Thursday, May 16, 2024

పుష్పక విమాన ప్రయాణం

పిమ్మట విభీషణుడు రాముని వద్దకు చేరి, ”మహాత్మా! స్నానాది కార్యాలను ముగించి మా ఆతిథ్యాన్ని స్వీక రించండి. కొలది కాలం లంకలో ఉండి, నన్ను ధన్యా త్ముని చేయుడ”ని ప్రార్థించాడు. రాముడు భరతునికి ఇచ్చిన మాటను, అతని కఠోర దీక్షను తెలిపాడు. వెంటనే అయోధ్యను చేరుట మా వంశానికి శుభప్రదం అని పలికి విభీషణుని కోరికను సున్నితంగా తిరస్కరించాడు.
రాముని మనస్సు తెలిసి విభీషణుడు వెంటనే పుష్పక విమానం తెప్పించాడు. విభీషణుడు, సుగ్రీవుడు మున్నగువారు తాము కూడ అయోధ్య కు వస్తామన్నారు. రాముడు అంగీకరించాడు. సుగ్రీవాది వానర శ్రేష్టులతో విభీషణాదులతో అయోధ్యకు వెళ్ళాలని నిశ్చయించాడు. ”మీతో కలిసి భరతుని చూడడం నాకు సంతోషకరం” అన్నాడు రాముడు.
సీతా రామ లక్ష్మణులు, విభీషణుడు, అతని సచివులు, సుగ్రీవ హనుమంతాది వానర శ్రేష్టులు పుష్పక విమానాన్ని అధిరోహించారు.
శ్రీరాముని సంకల్పాన్ని అనుసరించి పుష్పక విమానం ఆకాశానికి ఎగిరింది. రాముడు ఆయా ప్రాంతాల విశేషాలను సీతకు ఇలా వివరించాడు.
”సీతా! త్రికూట పర్వతంపై శోభాయ మానంగా విరాజిల్లు తున్న లంకా నగరాన్ని చూడుము. రాక్షస వీరుల రక్త మాంసాల బురదతో నిండిన యుద్ధభూమిని చూడుము. రావణ కుంభ కర్ణాది సోదరులు, మేఘనాదాది రావణ పుత్రులు, ప్రహస్తాది రాక్షస మంత్రులు, సేనాపతులు, తక్కిన రాక్షస వీరులందరిని చంపిన ప్రాంతం ఇదే! మండోదరి భర్త వక్షంపై వాలిపోయి ఏడ్చిన ప్రాంతం ఇదే. ఇదిగో ఈ సముద్ర తీరంలో నాటి రాత్రి మేము విశ్ర మించాం. వానర వీరుడైన నలుడు వానర వీరుల సాయంతో నీ కొరకు సముద్రంపై సేతువు నిర్మించాడు. దానిని ఒక్కసారి చూడుము.
భయంకరమైన అలలతో ఎగసి ఎగసి పడుతున్న మహా సముద్రం ఘోషను విన్నావా! అదిగో సముద్రంపై హను మంతుడు ప్రయాణిస్తున్నప్పుడు తనపై విశ్రాంతి తీసుకొనుమని సముద్ర గర్భం నుండి పైకి వచ్చిన మైనాక పర్వతం!
ఇదిగో సముద్రం ఉత్తర తీరాన్ని చేరాం. ఇది సేతుబంధం అని ప్రసిద్ది గాంచింది. ఇక్కడి నుండే సేతువు నిర్మాణాన్ని ఆరంభిం చాం. ఇది పరమ పావనమైన శైవ క్షేత్రం. ఇక్కడే పరమశివుడు నన్ను అనుగ్రహించాడు. విభీషణుడు నన్ను శరణు కోరిన ప్రాంతం కూడా ఇదే! అన్నాడు రాముడు.
”తార, రుమ మున్నగు వానర స్త్రీలతో అయోధ్య చేరాలనే నా ముచ్చట తీరుతుందా?” అని సీత తన కోరికను వెల్లడించింది.
రాముడు అంగీకరించాడు పుష్పక విమానం కిష్కింధలో ఆగింది. సుగ్రీవుడు దిగి అంత:పుర స్త్రీలతో మరల పుష్పక విమానాన్ని అధిరోహిం చాడు. విమానం ఆకాశానికి ఎగిరి రుష్యమూక పర్వతాన్ని సమీపించింది. ”సీతా అదిగో రుష్య మూక పర్వతం! నేను సుగ్రీవునితో స్నేహం చేసిన ప్రాంతం ఇదే. మా స్నేహాన్ని పటి ష్టం చేసిన ఆత్మ బంధువు హనుమంతుడు సుమా! అదిగో మతంగవనం, అదిగో శబరి ఆశ్రమం. శబరి మాకు ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఇదే. ఇదిగో కబంధుని వధించిన ప్రాంతం. అదిగో జటాయువు నివాసం వటవృక్షం. నిన్ను రక్షించడానికై తన ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన ప్రాంతం ఇదే. ఖర దూషణాది రాక్షసులు పద్నాలుగు వేలమందిని వధించిన ప్రాంతం ఇదే. అదిగో మనం నివసించిన పావన గోదావరి తీరమందలి పంచవటి!
ఈ పర్ణశాల నుండి రావణుడు నిన్ను అపహరిం చాడు కదా! అదిగో గోదావరి! ఇదిగో అగస్త్యాశ్రమం! అల్లదిగో సుతీక్షుని ఆశ్రమం! పండు ముసలి పతివ్రతా శిరోమణి అనసూయ నిన్ను చేరదీసి అనుగ్రహించిన ఆశ్రమం ఇదే! ఇదిగో ఈ కనబడుతున్న ప్రాంతమే చిత్ర కూట పర్వతం. భరతుడు తల్లులతో వచ్చి నన్ను ప్రార్థించి, నా పాదుకలను భక్తితో కొనిపోయిన ప్రాంతం ఇదే.
సీతా! ఇదిగో భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సమీపించాం. అల్లదిగో నా మిత్రుడు గుహుడు పాలించే శృంగిబేరపురం!
అని రాముడు వివరించాడు.

– కె.ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement