Monday, April 29, 2024

నేటి నుంచే 2వేల నోట్ల మార్పిడి.. తొందర వద్దన్న ఆర్బీఐ గవర్నర్‌

చలామణి నుంచి ఉపసంహరించుకున్న 2వేల రూపాయల నోట్లను బ్యాంక్‌ల్లో మంగళవారం నుంచే మార్చుకోవచ్చు. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఆర్బీఐ సమయం ఇచ్చింది. నోట్లు మార్చుకునేందుకు 4 నెలల సమయం ఉన్నందున కస్టమర్లు వెంటనే బ్యాంక్‌లకు వెళ్లాల్సిన అవసరంలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. చలామణి నుంచి ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నప్పటికీ, గడువు వరకు చెల్లుబాటు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారులు 2000 నోట్లను తిరస్కరించడానికి వీలులేదని, తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. నోట్ల రద్దు మూలంగా ఎన్‌-రెసిడెంట్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ)లు, హెచ్‌1బీ వీసాలు ఉన్న వారి నోట్ల వెనక్కి తీసుకుంటున్నందున ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

నోట్లను ఉపసంహరించుకోవడం, కొత్త వాటిని జారీ చేయడం అనేది ఆర్బీఐ సాధారణంగా చేస్తూనే ఉంటుందని, ఈ సారి 2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్‌ చెప్పారు. సెప్టెంబర్‌ 30 నాటికి దాదాపు అన్ని 2000 నోట్లు వెనక్కి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్లు నోట్లను మార్చుకునేందుకు వీలుగా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంక్‌లను ఆయన ఆదేశించారు. 2వేల నోట్లను 4-5 సంవత్సరాల క్రితం ప్రింట్‌ చేసినవని, వాటి లక్ష్యం కూడా పూర్తయిందన్నారు.

- Advertisement -

2016లో చలామణిలో ఉన్న నోట్లను ఉపసంహరించుకున్నందున వ్యవస్థలోకి త్వరగా డబ్బును చొప్పించాలన్న లక్ష్యంతో 2వేల నోట్లను తీసుకు వచ్చామని, ప్రస్తుతం ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. ప్రస్తుతం చలామణిలో తగినన్ని నోట్లు ఉన్నాయని చెప్పారు. ఒక దశలో 6 లక్షల 73వేల కోట్ల విలువైన 2వేల నోట్ల చలామణిలో ఉన్నాయని, ప్రస్తుతం అవి 3 లక్షల, 62 వేల కోట్లకు తగ్గిపోయినట్లు ఆర్బీఐ గవర్నర్‌ వివరించారు. ప్రస్తుతం 2వేల నోట్లను రోజువారి కార్యకలాపాల్లో ఎక్కువగా వినియోగించడంలేదని, అందువల్ల వీటిని ఉపసంహరరించుకోవడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదని శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. నగదు నిర్వహణలో భాగంగానే 2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆయన తెలిపారు.

డిపాజిట్‌ 50వేలు దాటితే పాన్‌…

ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం 2వేల నోట్లు వెనక్కి వస్తాయని ఆశిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను హడావుడిగా మార్చుకోవాల్సిన అవసరంలేదన్నారు. సాధారణంగానే బ్యాంక్‌ల్లో 50వేల కంటే ఎక్కువ మొత్తాలను డిపాజిట్‌ చేస్తే పాన్‌కార్డు తప్పనిసరి సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆయన గుర్తు చేశారు. నగదు డిపాజిట్లకు ప్రస్తుతం ఉన్న నిబంధనలనే 2వేల నోట్ల డిపాజిట్‌ విషయంలోనూ అనుసరించాలని బ్యాంక్‌లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

మంగళవారం నుంచి బ్యాంక్‌ల్లో నోట్ల మార్పిడికి అన్ని ఏర్పాట్లు చేశామని, మార్పిడికి అవసరమైన నగదు నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో 2వేల నోట్ల స్థానంలో 1000 నోట్లను ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పెద్ద మొత్తంలో డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని చెెప్పారు. నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి వేసవి కాలమైనందున నీడ, మంచినీటి వసతి ఏర్పాట్లు చేయాలని, అన్ని కౌంటర్లలో వీటిని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంక్‌లను కోరింది.

ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు…

ఒక వ్యక్తి ఒకసారి 20 వేల వరకు మాత్రమే 2వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉందని ఆర్బీఐ తెలిపింది. ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా ఇలా 20వే వరకు నోట్లను మార్చుకోవచ్చని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫేర్స్‌ (డీఈఏ) కార్యదర్శి అజయ్‌ సేథ్‌ స్పష్టం చేశారు. ఆర్బీఐ చెప్పిన విధంగానే ఒకసారికి 20వేల మార్చుకోవచ్చని, ఇలా ఆ వ్యక్తి బ్యాంక్‌లో రోజులో ఎన్నిసార్లయినా ప్రతిసారి 20వేల చొప్పున మార్చుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలకు క్లీన్‌ నోట్స్‌ అందుబాటులో ఉంచేందుకే ఆర్బీఐ ఈ చర్య తీసుకుందని ఆయన చెప్పారు.

బ్లాక్‌మనీ ఉన్నవారికి రెడ్‌కార్పెట్‌ స్వాగతం….

2వేల నోట్లును మార్చుకునేందుకు అనుసరిస్తున్న విధానంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం తీవ్రమైన విమర్శలు చేశారు. నల్లధనాన్ని మార్చుకునేవారికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుందని విమర్శించారు. 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడం ముర్ఖపు చర్యగా ఆయన అభివర్ణించారు. 2వేల నోట్లను మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు, ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరంలేదని బ్యాంక్‌లు స్పష్టం చేస్తున్నాయని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈనోట్లను పెద్ద ఎత్తున దాచుకున్న వారు బ్లాక్‌ మనీని సులభంగా మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్లేనని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం సామాన్యుల వద్ద 2వేల నోట్లు లేవని, పెద్ద మొత్తంలో నగదు దాచుకునేవారికే ఇవి ఉపయోగపడ్డాయని చెప్పారు. చిల్లర సమస్య వల్ల సామాన్యులు ఈ నోట్లను పెద్దగా పట్టించుకోలేదన్నారు. భారీగా 2వేల నోట్లను నల్లధనంగా దాచుకున్న వారికి మోడీ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌లో స్వాగతం పలుకుతూ తేలిగ్గా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నదని చిదంబరం అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు తరువాత అంతకంటే పెద్ద నోటు 2వేలను ప్రవేశపెట్టడమే పెద్ద ముర్ఖపు చర్య అన్నారు. ఇంత కాలానికి ఈ ముర్ఖపు చర్యను వెనక్కి తీసుకోవడం సంతోషమన్నారు.

పిల్‌ దాఖలు చేసిన బీజేపీ నాయకుడు…

ఎలాంటి ఫారం నింపకుండా, గుర్తింపు లేకుండానే 2వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ, ఎస్‌బీఐ అవకాశం కల్పించడంపై బీజేపీ నాయకుడు అశ్వనీ ఉపాధ్యాయ్‌ ఢిల్లి హై కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అందులో పేర్కొన్నారు. ఈ నోట్లను మార్చుకునే వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలో మాత్రమే వీటిని వేయాల్సి ఉందన్నారు. ఇలా చేయడం వల్ల నల్లధనం ఉన్నవారిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవడానికి, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి ఈ చర్య సహాయపడుతుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement