Wednesday, May 1, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం, శ్రీహరి అవతార వైభవము-101(ఏ) (ఆడియోతో)…

భాగవతం ప్రథమ స్కంధం, నాల్గవ అధ్యాయంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భగవంతుని కథ…

న యద్వచ: చిత్ర పదం హరేర్యశ: జగత్పవి త్రం ప్రగృణీత కర్హిచిత్‌
తద్వాయసం తీర్థం ఉశంతి మానసా: న యత్ర హంసా: నిరమంతి ఉశిక్‌ క్షయా:

చిత్ర విచిత్రమైన పదములు, శబ్దాలంకారములు అర్థాలంకారములు, గుణములు, రీతులు, వృత్తులు, శృంగారాది రసములు, కావ్య బంధములు, చమత్కార భణుతులు (పలుకులు) ఎన్ని ఉన్ననూ సకల జగముల ను పవిత్రము చేసే శ్రీహరి కీర్తిని చెప్పనివాడు ఆ కావ్యము కాకులు స్నానము చేయు తీర్థమే (గుంటయే) అవుతుంది.

స్త్రీల సౌందర్యాన్ని, పురుషుల పరాక్రమాన్ని, పిల్లల అల్లరి చేష్ట లను చెప్పే కథలు ఎంత చిత్రవిచిత్రంగా చెప్పినా ఎంత ఉత్తమ కావ్యాలని పొగిడినా భగవంతుని పేరు, గుణాలు లేకుంటే ఆ కథలు, ఆ కథలను వ్రాసిన వారి బ్రతుకులు కాకి స్నానం చేసే గుంటలే. ఎందుకంటే వారి జీవితం మొత్తంలో ఏనాడు ఏ ఒక్క క్షణమైనా సంతృప్తికరంగా సాగుతుందా. అనుమానం, భయం, ఆవేదన, ఆలోచన, ఆక్రోషం లేకుండా గడుస్తాయా. రాజుకు ఎప్పుడు శత్రువు ఆక్రమిస్తాడా అని, భార్యభర్తలకు కలహం ఎప్పుడు కలుగుతుందో అనే ఆందోళనతో ఉంటారు. అలా ఆందోళన నిండిన బ్రతుకులు బ్రతుకులే కాదు. ఇవన్నీ కాకి స్నానం చేసే గుంటలే. ఈ కథలు భగవద్భక్తులు వింటారా అంటే మానస హంసలు అనగా మనస్సులో పరమ హంసలు అయిన భగవంతుడిని స్మరించే పరమ భక్తాగ్రేసరులు ఈ కథలు విని సంతోషిస్తారా.? భగవంతుని కథలేని మాటలేని ఎంత గొప్ప కావ్యమైనా కాకి స్నానం ఆడే గుంటలే. ‘వ్యాస మహర్షి! నీవు మహాభారతమును, ఇతర పురాణములను రాసినా అందులో భగవంతుడిని ప్రధానంగా చెప్పలేదు. భగవంతుని గురించి చెప్పని కథ చెప్పినవానికి విన్నవానికి రుచించదు’ అని నారదుడు వ్యాసమహర్షితో పలికెను.

- Advertisement -

– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement