Friday, May 17, 2024

తిరుమలలో ఇక అందరికీ ఉచిత అన్నప్రసాదాలు

తిరుమల, ప్రభన్యూస్‌: రాబోవు రోజుల్లో హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు లేకుండా ఉచితంగా అన్న ప్రసాదాలు తిరుమలకు వచ్చే భక్తులకు అందచేయ నున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల-తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను 3,096.40 కోట్ల తో ఆమోదించినట్లు ఆయన తెలిపా రు. కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌-19 నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో కోవిడ్‌కు ముందువలే శ్రీవారి అర్జిత సేవలు పునరుద్దరించడంతో పాటు, సర్వ దర్శనం, శీఘ్రదర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో చైర్మెన్‌ ఆ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో రూ.230 కోట్లతో శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం, ఆసుపత్రి భవన నిర్మాణాలు రెండు సంవత్సరాలలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. తిరుపతిలోని గరుడవారథి నిర్మాణం కోసం ఏడాదిలో దశల వారిగా టీటీడీ వాటా నుంచి రూ. 150 కోట్లు చెల్లించి, వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
హోటళ్లకు స్వస్తి
ఇక తిరుమలలో రాబోవు రోజుల్లో హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేశామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు పడే వ్యాపారులకు ఇతర వ్యాపారాల చేసుకోవడానికి లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సై న్స్‌ సిటీ నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మిస్తామన్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం బంగారు వాకిలి, గోపురంకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు కేటాయించే అర్జిత సేవల టికెట్ల ధరలు పెంచినట్లు మీడియాలో జరిగే ప్రచారం అవాస్తవమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement