Sunday, April 28, 2024

ధర్మం – మర్మం : దత్త జయంతి (ఆడియోతో..)

దత్తత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ ఆవిర్భావం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయ ఆవిర్భావం జరిగిందని స్కాంద పురాణం , సహ్యాద్రి ఖండంలో చెప్పబడింది.

మార్గశీర్షే తధామాసి దశమేహ్ని సునిర్మలే
మృగశీర్ష యుతే పౌర్ణమాస్యాం జ్ఞ్యసచ వాసరే
జనయా మాస దేదీప్యమానం పుత్రం సతీశుభమ్‌
తద్విష్ణు మాగతం జ్ఞాత్వా అత్రిర్నామ అకరోత్‌ స్వయమ్‌
దత్తవాన్‌ స్వస్య పుత్రత్వాత్‌ దత్తత్రేయ ఇతీశ్వర:

మార్గశీర్ష మాసంలో పవిత్రమైన పూర్ణిమ నాడు మృగశి ర నక్షత్రం కలిగి ఉన్న బుధవారం సతీ అనసూయ దివ్యమైన కాంతులతో వెలుగొందుచున్న పుత్రుని ప్రసవించింది. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే అవతరించినాడని తెలుసుకొని అత్రి మహర్షి ఆ స్వామి తనని తానే పుత్రునిగా ఇచ్చినందుకు ఆ శిశువుకి దత్తాత్రేయగా నామకరణం చేశారు. కావున మార్గశీర్ష పౌర్ణమిని దత్తాత్రేయ జయంతిగా వ్యవహరిస్తారు.

అత్రి అనసూయల తపమునకు మెచ్చి త్రిమూర్తులు ప్ర త్యక్షమవ్వగా వారికి నమస్కరించి ఒక్కరినే పిలిస్తే ముగ్గురు ఎలా వచ్చారని అత్రిమహర్షి విస్మయం చెందగా నీవు పిలచింది ఎవరినైనా నీ హృదయములో ఉన్నది మేమేనన్న నీ భావన తెలుసుకొని నీ కోరిక ప్రకారమే ముగ్గురము నీకు పుత్రులము అవుతామని త్రిమూర్తులు వరమిచ్చారు. ఆ విధంగా బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దుర్వాసుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు అవతరించారు. అత్రి మహర్షి పుత్రుడు కావున ఆత్రేయుడు. అత్రి మహర్షికి పరమాత్మ ఇచ్చాడు అనగా దత్తుడు. దత్తుడు ఆత్రేయుడు కలిపితే
దత్తాత్రేయుడయ్యాడు.

- Advertisement -

దత్తాత్రేయుడు మహా యోగి. అయోగ్యులకు దుష్టులకు దూరంగా ఉండాలని విచిత్రవేషముతో స్థితిలో ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి.
దత్తాత్రేయుని చుట్టూ 4 శునకాలు, 8 మద్య భాండాలు, 16 మాంస ఖండాలు ఉంటాయి అలాగే 32 మంది అప్సరసలు, 64 మంది జూదరులు ఉంటారు. అంతే కాకుండా 128 ప్రలోభాలు ఉంటాయి వాటి మధ్య స్వామి ఉంటాడు. ఈ విధంగా అజ్ఞులకు, మూర్ఖులకు కనబడతాడు. అజ్ఞానులు వాటిని ఇలాగే చూసి దూరంగా వెళ్లిపోతారు.

వాస్తవంగా 4 శునకాలు నాలుగు వేదాలు
8 మద్య భాండాలు అష్టసిద్ధులు
16 మాం స ఖండాలు 16 విద్యలు అనగా షోడశ విద్యలు
32 మంది అప్సరసలు 32 బ్రహ్మ విద్యలు
64 జూదరులు 64 కళలు అనగా చతుష్షష్ఠి కళలు
128 ప్ర లోభాలు 128 తత్త్వాలు

జ్ఞానులు ఈ వాస్తవాన్ని తెలుసుకొని సేవిస్తారు. నిజమైన జ్ఞాని ప్రపంచానికి ఏమీ తెలియనివాని గానే తనను తాను చూపుకోవాలి. మూగ, అంధ, బధిర, జడ ఉన్మత్తుని వలే ఉండాలి. ఆ విధంగా ఉన్నవారిని అవధూత అంటారు. దత్తాత్రేయుడు అవధూతే. ఏమీ తెలియని వారు అన్ని తెలిసిన వారిలా కనపడతారు, అన్ని తెలిసినవారు ఏమీ తెలియని వారిలా కనపడతారు. అలా ఉండ గలిగితేనే మూర్ఖ జనులకు, వాదవివాదాలకు దూరంగా ఉండగలరు. నిజమైన పండితుడు వాదాలకు వివాదాలకు దూరంగా ఉంటాడు. తెలియనివాడు అన్ని తెలుసు అనుకొని తెలిసినవారు చెప్పినవి తప్పులని వాదానికి దిగి దురుసుగా ప్రవర్తిస్తారు. త రువాత వారే నిజ ం తెలుసుకొని ప్రశ్చాతాపాన్ని పొందుతారు. అంతదాక జ్ఞాని ఓపిక పట్టాలి వారిని ఉపేక్షించాలి. వారితో వాదానికి దిగితే ఆ వ్యక్తి భావానికి విలువ ఇచ్చినట్లే అవుతుంది.

అన్యస్య దోష గుణచిన్తన మాశు త్యక్తా
వైరాగ్య రాగరసికోభవ

అంటుంది పద్మపురాణం అనగా ఇతరుల దోషాలను, గుణాలను ఆలోచించకు. అన్నింటిని విరక్తితో ఉపేక్షించు అని అర్ధం. పరంజ్యోతి, పరంధామ, పరమాత్మ, సనాతనాలు. ధ్యానంలో అందరూ మారే అవకాశం లేదు. అజ్ఞానులు దగ్గిరొకొచ్చి ఆశ్రయిస్తే జ్ఞానులు జ్ఞాన భిక్ష పెట్టాలి. వారి అజ్ఞానాన్ని తీసుకొని జ్ఞానాన్ని ఇవ్వాలి. ఏదీ నీది కాదు, ఏదీ నీవు కాదు అంతా పరమాత్మ నడిపిస్తున్నాడు. ఇచ్చినా తీసుకున్నా పరమాత్మే కావున పరమాత్మ ఇస్తే తీసుకోవాలి, తీసుకున్నది ఇవ్వమంటే వెనక్కి ఇచ్చేయాలి. పరమాత్మ అంటే ఆనందమే దు:ఖానికి తావులేదు. అజ్ఞానులు దు:ఖిస్తారు జ్ఞానులు దు:ఖంలో ఆనందం చూస్తారు.

స్కాంద పురాణనుసారం దత్తాత్రేయ జయంతి నాడు భక్తి శ్రద్ధలతో బ్రాహ్మీ ముహూర్తమున స్నానం ఆచరించి నూతన వస్త్రములు గాని ధౌత(ఉతికిన) వస్త్రములను కాని ధరించవలెను. విభవము కొలది బంగారం, వెండి, రాగి లేదా పంచలోహములతో అనఘాదేవితో కూడిన దత్తాత్రేయ ప్రతిమలకు బ్రహ్మణోత్తములతో షోడశోపచార పూజ జరిపించి దత్తాత్రతేయ ఉత్పత్తి కథను, వ్రత కథను వి నవలెను. శక్తి మేరకు పక్వాన్నములను నివేదన చేసి మంగళ నీరాజనాదులు సమర్పించి యధాశక్తి బ్రాహ్మణోత్తములకి వస్త్రాభరణ, తాంబూల దక్షిణాదులను సమర్పించవలెను. శక్తి మేరకు బ్రాహ్మణులను భుజింపచేసి వారి అనుమతితో బంధు మిత్రులతో కలసి భుజించి రాత్రికి జాగరణ చేయవలెను. మరునాడు పాడ్యమి నాడు తెల్లవారు జామునే స్నానమాచరించి మరల దత్తాత్రేయ అనఘాదేవికి బ్రహ్మణోత్తములతో ఆరాధన చేయించి ఆ ప్రతిమలను వారికి దానం చేసి ఆశీర్వచనం పొందినచో తలచిన పనులన్నీ సిద్ధించును. ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర, పౌత్ర, ధన, ధాన్య, గృహ, పశు, భృత్య సంపదలు పెరుగును. శ్రద్ధా భక్తులు కలవారు దత్తాత్రేయ జయం తి నాడు హోమం, యజ్ఞ, యాగములు దత్తాత్రేయునికి ప్రీతికరంగా ఆచరించినచో విశేష ఫలితం లభించును.

దత్తాత్రేయుని ఆరాధించి కార్తవీర్యార్జునుడు గొప్ప యోగమును, భుజబలమును, అఖండ సామ్రాజ్యమును, వెయ్యి బాహువులను పొందాడు. కార్తవీర్యార్జునుడు తన సాటి మరెవ్వరూ ఉండరని అందుకే దత్తాత్రేయునితో సమానుడైన వానితో మరణించాలని కోరుకున్నాడు. విష్ణువే పరశురామునిగా అవతరించి కార్తవీర్యార్జునుని వధించాడు. పరశురాముడు అలర్కుడు, కుంభీనసుడు, భీష్ముడు మొదలైన వారెందరో దత్తాత్రేయుని వద్ద యోగమును అభ్యసించి మహాత్ములుగా ప్రసిద్ధి పొందారు.

కష్టాలు వైరాగ్య ప్రదాలు, విజ్ఞాన వీచికలు. తత్త్వాన్ని, యోగాన్ని, సత్యాన్ని లోకానికి ఉపదేశించిన మహావధూత అయిన దత్తాత్రేయ స్వామి జయంతి నాడు ఆయన ఉపదేశాలను విందాం, వినిపిద్దాం, ఆచరిద్దాం. ఆచరింపచేస్తే లోక మంతా పరమాత్మమయమే అవుతుంది.

‘జయగురుదేవదత్త’ అను మంత్రం పఠించి అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వీచికలను ప్రసరింప చేయాలి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement