Saturday, May 4, 2024

TATA | పాకిస్థాన్‌ను మించిన టాటా గ్రూప్‌ మార్కెట్‌ సంపద..

టాటా గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ 365 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది మన పొరుగు దేశం పాకిస్థాన్‌ మొత్తం ఆర్ధిక వ్యవస్థ విలువ కంటే ఎక్కువ. సంవత్సర కాలంలో టాటా గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు అనేక రంగాల్లో టాటా గ్రూప్‌ వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి.

అత్యధిక ద్రవ్యోల్బణం, రుణాల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ ఆర్ధిక వ్యవస్థ కంటే టాటా గ్రూప్‌ మార్కెట్‌ సంపద ఎక్కువగా ఉంది. పాకిస్థాన్‌ ఆర్ధిక వ్యవస్థ మొత్తం విలువ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 341 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంత కంటే ఎక్కువగా టాటా గ్రూప్‌ విలువ 365 బిలియన్‌ డాలర్లు (30 లక్షల కోట్లు)గా ఉంది.

టీసీఎస్‌ విలువ కీలకం…

టాటా గ్రూప్‌లోని స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల్లో అత్యంత కీలకమైనది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌). టీసీఎస్‌ మార్కెట్‌ సంపద విలువ 15 లక్షల కోట్లు (170 బిలియన్‌ డాలర్లు)గా ఉంది. ఇది మొత్తం టాటా గ్రూప్‌ సంపదలో సగం. అదే సమయంలో ఒక్క టీసీఎస్‌ మార్కెట్‌ సంపదే మొత్తం పాకిస్థాన్‌ మార్కెట్‌ విలువలో సగం ఉంది. టాటా గ్రూప్‌ సంపద పెరుగుదలలో టాటా మోటార్స్‌, ట్రెంట్‌ బాగస్వామ్యం కూడా ఎంతో కీలకమైనది.

ఈ సంవత్సర కాలంలో టాటా మోటార్స్‌ షేర్లు 110 శాతం పెరిగాయి. ట్రెంట్‌ మార్కెట్‌ విలువ 200 శాతం పెరిగింది. వీటిత పాటు టాటా గ్రూప్‌లోని టాటా టెక్నాలజీస్‌, టీఆర్‌ఎఫ్‌, బెనారస్‌ హోటల్స్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌, ఆటో మొబైల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ గోవా, ఆస్ట్రాన్‌ ఇంజినీరింగ్‌ షేర్లు కూడా మంచి పనితీరును కనబరిచాయి. స్టాక్‌ మార్కెట్‌లో టాటా గ్రూప్‌లోని 25 కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో ఒక్క టాటా కెమికల్స్‌ షేర్లు మాత్రమే ఈ కాలంలో 5 శాతం తగ్గాయి.

- Advertisement -

టాటా గ్రూప్‌లో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టు కాని కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. టాటా సన్స్‌, టాటా క్యాపిటల్‌, టాటా ప్లే, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్ట మ్స్‌, ఎయిర్‌ ఇండియా వంటి సంస్థలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టు కాలేదు. ఈ సంస్థల సంపదను కూడా కలుపుకుంటే టాటా గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ ప్రస్తుతం ఉన్న దాని కంటే ఎంతో ఎక్కువగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం పబ్లిక్‌ ఇష్యూకు రానున్న టాటా క్యాపిటల్‌ విలువను 2.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

దీన్ని బట్టి ఇతర సంస్థల విలువ కూడా కలిస్తే టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ మరో 25 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో పాకిస్థాన్‌ ఆర్ధిక వ్యవస్థకు ఎన్నో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ దేశానికి ప్రస్తుతం 125 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు ఉన్నాయి. జులైలో ఈ దేశంలో 25 బిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ వద్ద కేవలం 8 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి రెండు నెలల పాటు దిగుమతులు చేసుకునేందుకు మాత్రమే సరిపోతాయి.

జీడీపీలో రుణాలు 70 శాతానికి మించిపోయాయి. ఇవి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రేటింగ్స్‌పై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ ఆదాయంలో సగం వడ్డేలకే సరిపోతుంది. మన దేశ జీడీపీ 3.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఇది పాకిస్థాన్‌ జీడీపీ కంటే 11 రేట్లు ఎక్కువ. 2027-28 నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా. ప్రస్తుతానికి ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement