Wednesday, May 15, 2024

Exclusive – శ్రీదేవి తెలుగుదనం….

అందాల అభినేత్రి శ్రీదేవి ఎన్ని భాషల్లో నటిస్తే, అన్ని భాషలవారూ ఆమెను తమ సొంత ప్రాంతానికి చెందిన అమ్మాయిగా ఆరాధిస్తున్నారు. అది ఆమె అభినయవైభవం గడించిన కీర్తికి నిదర్శనం.

అయితే ఎవరు అవునన్నా, కాదన్నా శ్రీదేవి కన్నవారు ఇద్దరూ తెలుగువారే. తండ్రి అయ్యప్పన్‌ తమిళనాట స్థిరపడ్డ తెలుగువారు. ఇక తల్లి రాజేశ్వరి తిరుపతికి చెందినవారు. మామ్‌ సినిమా విడుదలకు ముందు కొన్ని నేషనల్‌ ఛానల్స్‌ లో శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ తన మాతృభాష తెలుగేనని శ్రీదేవి నొక్కి వక్కాణించారు. శ్రీదేవి అన్ని భాషల్లోకి తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్రాలద్వారా శ్రీదేవి పరిచయం అయి ఉండవచ్చు, నటిగా గుర్తింపు పొంది ఉండవచ్చు. అయితే ఆమెను సూపర్‌ స్టార్‌ డమ్‌ కు చేర్చింది మాత్రం తెలుగు చిత్రాలు అని అంగీకరించక తప్పదు. శ్రీదేవి సైతం తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు కారణంగానే తనకు అంతటి గుర్తింపు లభించిందని అంగీకరించారు. శ్రీదేవి తెలుగునాట టాప్‌ హీరోస్‌ అందరితోనూ బాలనటిగానూ నటించింది, తరువాత వారి సరసనే పరువాల పాపగానూ అలరించింది. ఇలాంటి చరిత మరోనటి జీవితంలో కానరాదు. అలాగే తెలుగునాట మూడు తరాల హీరోలతోనూ సూపర్‌ హిట్స్‌ చూసిన ఘనత సైతం శ్రీదేవి సొంతం. శ్రీదేవి అత్యధిక చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించింది తెలుగు హీరో కృష్ణతోనే. ఇలా తెలుగు చిత్రాలతో శ్రీదేవి అనుబంధాన్ని చెరిపి వేయాలన్నా చెరిగిపోనిది.

శ్రీదేవి కెరీర్‌ లో బాలనటిగా, నాయికగా ఎన్ని చిత్రాలు చేసినా, అవన్నీ ఒక ఎత్తు మహానటు-డు నటరత్న యన్టీఆర్‌ తో నటించిన చిత్రాలు ఓ ఎత్తు. ఎందుకంటే నటరత్నకు మనవరాలిగా శ్రీదేవి నటించిన బడిపంతులు చిత్రం బాలనటిగా ఆమె కెరీర్‌ లోనే ది బెస్ట్‌ అని జనం కీర్తించారు. అంతకు ముందు కొన్ని చిత్రాల ద్వారా అందాల నాయికగా పేరొందిన శ్రీదేవి టాప్‌ హీరోయిన్‌ గా మారింది కూడా యన్టీఆర్‌ సరసన వేటగాడులో నాయికగా నటించిన తరువాతే అన్నదీ నిర్వివాదాంశం.

ఏయన్నార్‌ కు చెల్లిగా, కూతురుగా నటించిన శ్రీదేవి ఆయనతో ముద్దులమొగుడులో తొలిసారి నాయికగా నటించారు. ఆ తరువాత ప్రేమాభిషేకం వంటి బంపర్‌ హిట్‌ లోనూ అక్కినేనితో శ్రీదేవి జోడీ కట్టి అలరించారు.

- Advertisement -

కృష్ణ కూతురుగా కొన్ని సినిమాల్లో నటించిన శ్రీదేవి ఆయన సరసన తొలిసారి బుర్రిపాలెం బుల్లోడులో కనిపించారు. ఆ తరువాత వారిద్దరి జంట కూడా తెలుగువారిని అలరించింది.

శోభన్‌ బాబు కూతురుగా, చెల్లిగా అలరించిన శ్రీదేవి ఆయనతో తొలిసారి కార్తిక దీపంలో నాయికా నటించారు. ఆ పై అనేక సినిమాల్లో శోభన్‌ బాబు, శ్రీదేవి జోడీ అలరించింది. అదే తీరున కృష్ణంరాజుకు కూడా శ్రీదేవి బడిపంతులులో కూతురుగా నటించింది. తరువాత పులిబిడ్డలో ఆయనకే నాయికగా కనిపించి మురిపించింది. ఇలా తెలుగు హీరోలతోనే తనదైన బాణీ పలికించిన శ్రీదేవి తెలుగువారంటే అభిమానం ప్రదర్శిస్తూనే ఉండేవారు.

శ్రీదేవి ఎంతమంది సరసన నాయికగా నటించినా యన్టీఆర్‌ తో నటించడమే ఓ ప్రత్యేకతగా నిలచింది. యన్టీఆర్‌ సరసన 12 చిత్రాల్లో శ్రీదేవి నాయికగా నటించారు. వాటిలో తొలి చిత్రం వేటగాడు సాధించిన విజయం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఓ నటు-నికి మనవరాలిగా నటించి మెప్పించి, మళ్ళీ అదే నటు-ని సరసన హీరోయిన్‌ గా అలరించడం. ఇక యన్టీఆర్‌ తో శ్రీదేవి నటనాప్రస్థానం ఓ చరిత్ర. వీరిద్దరూ కలసి నటించిన వేటగాడు, ఆటగాడు, సర్దార్‌ పాపారాయుడు, గజదొంగ, సత్యం-శివం, కొండవీటి సింహం, అనురాగదేవత, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి, వయ్యారిభామలు-వగలమారి భర్తలు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి.

ఇక ఉత్తరాదిన ఆరంభంలో అపజయమందుకున్న శ్రీదేవి, ఇక్కడ సూపర్‌ హీరోయిన్‌ కావడం వల్లే బాలీవుడ్‌ లోనూ రాణించగలదని మన తెలుగువారు విశ్వసించారు. అందుకే తెలుగువారు నిర్మించిన హిందీ చిత్రాల ద్వారా ఉత్తరాదిన అనూహ్య విజయం సాధించారు. ఇక బాలీవుడ్‌ లో ఎందరు దక్షిణాది నాయికలు రాజ్యమేలినా, సూపర్‌ స్టార్స్‌ కు సైతం దడ పుట్టించేలా శ్రీదేవి విజయాలను సాధించారు. ఆ తీరున బాలీవుడ్‌ లో అలరించిన మరో దక్షిణాది నాయిక కానరారు. ఏది ఏమైనా శ్రీదేవి చలనచిత్ర జైత్రయాత్రలో తెలుగు సినిమాలదే సింహభాగం. శ్రీదేవి భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె అభిమానుల గుండెల్లో చిరస్మరణీయురాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement