Tuesday, April 30, 2024

అక్టోబర్‌ నాటికి 61 ఐపీవోలు.. రూ.52,759 కోట్లు సేకరణ: ఆర్థిక మంత్రి నిర్మలా

న్యూఢిల్లి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 అక్టోబర్‌ నాటికి 61 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ.52,759 కోట్ల నిధులు సేకరించారు. ఐపీవో మార్గంలో నిధుల సేకరణలో గతేడాది కంటే ఎక్కువగా సమీకరణ జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో సోమవారం వెల్లడించారు. అక్టోబర్‌ నాటికి మొత్తం 61 కంపెనీలు లిస్టింగ్‌ అవ్వగా అందులో 34 కంపెనీలు ఎంఎస్‌ఎంఈలేనని ఆమె చెప్పారు. తయారీ, సేవల రంగానికి చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున లిస్టింగ్‌కు వస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది ఐపీవోలు వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి సేకరించిన నిధులు గతేడాదిని మించిపోయాయని ఆమె ప్రస్తావించారు.

కాగా గత ఆర్థిక సంవత్సరంలో 56 కంపెనీలు రూ.31,060 కోట్లను ఐపీవోల ద్వారా సమీకరించాయని ఆమె తెలిపారు. సెబీ డేటా ప్రకారం అందులో 27 ఎంఎస్‌ఎంలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మొత్తం 61 ఐపీవోల్లో 35 కంపెనీలు రూ.100 కోట్ల కంటే తక్కువ సేకరించాయి. నాలుగు కంపెనీలు రూ.100 – రూ.500 కోట్లు సమీకరించాయి. 22 ఐపీవోలు రూ.500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నిధులను సేకరించాయని డేటా వెల్లడించారు. 61 ఐపీవోల్లో 10 కంపెనీలు హెల్త్‌కేర్‌ సెక్టార్‌కు చెందినవి కాగా సిమెంట్‌ లేదా నిర్మాణరంగానికి చెందినవి 6 కంపెనీలు ఉన్నాయి. ఓ అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ పేటీఎం ఐపీవో ఇన్వెస్టర్లకు సమస్యలు సృష్టించిందని చెప్పారు.

పేటీఎం ఐపీవోతో ఇన్వెస్టర్లకు సమస్యలు
తొలుత ఆకర్షణీయంగా కనిపించిన పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ ఐపీవో ఇన్వెస్టర్లకు సమస్యలు సృష్టించిందని సీతారామన్‌ అన్నారు. కంపెనీకి కావాల్సిన దానికంటే ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్‌ అయ్యింది. పేటీఎం ఐపీవోలో 8.43 కోట్ల షేర్లకి 9.14 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. ప్రైస్‌ బ్యాండ్‌ ఒక్కో షేరు రూ.2080 -రూ.2150గా ఉందని ఆమె వివరించారు. రూ.18,300 కోట్ల విలువైన ఐపీవో 1.89 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయింది. నవంబర్‌ 18న మార్కెట్లపై బలహీనంగా లిస్ట్‌ అయ్యిందని ప్రస్తావించారు.

ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ సేఫ్‌
సైర్‌ నేరాలకు అవకాశమున్న నేపథ్యంలో ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ మౌలిక సదుపాయాల బలోపేతంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సీతారామన సమాధానమిస్తూ.. సంబంధిత సంస్థలన్ని తగిన, పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని ఆమె చెప్పారు. చాలా తనిఖీలతోపాటు ప్లాన్‌ బీ కూడా ఉన్నాయి. సంస్థలు వాటిని పరిగణలోకి తీసుకుని పరీక్షించాయి. కాలానుగుణంగా ట్రయల్స్‌ వేశాయని చెప్పారు. సెబీ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ అన్ని జాగ్రత్తల విషయంలో భరోసా కల్పిస్తున్నాయని ఆమె వివరించారు. ప్రతిసారీ కాలానుక్రమంగా సమీక్షలు ఉంటాయి. ఏదైనా బలోపేతం చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. డిజిటల్‌ రక్షణ మరింత పెరుగుతోందని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement