Friday, April 26, 2024

సత్యం… భగవత్‌ స్వరూపం

సత్యం మీదే ఈ జగత్తు ఆధారపడి ఉంది కానీ సత్యం మన కంటికి కనిపించదు. కంటికి కని పించేదంతా ఓ భ్రమ. జ్ఞానవంతులు మాత్రమే సత్యాన్ని చూడగలరు. అనుభూతించగలరు” అంటారు ఆదిశంక రులు. దీర్ఘంగా ఆలోచిస్తే శంకర భగవత్పాదుల మాటల్లో సత్యం అనేది ఓ భావన అయినా అందులోనే దైవం నిరా కారంగా నిండి ఉంటుందని అర్థమవుతుంది.

గోస్వామి తులసీదాసు ఇదే భావాన్ని ఓ పద్యంలో ఇమిడ్చి చెప్పాడు.
ఝాఠేవు సత్య్‌ జాహి బిను జానే
జిమి భుజంగ్‌ బిను రజు పహిచానే
జేహి జానే జగ్‌ జాయీ హేరాయీ
జాగే జథా సపన్‌ భ్రమ్‌ జాయీ

”నిర్గుణుడు, నిరాకారుడైన భగవంతుని గురించి తెలి యని అజ్ఞానులు అసత్యాలను సత్యాలుగా నమ్ముతారు. రాత్రి తాడును చూసి పాముగా భ్రమిస్తారు. అదే భగవం తుని గురించి తెలిసిన జ్ఞానులు సత్యాలను అసత్యాలుగా ఎప్పుడూ నమ్మరు. నిద్రలో గన్న కలల్ని మేలుకోగానే ఆ కలల్ని భ్రమలుగా అసత్యమైనవిగా భావిస్తారు” అంటాడు కవి.
సత్యమే భగవంతుడని, సత్యంతోనే భగవంతున్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని, అసత్యం ఎప్పుడూ లేనిది ఉన్నట్టుగా చూపుతూ మోసం చేస్తుందని పద్యం మనకందించే సందేశం. తెలుగులోని ప్రజాకవి వేమన వలె హిందీలో ప్రఖ్యా తి చెందిన సంత్‌ కవి కబీరుదాసు. తులసీదాసు భావానికి సరిపోలే భావాన్ని వ్యక్తపరుస్తూ కబీరు ”సాంచ్‌ బరాబర్‌ తప్‌ నహిఁఝాఠ్‌ బరాబర్‌ పాప్‌…” అనే పద్యంలో సత్యాన్ని మించిన తపస్సుగాని అసత్యాన్ని మించిన పాపంగాని ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎవరి హృదయంలో సత్యం అనే భావన ఉంటుందో వారిలోనే భగవంతుడు కొలువై ఉంటాడని అంటాడు.

వేదాల సారం, ఉపనిషత్తుల వివరణ, పురాణతిహాసాలు సత్యాన్ని గురించి నొక్కి చెబుతూ, సత్యాన్ని మనసావాచా కర్మ ణా ఆచరించమంటున్నాయి. అన్నీ సత్యాన్ని ఆధారంగా చేసు కొని నడిచినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది. అందుకే సత్యాన్ని మించిన శక్తి మరొ కటి లేదు.
వాల్మీకి రామాయణంలో జాబాలి నాస్తిక వాదాన్ని ఖండి స్తూ రామచంద్రుడు ”సత్యమే వేశుృరో లోకే ధర్మాశ్రీత సదా, సత్యమూలాని సర్వాణి సత్యన్నాస్తి పరం పదమ్‌” అన్నాడు. అంటే… లోకంలో ధర్మానికి సత్యమే పరాకాష్ఠ. సత్యవాది మాత్ర మే ఉన్నత స్థానానికి చేరగలడు. సర్వ సుఖసౌఖ్యాలకు, సంపద లకు మూలం సత్యం. స్వర్గప్రాప్తికి సులభమయిన మార్గం ఏర్పరచ గలిగేది సత్యమే! అందుకే సత్యమే భగవత్స్వరూపం.
ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వంలో ”నుత జల పూరి తంబులగు…” అనే పద్యం. భరతుణ్ని కుమారునిగా స్వీకరిం చడానికి దుష్యంతుడు నిరాకరించినప్పుడు సత్యం విశిష్టతను శకుంతల నోట పలికించాడు నన్నయ.
”నూరు మంచినీటి చేదుడు బావుల కన్నా ఒక్క దిగుడు బావి మేలైనది. వంద దిగుడు బావులకన్నా ఒక మంచి క్రతువు (యజ్ఞం) మేలైనది. అలాంటి వంద క్రతువులకన్న ఒక కుమారుడు మేలైనవాడు. అలాంటి వందమంది కుమా రులుకన్నా గొప్పనైనది, శ్రేష్టమైనది సత్యం” అని ఆ పద్యం చెబుతుంది. ఆ క్రమంలోనే వచ్చే మరో రెండు పద్యాలు కూ డా సత్యం గొప్పతనాన్ని చాటి చెప్పాయి.
అలాగే తీర్థయాత్రలు, వేదాధ్యయనం చేయడంవల్ల కలిగే ఫలితాలు కూడా సత్యం ముందు దిగదుడుపే! సర్వ ధర్మాలకన్నా సత్యమే శ్రేష్టమైనదిగా ఋషులు, మునులు స్పష్టంగా చెప్పారు. సత్యానికి, ధర్మానికి వంచన జరిగినప్పుడు పరమా త్ముడు అవతరించడమేగాక తానెవరో తన సత్యరూపమె లాంటిదో చూపి దుర్మార్గులను సన్మార్గులుగా పరివర్తన చెందేలా ప్రయత్నిస్తాడు. వారిలో పరివర్తన కలగనప్పుడు అంతం చేయ పరిస్థితులు కల్పిస్తాడు.

మహాభారతంలోని ఉద్యోగ పర్వం…సత్యం, ధర్మం తెలిసి కూడా ఆచరణలో పెట్టలేని కౌరవులకు మళ్లి ఒకసారి గుర్తు చేయడానికే కూర్చబడినట్టు చెబుతారు పండితులు. కృష్ణపరమాత్మ కౌరవ పాండవుల మధ్య సంధి చేయ కౌరవ సభకు వచ్చి యుద్ధం నివారింపబడాలని చెబుతూ పాండవులు అయిదుగురికి ఐదు ఊర్లు ఇచ్చినా సంతృప్తిపడ తారని కౌరవులకు నచ్చజెప్ప ప్రయత్నించాడు. అయినా కౌరవులు పరమాత్ముని వచనాలు పెడచెవిన బెట్టడమేగాక కృష్ణ భగవాణున్ని సామాన్యునిగా భావించి బంధించ ప్రయత్నించారు. అసత్యపరులు అహంకారులు తనను తెలుసుకోలేని అజ్ఞానులని భావించిన భగవానుడు తన విశ్వ రూపాన్ని ప్రదర్శించి తనెవరో తెలియజేసాడు. ప్రస్తుత కాలంలో విజ్ఞానపరంగా మనం ఎంతో అభివృద్ధిని సాధించాం. సాధిస్తున్నాం కూడా! కానీ సత్యం, న్యాయం, ధర్మం వంటి వాటిపై శ్రద్ధ చూపడం లేదనేది ముమ్మాటికి నిజం. సత్య ధర్మాలపై అశ్రద్ధ కారణంగానే మనం ప్రకృతి వైపరీత్యా లకు గురవుతున్నాం. ప్రాణాలను పణంగా పెట్టుకుంటున్నాం. ఇకనైనా మనం మేలుకొని సత్యంతో కూడిన ఆలోచనలు, ఆచర ణలు ఆచరించ ప్రయత్నిద్దాం. సత్యంలోనే భగవంతుడున్నా డని నమ్ముదాం. అన్నింటిలో సత్యవా దులవుదాం.

– పరికిపండ్ల సారంగపాణి
9849630290

Advertisement

తాజా వార్తలు

Advertisement