Monday, April 29, 2024

హ్యుండాయ్‌ అన్ని కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియా ఇకపై అన్ని మోడల్‌ కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే తీసుకు వచ్చిన భారత్‌ ఎన్‌క్యాప్‌ విధానంలో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నట్లు తెలిపింది. కార్ల ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చే కొత్త విధానమే భారత్‌ ఎన్‌క్యాప్‌.

ప్రస్తుతం మన దేశానికి చెందిన కార్ల కంపెనీలు తమ కార్లను గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌లో సెఫ్టీ క్రాష్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. తొలుత మూడు మోడళ్లలోని అన్ని వేరియంట్లలో 6 బ్యాగ్‌లు ఇవ్వనున్నట్లు హ్యుండాయ్‌ ఇండియా తెలిపింది. క్రమంగా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న అన్ని కార్ల మోడల్స్‌లోనూ వీటిని ఇస్తామని పేర్కొంది.

వెర్నాకు 5 స్టార్‌ రేటింగ్‌ …

హ్యుండాయ్‌కి చెందిన పూర్తిగా ఇండియాలోనే తయారైన వెర్నా మోడల్‌ కారు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ పొందినట్లు కంపెనీ తెలిపింది. పెద్దలు, పిల్లల విభాగంలో ఈ కారు 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన హ్యుండాయ్‌ మొదటికారుగా నిలిచిందని కంపెనీ ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్‌ తెలిపారు.

- Advertisement -

రోడ్‌ నెట్‌వర్క్‌ విస్తరించడం, స్పీడ్‌ లిమిట్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను అప్‌గ్రేడ్‌ చేయడం తప్పనిసరని సీఓఓ తరుణ్‌ గార్గ్‌ చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) సహా ఇతర కనెక్టెడ్‌ ఫీచర్లను అన్ని మోడళ్లకు విస్తరించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.

ఇండియాలో తయారైన కార్లకు 2014 నుంచి నిర్వహిస్తున్న సెఫ్టీ క్రాష్‌ టెస్ట్‌లుఈ సంవత్సరం చివరి నాటికి నిలిపివేస్తున్నట్లు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ వార్డ్‌ తెలిపారు. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌లో 5 పెద్దలు, పిల్లల విభాగం సెఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన వెర్నా కారు నిర్మాణంలో స్థిరత్వం లేకపోయినప్పటికీ ఈ ఘనత సాధించింది.

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ లో ఇప్పటి వరకు 60 ఇండియన్‌ కార్లను పరీక్షించారు. 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన మొదటి ఇండియన్‌ కారుగా టాటా నెక్సన్‌ నిలిచింది. దీంతో పాటు టాటా మోటార్స్‌కు చెందిన ఆల్ట్రోజ్‌, పంచ్‌ మోడల్స్‌ కూడా 5 స్టార్‌ రేటింగ్‌ పొందాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 700, స్కార్పియో ఎన్‌ మోడల్‌ కార్లు కూడా 5 స్టార్‌ రేటింగ్‌ పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement