Monday, May 20, 2024

నేడు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శారదాపీఠా దిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి జన్మదిన వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న పలు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. నాగుల చవితి పర్వదినం రోజున జన్మించిన స్వరూపానందేంద్ర ఏటా అదే రోజున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, షణ్ముఖ శ్రీ సుబ్రమణ్యశ్వరస్వామి అభిషేకం, 10 గంటలకు అవహంతి హోమం, ఆయుష్‌ హోమం, పాదపూజ, బీక్షవందనం ఘనంగా నిర్వహించనున్నారు. 11 గంటలకు భక్తులనుద్దేశించి స్వరూపానందేంద్ర అనుగ్రహ బాషణం చేస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, మధ్యాహ్నం 3 గంటలకు వేదసభ, 4 గంటలకు పేదలకు వస్త్రదానం చేపడతారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా శారదాపీఠానికి పెద్ద ఎత్తున భక్తులు కలిగి ఉండడంతో వారంతా కూడా స్వరూపానందేంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక శారదాపీఠం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పీఠం వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. మరో వైపు ఆదివారం కూడా అనేక ప్రాంతాల్లో భక్త బృందాలు సేవా కార్యక్రమాలు పూర్తి చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement