Thursday, May 9, 2024

అన్నమయ్య సంకార్తనలు

రాగం – తిలంగ్‌
తాళం – రూపక

ప|| ఏమొకో చిగురుటధరము ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా || ఏమొకో ||

చ|| కలికి చకోరాక్షిక కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు
నలువున ప్రాణశ్వరుపై నాటిన యా కొన చూపులు
నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదుకదా || ఏమొకో ||

చ|| పడతికి చనుగవ మొరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవికాలపు వెన్నెల కాదు కదా || ఏమొకో ||

చ|| ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లులు జేర్పుల
ఒద్దిక లాగులివేమో నూహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా || ఏమొకో ||

- Advertisement -

భావము : ఇద్దరు చెలుల నడుమ సాగే సంభాషణగా ఈ సంకీర్తన సాగింది. అమ్మవారి పెదవి చిగురు వలెనున్నది. దానిపై అచ్చటచ్చట కస్తూరి నింపెను. ఆమె తన భర్తకు రాసిన ప్రణయ లేఖ కావచ్చును.
చకోరాల వంటి కంటి కొసలు కెంపు రంగుతో నున్నవి. ఈ క్రొత్త సొగసు ఏలకల్లెనో?స్వామిపై ప్రేమతో నాటిన ఆ కొనచూపులను ఉప సంహరించుకొనుటలో అంటిన రక్తమేమో.
అమ్మవారి వక్షోజముల కాంతి పైటను దాటినవి. స్వామి, ఆ వక్షాజాలపై తన నఖములనుంచగా వాని నుండు వెలువడు చంద్రలేఖ లేమో ఆ కాంతులు? అవి వసంతకాలము వెన్నెలలు గావచ్చును.
మురిపెముగల అమ్మవారి బుగ్గల ప్రక్కలందు ముత్యముల జల్లులు చేరినవి. స్వామి ఆమెతో గూడినపుడు అందిన చెమటలు గావచ్చును.

Advertisement

తాజా వార్తలు

Advertisement