Friday, December 6, 2024

అన్నమయ్య కీర్తనలు : అందరికి నెక్కుడైన

రాగం : కానడ
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు || ||అందరికి నెక్కుడైన||

బల్లిదుడై లంకచొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చి
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు || ||అందరికి నెక్కుడైన||

దాకొని యాకెముందర తన గుఱుతెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు || ||అందరికి నెక్కుడైన||

కొంక కిట్టె సంజీవికొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవేంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు || ||అందరికి నెక్కుడైన||

Advertisement

తాజా వార్తలు

Advertisement