Monday, May 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 8
8.
అసత్యమప్రతిష్ఠం తే
జగదాహురనీశ్వరమ్‌ |
అపరస్పరసంభూతం
కిమన్యత్‌ కామహైతుకమ్‌ ||

తాత్పర్యము : ఈ జగము అసత్యమనియు, ఆధారములేనిదనియు, నియామకుడెవ్వడును దీనికి లేడనియు, సంగమాభిలాష చేతనే ఉత్పన్నమైనట్టి దీనికి కామము తప్ప వేరొక్కటి కారణము కాదనియు వారు పలుకుదురు.

భాష్యము : అసురులు ఈ ప్రపంచము ఊహాజనితమైనదని భావించుదురు. దీనికి ఒక కారణము గాని, ఫలితము గాని, ఒక అధిపతి గాని, ఒక ఉద్దేశ్యము గాని లేదని అంతా మిధ్య అని భావించుదురు. భౌతిక మూలకాల సమ్మేళనము వలననే సృష్టి ప్రారంభమైనదని, ఇదంతా ఒక స్వప్నము వంటిదని అజ్ఞానములో వేరువేరుగా కనిపిస్తూ ఉంటుందని భావించుదురు. అయితే వారు ఆ స ్వప్నమును అనుభవించుటకు నానా ప్రయత్నములు చేయుచుందురు. జ్ఞానమును పొందుటకు బదులు వారు స్వప్న విహారములలో చిక్కుకొని పోవుచుందురు. ఆత్మ ఉందని విశ్వసించరు. సంతానము కేవలము భౌతిక పదార్థముల కలయిక ద్వారానే ఉత్పన్నమవుచున్నదని భావించుదురు. శ్రీకృష్ణుని మాటలను లెక్క చేయక ‘నా వలనే ప్రపంచము నడుచుచున్నదని’ భావించుచుందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement