Friday, May 24, 2024

రామావతారంలోని ఆంతర్యం

శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు రామావతార ఆంతర్యం విశేషాలపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

రామావతారం
సహి దేవై: ఉదీర్ణస్య రావణస్య వ ధార్ధిభి:
అర్ధితో మనుషే లోకే జజ్ఞే విష్ణు: సనాతన:

అనగా రావణాసురుని వధ కోరి దేవతలు ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించెను. పులస్త్య మహర్షి(బ్రహ్మ) కుమారుడు విశ్రవ బ్రహ్మ. అతని కుమారుడు రావణ బ్రహ్మ ఇతను చతుర్ముఖి బ్రహ్మను తపస్సుతో ప్రసన్నం చేసుకొని నరవానరులు కాకుండా మరే ఇతరుల చేత వధించ బడని వరమును కోరుకొనెను. ఆ వర గర్వంతో మూడు లోకాలను సకల దేవ దానవ గణములను తన ఆధీనంలో చేసుకొని, అందమైన స్త్రీలను చెరబట్టి పీడించుచూ లోకకంటకంగా ధర్మమును భంగ పరుచు వాడిగా ప్రవర్తించగా దేవతలు దశరధ మహా రాజు యజ్ఞంలో శ్రీమన్నారయణుని ప్రార్థించగా ఆ స్వామి రామునిగా అవతరించెను.
అయితే శ్రీరామావతారానికి ప్రధాన ప్రయోజనం రావణ వ ధే కాకుండా సాధు జన రక్షణ, ధర్మ రక్షణ. రావణాసురుడిని శ్రీహరి వైకుఠం నుండే ఏ వరాన్నైనా ఎదురించి సంహరించే శక్తి సామర్థ్యాలు ఉన్నా ధర్మ రక్షణకై రామావతారం ఎత్తి పదకొం డువేల సంవత్సరాలు ఈ భూమిపై జీవనం సాగించెను. రావణసంహారమే ప్రధాన ధ్యేయం అయితే వామనుని వ లే, నరసింహుని వలే అవసారార్థం అవతరించి రావణుని సంహరించవచ్చు. రామావతార ప్రధాన ప్రయోజనం ధర్మమును ఆచరించి అంద రి చేత ధర్మం ఆచరింప చేసి ధర్మము తప్పిన వారిని దండించుటకే. ధర్మమును ఆచరించిన నాడే మానవుడు పరిపూర్ణుడు అవుతాడని లోకానికి బోధించటం రామావతార ఆంతర్యం. ఒక పుత్రునిగా, సోదరునిగా, మిత్రునిగా, భర్తగా, రాజుగా, శిష్యునిగా, గురువుగా, ధర్మ నిర్దేశకునిగా ఎలా ప్రవర్తించాలో తాను ఆచరించి లోకానికి చాటిన ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రమూర్తి. సమస్యలు ఎదురైనప్పుడు పిరికి వాని లా తప్పుకోవడం కాక ధృడచిత్తంతో స్థిర సంకల్పంతో దైవ సహకారంతో ఎదురించినపుడు విజయం సాధిస్తాం అనేది రామ నీతి సూత్రం.
ప్రీతికి, భక్తికి, మైత్రికి, విశ్వాసానికి, నిర్మలత్వానికి నిర్మల హృదయమే నిజమైన కొలబద్ద. తప్పు చేసిన వారిని శిక్షించక వారిలో పరివర్తన తేవాలని, వధించడం అనేది చివరి అస్త్రం మాత్రమే అని బోధించినవాడు రాముడు. శబరిని పరమ భక్తాగ్రేసురాలిగా భావించి ఆమెతో ఆచార్య వైభవాన్ని విన్నాడు. వానరులైన సుగ్రీవాదులతో స్నేహం చేసాడు. రావణాసురుని సర్వాత్మగా నిరాధాయుణ్ని, నిస్సహాయుణ్ణి చేసి, అన్ని కూర్చుకొని తిరిగి యుద్ధానికి రమ్మని అపుడు తన బలాన్ని చూడమని పంపించిన రాముడు అప్పటికైనా రావణాసురుడు నిజం తెలుసుకొని శరణు వేడితే రక్షించాలనుకున్నాడు. కానీ విధిలేని పరిస్థితుల్లో లోక రక్షణకు, ధర్మ రక్షణకు రావణుని వధించాడు.

మంచి భర్త అనిపించుకోవడం కంటే ప్రజలు సుఖ సంతోషాలను ప్రజా శ్రేయస్సును కోరి మంచి రాజుగా అనిపించు కోవాలని భార్యనే త్యాగం చేసిన వాడు రాముడు. మంచి అన్నగా రాజ్యాన్ని, మంచి రక్షకునిగా తన సౌకర్యాలను, మంచి మిత్రునిగా తన కీర్తిని త్యాగం చేసాడు. అలాగే దైవంగా తన దైవత్వాన్ని త్యాగం చేసి మానవునిగా పుట్టాడు అందుకే ”రామో విగ్రహవాన్‌ ధర్మ:” అని మారీచుడు, ఉత్తమ ధార్మికుడని తార, ప్రఖ్యాతవీరుడని రావణాసురుడు పొగిడారు. అందుకే రాముడంటే ధర్మం, రాముడంటే త్యాగం, రాముడంటే సత్యం.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement