Friday, May 3, 2024

భాద్రపద శుక్ల అష్టమి (ఆడియోతో…)

భాద్రపద మాస కర్తవ్యాల గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శుక్లాష్టమీ తిధిర్యాతు మాసి భాద్రపదే భవేత్‌
దూర్వాష్టమీతు సాజ్ఞేయా నోత్తరాసావిధీయతే

భాద్రపద శుక్ల అష్టమి సప్తమీ విద్ధ అయినదే గ్రహించవలెను. నవమి విద్ధను గ్రహించరాదని హేమాద్రి యందు చెప్పియున్నారు. భాద్రపద శుక్ల అష్టమిని దూర్వాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. చంద్ర లగ్నమందు చంద్రుడు ఉచ్ఛలో ఉన్నపుడు భాద్రపద శుద్ధ అష్టమి పూర్వమందైనా, పరమందైనా దూర్వాష్టమిగా వ్యవహరించాలి. కానీ ఈ దూర్వాష్టమి మూల మరియు జ్యేష్ఠ నక్షత్రం లేనపుడు ఆచరించాలి.

దూర్వాష్టమీ సదాత్యాజ్యా జ్యేష్ఠా మూలరక్ష సంయుతా

అనగా జ్యేష్ఠ నక్షత్రంతో ఉన్న దూర్వాష్టమి ఆచరించినచో సంతానము క్షయమగునను మరియు ఆయుష్యము హరించును. అందువల్ల జ్యేష్ఠ, మూలలతో ఉన్న దూర్వాష్టమిని త్యజించాలి.

- Advertisement -

సింహస్థే సోత్తమాసూర్యే అనుదితే ముని సత్తమా

ఈ దూర్వాష్టమిని కన్యా సంక్రమణంలో కాకుండా సింహ సంక్రమణంలో ఆచరించాలి అని స్కాంద పురాణంలోని మదన రత్నంలో చెప్పబడింది. భాద్రపద శుక్ల అష్టమి నాడు లక్ష్మీదేవిని కానీ గౌరీ దేవిని కానీ 108 గరిక దళములతో పూజించవలెను. గరిక పూలు దొరికినచో లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని సూర్యోదయమునకు ముందే పూజించవలెను. స్త్రీలు ఈ దూర్వాష్టమి వ్రతమును తప్పక ఆచరించవలెను.

యాన పూజయతే దూర్వామోహాదిహ యధావిధి
త్రీణి జన్మాని వైధవ్యం లభతే నాత్ర సంశయ:

అనగా దూర్వాష్టమి వ్రతాన్ని మోహం వలన అహం వలన ఆచరించని స్త్రీలు మూడు జన్మలలో వైధవ్యాన్ని పొందెదరు. కావున ప్రతీ సంవత్సరం స్త్రీలు దూర్వాష్టమి వ్రతమును శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. ఈ వ్రతమును ఆచరించినచో 82 జన్మలు భర్తృ వియోగమును పొందక భర్త అనురాగం, ఉత్తమ సంతానం, సమాజ గౌరవం లభించును.

ఒకవేళ జ్యేష్ఠ, మూల నక్షత్రాలే అష్టమి నాడు ఉన్నచో ఆరోజు ఒక పూటే భుజించి దూర్వ(గరిక) ను లక్ష్మీదేవి, పార్వతీ దేవిగా పూజించవలెను కానీ దూర్వాపూజ లేకుండా ఉండరాదు.

శుచౌ దేశే ప్రజాతాయాం దూర్వాయాం బ్రాహ్మణోత్తమా
స్థాప్య విష్ణుం తతో గంధై: పుష్పై: ధూపై: సమర్పయేత్‌
దధ్యక్షతై: ద్విజశ్రేష్ఠ అర్ఘ్యం దద్యాత్‌ త్రివిక్రమే
దూర్వాశమీభ్యాం విధివతు పూజయేత్‌ శ్రద్ధయాన్విత:

పరిశుద్ధమైన పవిత్రమైన ప్రదేశము నందు పుట్టిన గరిక యందు శ్రీమహావిష్ణువును ప్రతిష్టించి గంధ, పుష్ప, ధూప, దీపములతో, దధీ అక్షితలతో(పెరుగుతో కలిపిన లక్షితలతో) త్రివిక్రమునికి అర్ఘ్యము ఇవ్వవలెను. గరికతోటి, జమ్మి ఆకుతో శ్రీమహావిష్ణువుని పూజించవలెను. పై శ్లోకంలో ‘విష్ణుం’ అన్న చోట ‘లింగం’ అని ‘త్రివిక్రమే’ ఉన్న చోట ‘త్రిలోచనే’ అని కూడా చెప్పియున్నారు. అనగా శివ భక్తులు ఈ దూర్వాష్టమి నాడు గరికపై శివలింగం ఉంచి పూజించవలెను.

పూజా మంత్రం :-
త్వం దూర్వే అమృత జన్మాసి వందితాహి సురాసురై:
సౌభాగ్యం సంతతిం దేహి సర్వ కార్య కరీభవ
యధా శాఖా ప్రశాఖాబి: విస్తృతాసి మహీతలే
తధా మమాపి సంతానం దేహిత్వం అజరామరం

అనగా దూర్వా నీవు అమృతమున పుట్టినావు, సురాసురలతో నమస్కరించబడుతున్నావు, నాకు సౌభాగ్యమును సంతానమును ప్రసాదించు, సర్వ కార్యములను ఆచరింపజేయి. నీవు శాఖ, ప్రశాఖలతో విస్తరించినపుడు నాకు కూడా అజరామరమైన సంతానమును ఇమ్ము.

ఇక అధిక భాద్రపద మాసమొచ్చినపుడు శుక్ల పక్షములో జ్యేష్ఠా నక్షత్రము వచ్చిన నాడు జ్యేష్ఠా నక్షత్ర పూజ లేక జ్యేష్ఠాదేవి పూజను ఆచరించాలి. ఈ పూజ రాత్రి చేయవలెను. జ్యేష్ఠాపూజ చేసి ఈ క్రింది మంత్రముతో ఆవాహన చేయవలెను.

ఈ మంత్రముతో పూజించి
ఏ హ్యేహిత్వం మహాభాగే సురాసుర నమస్కృతే
జ్యేష్ఠెత్వం సర్వదేవానాం మత్సమీప గతాభవ

అనంతరం క్రింది ఇచ్చిన ధ్యాన, అర్ఘ్య మంత్రములను పఠించవలెను.

జ్యేష్ఠాయైతు నమస్తుభ్యం శ్రేష్ఠా యైతే నమోనమ:
శర్వాయైతే నమస్తుభ్యం శాంకర్యైతే నమోనమ:
జ్యేష్ఠే శ్రేష్ఠే తపో నిష్ఠే బ్రహ్మిష్ఠే సత్య వాదిని
ఏహ్యేహిత్వం మహాభాగే అర్ఘ్యం స్వీకురు సరస్వతి!

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement