప్రతి రోజూ ఎందరో ఆర్తులు అన్నార్తులు దేవుడ్ని పిలుస్తున్నారు. కాపాడమని ప్రార్ధిస్తున్నారు. ప్రాధేయ పడుతున్నారు. పూజలు చేస్తున్నారు. గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిని దేవుడు కరుణిస్తున్నా డా? వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాడా? అని ప్రశ్నిస్తే తీరుస్తున్నాడని ఖచ్చితంగా చెప్పలేం.
ఎక్కడుంది తేడా? భగవంతుని తత్త్వం గురించి తాత్త్వికత గురించి ఋషిపుంగ వులు, మహా మునులు, మహనీయులు, అవధూతలు, అవతార పురుషులు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వగైరా మహా గ్రంథాలు చెప్పినవి,
అసత్యాలా? అభూత కల్ప నలా? అనే అనుమానం రాక మానదు.
పొరపాటు భక్తులలో ఉందా? వారి భక్తిలో లోపముందా? అనే ఆలోచనా రాక మానదు. ఏమనాలి? ఏమనుకోవాలి? అంతా అయోమయమే. గందరగోళమే.
ఇలాంటి అయోమయ పరిస్థితే ఓ శిష్యుడికి ఓసారి వచ్చింది. చేసేదేమి లేక తిన్నగా గురువు గారి దగ్గరకు వెళ్ళాడు. అంతా గురువుకి చెప్పాడు. గురువుగారు ”నీకిలాంటి పరిస్థితి రావటం సహజమే. పరమాత్మ గురించి నువ్వు విన్నవీ, జీవితా లలో నిత్యం జరుగుతున్నవీ చూసిన తర్వాత, విషయాలను బేరీజు వేసుకున్న తర్వా త అనుమానాలు సహజంగానే వస్తాయి.
అసలు విషయం చెబుతాను. అలా కూర్చో” అని శిష్యుడ్ని కూర్చోమన్నారు గురువుగారు. శిష్యుడు కూచున్నాడు. గురువు చెప్పటం మొదలుపెట్టారు.
ఒకానొక సమయంలో ఓ ఆసామి చాలా ఎత్తుగా ఉన్న ఓ కొండ పైకి వెళ్ళాడు. కొంచెం దూరంలో అంతే ఎత్తున్న మరో కొండ ఉంది. మధ్య లోతైన లోయ. కొండ
ఎక్కిన ఆసామి దురదృష్టవశాత్తూ కాలుజారి పడిపోయాడు. లోయ లోకి జారిపోతున్న సమయంలో కొండ అంచునుంచి చొచ్చుకుని పుట్టిన చిన్న మొక్క ఆసరా దొరికింది. ప్రాణ భయంతో ఆ మొక్కను పట్టుకుని వేలాడుతున్నాడు. ఆతని బరువుకు ఆ మొక్క కదిలిపోతోంది. అయినా ఆ మొక్కను పట్టుకునే లోయలో వేలాడుతూ భగవంతుడిని వేడుకుంటున్నాడు. అతని బరువుకి ఆ మొక్క ఊడిపోయేలా ఉంది. అయినా వ్రేలాడుతూనే దేవుడ్ని బిగ్గరగా ప్రార్ధిస్తు న్నాడు. మొక్కను మాత్రం వదలడం లేదు ఆసామి. ఇంతలో అశరీరవాణి ”మరో క్షణంలో ఊడిపోయే ఆ చిన్న మొక్క నిన్ను ఏ రకంగా కాపాడగలదు? దేవుడిపైన పూర్తి భారం వేసి ఆ మొక్కను వదిలేయ్‌” అని చెప్పింది.
అశరీరవాణి మాటల్ని ఆ ఆసామీ కూడా విన్నాడు. అయినా మొక్కను వదల లేదు. పట్టుకునే భగవంతుణ్ణి కాపాడమని ప్రాధేయపడుతున్నాడు. ఊహంచినట్లే జరిగిపోయింది. ఆ మొక్క కొండలోంచి ఊడిపోయింది. మొక్కతో పాటే ఆ ఆసామీ కూడా లోయలో పడిపోయాడు. తల పగిలిపోయి అనంత వాయువుల్లో కలిసిపో యాడు. గురువు చెప్పటం ఆపారు.
వింటున్న శిష్యుడు గురువుగార్ని ”ఆ ఆసామి పెనుప్రమాదపు అంచున ఉన్నాడు. నువ్వే దిక్కు అని దేవుడ్ని వేడుకున్నాడు. ఆపదలో ఉన్నవారిని కాపాడటం దేవుని కర్తవ్యం. దేవుడు ఎందుకు రాలేదు? ఎందుకు ఆ ఆసామిని కాపాడలేదు?” అని గురువుని ప్రశ్నలతో ముంచెత్తాడు. మిగిలిన కథను ఓపికగా చెబుతున్నారు గురువు.
అనంత వాయువుల్లో కలిసిపోయిన ఆ ఆసామి తిన్నగా దేవుని దగ్గరకు వెళ్ళా డు. ”నేను నిన్ను రమ్మనమని కాళ్ళావేళ్ళాపడి ప్రార్ధించాను. ఎంతటి నిర్ధయుడువి నువ్వు? నువ్వూ ఓ దేవుడివేనా?” అని నిందించాడు. దేవుడు చిరునవ్వు నవ్వాడు.
”నిన్ను కాపాడాలని నేను అప్పుడు అక్కడ సిద్ధంగా ఉన్నాను. కానీ నిన్ను కాపా డే అవకాశం నువ్వు నాకు ఈయలేద”ని దేవుడు చెప్పాడు.
క్షణంలో ఊడిపోతున్న అశాశ్వతమైన ఆ మొక్కను పట్టుకునే నువ్వు నన్ను కాపాడమన్నావు. కానీ భగవంతుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు అనే అచం చల విశ్వాసంతో మొక్కను వదిలేవా? లేదే! ఆపదలో ఉన్నావు ఆలోచన రాలేదేమో నని, అశరీరవాణి రూపంలో ఆ మొక్కను వదిలేయ్‌. పూర్తి భారం దేవుని మీద వెయ్యి అని కూడా చెప్పాను. మొక్కను వదిలేవా? నేనొచ్చి కాపాడుతానో లేదోననే సంశయంతో, క్షణంలో ఊడిపోబోయే ఆ మొక్కనే నమ్ముకున్నావు. ఆ మొక్కమీద ఉన్నపాటి విశ్వాసం నా మీద నీకు ఉండి ఉంటే, నువ్వు ఆ మొక్కను వదిలి నన్ను పిలిచే వాడివి. అప్పుడు అంతా నేను చూసుకునే వాడ్ని. నువ్వు నన్ను ఓ ప్రత్యామ్నా యంగానే చూసావు. ఆ విధంగానే నన్ను పిలిచావు. ప్రత్యామ్నాయంగా ఉండే తత్త్వం నాది కాదు అని తన తత్త్వ రహస్యాన్ని బయటపెట్టాడు భగవంతుడు. అదీ విషయం!” అని కథ ముగించారు గురువుగారు.
అవును. సర్వస్య శరణాగత తత్త్వం భగవత్‌ తత్వం.దీనికి ప్రహ్లాదుని వృత్తాం తం, ద్రౌపది వస్త్రాప హరణం, గజేంద్ర మోక్షం ఉదంతాలే నిదర్శనాలు. శిష్యుడికి భగవంతుని అంతరార్ధం, అంతర్విషయం అవగతమైంది.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement