Friday, April 26, 2024

భారీ నష్టాల్లో మార్కెట్లు, వార్‌, కరోనా కేసులతో ఆద్యంతం ఊగిసలాట

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఫుల్‌స్టాప్‌ పడకపోవడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం మదుపరులను లాభాల స్వీకరణ వైపు పరుగులు పెట్టేలా చేసింది. సోమవారం ఉదయం ఊగిసలాట మధ్యే ప్రారంభమైన సూచీలు.. కొద్ది సమయంలోనే.. పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్‌ ముగిసే వరకు నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతూ వచ్చాయి. దీంతో భారీ నష్టాలతో సూచీలు ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,030.41 పాయింట్ల వద్ద ఊగిసలాటలో ప్రారంభమై.. 57,229.08 (0.99 శాతం) పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 571.44 పాయింట్ల నష్టంతో 57,292.49 వద్ద ముగిసింది. 17,329.50 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. చివరికి 169.45 (0.98 శాతం) పాయింట్లు కోల్పోయి.. 17,117.60 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.17వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

రాణించిన లోహ రంగ సూచీలు..

నిఫ్టీలో మీడియా, లోహ, ఫార్మా రంగాలు మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ సోమవారం రూ.1.86 లక్షల కోట్లు తగ్గి.. రూ.2,58,50,940.77 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్‌ 30 షేర్స్‌లో సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, మారుతీ, టైటాన్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, యూపీఎల్‌, ఓఎన్‌జీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బ్రిటానియా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌ గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. ఆటో, బ్యాంకులు, రియాల్టిd, పవర్‌ షేర్లు ఒక్కో శాతం మేర క్షీణించాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం క్షీణించగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతానికి పైగా పెరిగింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement