Friday, May 17, 2024

అక్టోబర్‌ 1 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ బ్రాడ్‌బాండ్‌ మిషన్‌ (ఎన్‌బీఎం) ట్విట్‌ చేసింది. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు అక్టోబర్‌ 1న జరగనుంది. ఎన్‌బీఎం ట్విట్‌ను కొద్ది సేవటి తరువాత తొలగించింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎన్‌బీఎం దీన్ని తొలగించి ఉంటుందని భావిస్తున్నారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లోనే 5జీ సేవలను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని చాలా రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే సెప్టెంబర్‌లోనే 5జీ సేవలు ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ప్రకంచిన్పటికీ, కార్యరూపం దాల్చలేదు. ప్రధాని ప్రారంభించిన తరువాతే ఈ సంస్థలు దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. 5జీ సేవలతో ఇండియా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ జరుగుతుందని ఈ ట్విట్‌లో పే ర్కొంది.

దేశంలో 5జీ సర్వీస్‌లను ప్రారంభించడానికి టెలికం కంపెనీలకు మరింత కొంత సమయం పడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సర్వీస్‌లను ప్రారంభించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్జానంపై ఇప్పటికే పలు టెలికం కంపెనీలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ దిశగా ఆయా కంపెనీలు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. టెలికం మంత్రిత్వ శాఖ, సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఓఏఐ) సంయుక్తంగా ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌(ఐఎంసీ)ని ఢిల్లిలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబర్‌ 1 నుంచి 4 వరకు నిర్వహించనున్నాయి. దేశంలో 5జీ సేవలను అక్టోబర్‌ 12నుంచి ప్రారంభించనున్నట్లు గత నెలలో ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ సేవలు అందుబాటులో రేట్లలోనే వినియోగదారులకు అందుతాయని ఆయన హామి ఇచ్చారు. 5జీ సేవలు అందించేందుకు టెలికం సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయని ఆయన తెలిపారు. 5జీ సేవలను దశల వారిగా దేశమంతా అందించనున్నారు. ముందుగా 13 నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

అహ్మదాబాద్‌, బెంగళూర్‌, హైదరాబాద్‌, చంఢీఘర్‌, చెన్నయ్‌, ఢిల్లి, గాంధీనగర్‌, గుర్గామ్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణా నగరాల్లో తొలుత 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం 3జీ, 4జీ సేవల టారిఫ్‌ల మాదిరిగానే, త్వరలోనే టెలికం సంస్థలు ప్రత్యేకంగా 5జీ సర్వీస్‌ల టారిఫ్‌లను ప్రకటించనున్నాయి. 4జీ కంటే ఈ సేవల రేట్లు అధికంగానే ఉండనున్నాయి. ఈ సర్వీస్‌ల కావాలనుకునే వారు ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్‌ను సపోర్టు చేసే మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. వేలంలో 5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సంస్థల మధ్య ఈ విషయంలో టారిఫ్‌ యుద్ధం జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 5జీ మార్కెట్‌లో ఎక్కువ వాటా కోసం వీటి మధ్య పోటీ అనివార్యమని భావిస్తున్నారు. రేట్లు అందుబాటులోనే ఉంటాయని ప్రభుత్వం హామి ఇస్తున్నప్పటికీ, కంపెనీల మధ్య దీనిపై ఏకాభిప్రాయం ఉంటుంది. అయితే ప్యాకేజీలు, అందించే సేవలు, కాల వ్యవధి, ప్యాకేజీల టారిఫ్‌ల విషయంలో మాత్రం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో టెలికం కంపెనీలమధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అక్టోబర్‌ 1 ప్రారంభం కానున్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభిస్తారా లేదా అన్న విషయం త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement