Friday, May 17, 2024

ప్రభుత్వరంగ బ్యాంకులకు 12మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల నియామకం!

దేశంలోని పలు ప్రభుత్వరంగ బ్యాంకులకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఈడీ) నియామకానికి సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లుగా, జనరల్‌ మేనేజర్లుగా పనిచేస్తున్న వారిని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు (ఈడీ)గా నియమించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్‌ అపాయింట్స్‌ కమిటీ ఆమోద ముద్ర వేసినట్టు సంబంధిత వర్గాల సమాచారం.

ప్రభుత్వ వర్గాల వివరణ ప్రకారం, ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జనరల్‌ మేనేజర్‌(జీఎం)గా పనిచేస్తున్న సంజయ్‌ రుద్ర యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అదే బ్యాంకు నుంచి మరో జీఎం విజయ్‌ కుమార్‌ ఎన్‌ కాంబ్లే యూకో బ్యాంకు ఈడీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, ప్రస్తుతం కెనరా బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న భవేంద్ర కుమార్‌ను అదే బ్యాంకుకు ఈడీగా ప్రమోట్‌ చేశారు.

ఇక, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న బిభు ప్రసాద్‌ మహాపాత్రాను అదే బ్యాంకులో ఈడీగాను, జీఎంగా పనిచేస్తున్న రవి మెహ్రాను పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకుకు ఈడీగా నియమించినట్లు తెలియవచ్చింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజీవ్‌ మిశ్రాను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఈడీగా నియమించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న బ్రజేశ్‌ కుమార్‌ సింగ్‌ ఇండియన్‌ బ్యాంకు ఈడీగా నియమితులయ్యారు.

- Advertisement -

వచ్చే ఏడాది మార్చి నెలలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇండియన్‌ బ్యాంకులో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రోహిత్‌ రిషిని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఈడీగా నియమించారు. వచ్చే నెలలో ఆయన నూతన ఈడీగా బాధ్యతలు చేపడతారు. వీరితో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు లాల్‌సింగ్‌ , ఇండియన్‌ బ్యాంకుకు శివ్‌ బజరంగ్‌ సింగ్‌, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు మహీంద్ర దోహరే, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు ధనరాజ్‌.టిని ఈడీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement