Friday, May 17, 2024

గీతాసారం(ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 16

చతుర్విధా భజంతే మాం
జనా: సుకృతినోర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ
జ్ఞానీ చ భరతర్షభ ||

తాత్పర్యము : ఓ భరతవంశశ్రేష్ఠుడా! ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్త్వజ్ఞానము నన్వేషించువాడు అనెడి నాలుగు రక ముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్తసేవను ఒనరింతురు.

భాష్యము : దుష్కృతుల వలే కాక నాలుగు రకాల సుకృతులు ఉందురు. వారు వేర్వేరు ఫలితాలను ఆశించి భగవంతుని ఆశ్రయించుదురు. కానీ భక్తికి ప్రతిఫలాన్ని ఆశించనప్పుడు మాత్రమే అది శుద్ధ భక్తిగా పరిగణించబడును. కాబట్టి వీరు ఎప్పుడైతే శుద్ధ భక్తుల సాంగత్యములోకి వచ్చుదురో అప్పుడు వారి హృదయము మారే అవకాశము ఉంటుంది. అనగా కష్టాలలో ఉన్నవారు, ధనాన్ని ఆశించేవారు, జిజ్ఞాస కలిగి ఉన్నవారు మరియూ జ్ఞానులు ఎప్పుడైతే భౌతిక ఫలితాలు, భౌతిక పరిస్థితుల మెరుగుదలపై ఆధ్యాత్మిక పురోగతి ఆధారపడి ఉండదు అని అర్థము చేసుకుంటారో వారుకూడా శుద్ధ భక్తులు కాగలుగుతారు. కాబట్టి భగవంతుని శుద్ధ భక్తిని పాటించుటకు ఇటువంటి భౌతిక భావనలన్నింటినీ విడిచిపెట్టవలసి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement