Saturday, May 18, 2024

Henley Passport Index | మెర‌గుప‌డిన భార‌త్ స్థానం.. 62 దేశాలు చుట్టిరావొచ్చు

భారతీయ పాస్‌పోర్ట్ బలం మెరుగుపడింది. ఈ ఏడాది, గ్లోబల్‌ ర్యాంక్‌ల్లో ఇండియన్ పాస్‌పోర్ట్ 3 స్థానాలు ఎగబాకింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ‍‌తాజా ఎడిషన్‌లో, ఉజ్బెకిస్తాన్‌తో పాటు భారత్‌ 80వ స్థానంలో నిలిచింది. భార‌తీయ‌ పాస్‌పోర్ట్‌తో 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఆ దేశాల్లో.. భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌, బార్బడోస్, థాయిలాండ్, జోర్డాన్, మలేషియా, మాల్దీవులు, శ్రీలంక, మారిషస్, ఇండోనేషియా వంటివి ఉన్నాయి.

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం కూడా ఉంది. అంటే.. వీసా లేకుండా విదేశానికి వెళ్లిన తర్వాత, అక్కడి విమానాశ్రయంలో వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. అక్కడికక్కడే, విమానాశ్రయంలోనే ఆ దేశ వీసా లభిస్తుంది. దీనినే ‘వీసా ఆన్ అరైవల్’ అంటారు. ఈ దేశాల లిస్ట్‌లో.. కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మయన్మార్, తైమూర్-లెస్టే, ఇరాన్, బొలీవియా, బురుండి, కేప్ వెర్డే ఐలాండ్స్‌, కొమొరో ఐలాండ్స్‌, జిబౌటీ, గాబన్, మడగాస్కర్, సీషెల్స్, మారిషస్, మొజాంబిక్, సియెర్రా లియోన్, సోమాలియా, టాంజానియా, జింబాబ్వే ఉన్నాయి.

ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు:

  • ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాయి. (స్కోరు: 194). ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా 194 దేశాలను సందర్శించవచ్చు.
  • ఆ త‌రువాతి స్థానాల్లో.. ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ (స్కోరు: 193)
  • ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ (స్కోరు: 192)
  • బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్ (స్కోరు: 191)
  • గ్రీస్, మాల్టా, స్విట్జర్లాండ్ (స్కోరు: 190)
  • ఆస్ట్రేలియా, చెకియా, న్యూజిలాండ్, పోలాండ్ (స్కోరు: 189)
  • కెనడా, హంగరీ, యునైటెడ్ స్టేట్స్ (స్కోరు: 188)
  • ఎస్టోనియా, లిథువేనియా (స్కోరు: 187)
  • లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (స్కోరు: 186)
  • ఐస్‌లాండ్ (స్కోరు: 185)
Advertisement

తాజా వార్తలు

Advertisement