Saturday, October 12, 2024

EV | ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెరుగుతున్న క్రేజ్‌..

దేశంలో విద్యుత్‌ వాహనాలపై వినియోగదారులకు క్రమంగా క్రేజ్‌ పెరుగుతోంది. ఈ క్రేజీ దేశ ఆటోమొబైల్‌ రంగంలో కీలకమైన మార్పులకు దారితీస్తోంది. ప్రధానంగా వినియోగదారులు విద్యుత్‌ వాహనాలనున కొనుగోలు చేసే సమయంలో భద్రత, బ్రాండ్‌కు ఉన్న పేరు, వాహనం ధర ఈ మూడు అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటున్నారు. వీటితో పాటు పర్యావరణం పట్ల పెరుగుతున్న అవగాహన కూడా ఈవీల కొనుగోలువైపుగా వినియోగదారులను ఆలోచింప చేస్తోంది.

ఈ అంశాలతో వినియోగదారుల ఆసక్తి మూలంగా దేశంలో ఎలక్ట్రిక్‌ వాహన రంగం వార్షికంగా 15.9 శాతం చొప్పు వృద్ధిని నమోదు చేస్తోంది. ఇదే తరహా వృద్ధి 2035 వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమయానికి విద్యుత్‌ వాహనాల అమ్మకాలు 51.6 మిలియన్లకు చేరుకుంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్‌ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీలో శరవేగంగా విద్యుద్దీకరణ జరుగుతుందని చెప్పేందును ప్రతీకగా ఉంది.

క్రమంగా ట్రెడిషనల్‌ ఇంటర్నల్‌ కంబూషన్‌ ఇంజిన్‌ (ఐసీఈ) వాహనాల స్థానంలో అతి తక్కువ కాలుష్య వాహనాలైన విద్యుత్‌ వాహనాల కొనుగోలువైపుగా వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యావరణం పట్ల మరింత శ్రద్ద చూపుతున్నాయి. ఇందు కోసం పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా కాలుష్యరహితంగా మారేందుకు డెడ్‌ లైన్లు కూడా ప్రకటించాయి.

- Advertisement -

దేశంలో వేగంగా మార్పు…

దేశంలో ట్రాన్స్‌పోర్టు రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా నమోదవుతున్నాయి. 2020లో దేశంలో 1.25 లక్షల విద్యుత్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2023 లో ఇప్పటి వరకు నాటికి వీటి సంఖ్య 10.25 లక్షలకు చేరింది. ఇండియన్‌ ఈవీ మార్కెట్‌లో ప్రభుత్వం ఉత్తేజకరమైన లక్ష్యాలను 2022-23 ఆర్ధిక సర్వేలో పేర్కొంది. ఇందులో 2022 నుంచి 2030 నాటికి వార్షిక విద్యుత్‌ వాహనాల అమ్మకాల్లో ఈ రంగంలో 49 శాతం సీఏజీఆర్‌ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రభుత్వం ఈ రంగానికి ఏ స్థాయిలో మద్దతు ఇవ్వనుందో వెల్లడిస్తోంది.

వినియోగదారులు భద్రత, బ్రాండ్‌ విలువ, ధర, పర్యావరణం ఈ అంశాలకు ఎ క్కువ ప్రాధానత్య ఇస్తున్నందున ఈ దిశగా కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని వినియోగిస్తున్నాయి. అయితే విద్యుత్‌ వాహనాల్లో రేంజ్‌ ఒక సమస్యగా ఉంది. సగటు వినియోగదారులు ఎక్కువ రేంజ్‌ కావాలని కోరుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా కొన్ని కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. మరో సమస్య ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు. వాహనాల ధరలు విషయంలో పరిశ్రమ వర్గాలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వాహనాల మూలంగా ఏర్పడుతున్న కాలుష్యా సమస్యను క్రమంగా వినియోగదారులు అర్ధం చేసుకోవడంతో వీరు విద్యుత్‌ వాహనాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీల అమ్మకాలు పెరిగేందుకు, పరిశ్రమ స్థిరంగా వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళా వినియోగదారులు ఈవీల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే ప్రతి 4గురిలో ఒకరు మహిళా వినియోగదారు ఉంటున్నారు. డ్రైవింగ్‌ అనుభవం, ఎక్కువ సౌండ్‌ లేకపోవడం, పర్యావరణ హితంగా ఉండటం, ఆధునిక ఫీీచర్లు వంటివి వీరిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

ఈవీ వాహన రంగంలోకి పలు కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. ఈ కంపెనీలు చాలా వరకు రేంజ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. బ్యాటరీ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి. భద్రత పరమైన ఆధునిక ఫీచర్లను జోడిస్తున్నాయి. టెక్నికల్‌గా అనేక అడ్వాన్స్‌డ్‌ పరికరాలను వినియోగిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు ఛార్జింగ్‌ సదుపాయాలను పెంచేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలను తీసుకుంటున్నాయి. ఈ దిశగా ప్రత్యేకంగా న్యూఢిల్లి, మహారాష్ట్ర, కర్నాటక అగ్రభాగాన ఉన్నాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్యను పెంచడంతో పాటు, కమ్యూనిటీ ఛార్జింగ్‌ సదుపయాలను పెం చేందుకు కృషి చేస్తున్నాయి.


బ్యాటరీ మెరుగైన పనితీరు కోసం కంపెనీలు బ్యాటర మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (బీఎంఎస్‌) విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది బ్యాటరీ లైఫ్‌ టైమ్‌ను పెంచుతుంది. ఛార్జింగ్‌ సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఛార్జింగ్‌ లిమిట్‌ను ఇది నిర్ధారిస్తుంది. కాలిపోవడం, పేలిపోవడం వంటి సమస్యలను అది అధిగమిస్తుంది. కనెక్టెడ్‌ కారు టెక్నాలజీ కూడా విద్యుత్‌ కార్లలో ఉపయోగించడం భారీగా పెరిగింది. గత సంవత్సరంలో పోల్చితే ఇది 60 శాతం పెరిగింది. ఇది డ్రైవింగ్‌ అనుభవాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది.

మన దేశంలో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయల రంగంలోకి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, భారీ సంఖ్యలో ప్రైవేట్‌ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఈ రంగంలోకి విదేశీ కంపెనీలు కూడా భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది మెరుగుపడితే విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయి. ఇందులో స్మార్ట్‌ ఈవీ ఛార్జింగ్‌ విధానం వస్తోంది. ఇందుకు కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి.

మన దేశంలో రానున్న రోజుల్లో అనేక కంపెనీలకు చెందిన కొత్త విద్యుత్‌ కార్లు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌లోకి రానున్నాయి. వీటి సంఖ్య పెరగడం మూలంగా వీటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement