Sunday, October 6, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

దేశ: కాల: పాత్రం వితరతి విత్తస్య కమపి మహిమానం
అబ్ధితలే శుక్తి పుటే స్నాతం ఘనతోయ మేతి మణి భావమ్‌

ధనమునకు దేశము, కాలము, ప్రాంతము ఒక విధమైన గొప్పతనాన్ని సమకూర్చును. మబ్బు నుండి వచ్చు నీరు సముద్రజలమున నున్న ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది కదా.

ఒకే వస్తువు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గొప్పతనాన్ని ఆపాదించుకుంటుంది. ఆకలిగొన్న వానికి అన్నము, రోగము వచ్చిన వారికి మందు, చలివేసిన వారికి దుప్పటి దరిద్రునికి ధనము, బాలురకు క్రీడా వస్తువులు, కరువు కాటకాలలో భోజనము, యవ్వనంలో వస్త్రాభరణాలు, వార్ధక్యంలో ఆశ్రయం ఇవి కొద్దిగా ఇచ్చినా పెద్ద ఫలాన్ని ఇస్తాయి. చలి వేసినపుడు కాక వేసవిలో మంట వేయడం, కడుపు నిండిన వాడికి భోజనం పెట్టడం, గుడ్డివానికి చందమామను చూపినట్టే. ఏ ప్రదేశంలో ఏది లేదో ఏది కరువో ఎవరికి ఏది అవసరమో ఏ కాలంలో దేన్ని కోరుతారో ఆ వస్తువులను దానం చేస్తే మంచి పేరు లభిస్తుంది. ఒకే వస్తువు వేరు వేరు చోట్ల వేర్వేరు స్థితిని పొందుతుంది. మబ్బు నుండి వచ్చిన వాన చుక్క తామరాకు మీద పడితే అంటకుండా ఉంటుంది, ఎండిన మొక్కలపై పడితే ఆ మొక్కలు తిరిగి చిగురిస్తాయి, ముత్యపు చిప్పలో పడితే ఆ నీటి చుక్కే ముత్యం అవుతుంది. కావున దానం చేసేటపుడు దేశ,కాల, ప్రాంతములను చూసి దానం చేయాలన్నది ఉపదేశం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూనే శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement