Friday, May 3, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

తప: పరం కృత యుగే త్రేతాయాం జ్ఞాన ముచ్యతే
ద్వాపరే యజ్ఞమేవాహు: దానమేవ కలౌ యుగే

కృతయుగంలో తపస్సు శ్రేష్ఠమైనది, త్రేతాయుగంలో జ్ఞానము ప్రధానమైనది, ద్వాపర యుగంలో యజ్ఞ ము ప్రధానమైనది, కలియుగంలో దానమే ప్రధానమని మహాభారతం ద్వారా తెలుస్తోంది.

కాలము ప్రాణి శరీర విధానంలో, బలంలో, ధైర్యంలో, సహనంలో, ఆయుష్యంలో, ఆరోగ్యంలో, ఆలోచనలో, మార్పును కలిగించడం సహజం. కృత యుగంలో శరీరపుష్టి మరియు బుద్ధికి, మనసుకి, స్థిరత్వం కష్టాలను, బాధలను తట్టుకొనే శక్తి అధికంగా ఉండేది. తపస్సు అనగా శరీరాన్ని దానికి కావాల్సిన వాటి నుండి దూరం చేయడం అనగా మనస్సు కోరే సంకల్పాలను అణచడం, వాక్కును మౌనంతో నియమించడం, బుద్ధిని దురాలోచనకు దూరం చేయడం. ఈ విధంగా శరీరాన్ని, మనసును, వాక్కును, బుద్ధిని నియమించ గల శక్తి, స్థిరత్వం, సహనం కృత యుగంలో అధికంగా ఉండేవి. అందువలన కృత యుగంలో తపస్సు శ్రేష్ఠమని చెప్పారు. త్రేతాయుగం నాటికి పైన చెప్పిన గుణాలలో కొద్దిగా హ్రాసము(తగ్గుదల) కలిగి శరీరానికి, మనసుకి కాక బుద్ధికి ఎక్కువ శ్రమ ఇవ్వడం, బుద్ధితోటే ఎక్కువ పనులు చేయడంతో త్రేతాయుగంలో జ్ఞానం శ్రేష్ఠమన్నారు.

ద్వాపర యుగంలో శరీరాన్ని, మనస్సును, బుద్ధిని ఒకే చోట ఉంచగల శక్తి సన్నగిల్లిపోవుట వలన కొద్ది రోజులు లేదా రోజులో కొన్ని గంటలు మాత్రమే కూర్చొని ఆరాధించే యజ్ఞ కర్మను ఆచరించుట సౌకర్యంగా భావించినందున ద్వాపర యుగంలో యజ్ఞం శ్రేష్టమని చెప్పారు. ఇక కలియుగంలో నెలలు, రోజులు, గంటలు, ఒకే చోట నిలిచి ఒకే పని నిరంతరాయంగా చేయగలిగే శ క్తి శరీరానికి, మనసుకి వాక్కుకు, బుద్ధికి సన్నగిల్లాయి కావున కొన్ని నిమిషాలలో చేయగలిగే దానానికి ప్రాధాన్యం వచ్చింది. దానం చేయాలనే బుద్ధి కలిగితే నిమిషాలలో దాన ప్ర క్రియ ముగుస్తుంది. కానీ ఒకసారి దానం చేయడం అలవాటు అయితే రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా దానాలు చేస్తూనే ఉంటారు. అపుడు ఆ దానమే తపస్సు, జ్ఞానము, యజ్ఞము అవుతుంది. కావున కలియుగంలో దానము శ్రేష్ఠము అన్నారు.

- Advertisement -

కొంచెం లోతుగా ఆలోచిస్తే దానం చేయడానికి కూడా మనోనిగ్రహం, బుద్ధి, స్థిరత్వం, శరీర సహకారం కావాలి. మనం అనుకున్న వస్తువును ఎదుటివారికి అప్పగించడం అంత సులభమైన విషయం కాదు అందుకే దానములో నిగ్రహం, త్యాగబుద్ధి కావాలి. అందుకే తపోయజ్ఞ జ్ఞానము కంటే దానం శ్రేష్ఠమని కలియుగంలో మరింత శ్రేష్ఠమని మహాభారతం శాంతి పర్వం ద్వారా తెలుస్తోంది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూనే శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement