Monday, April 29, 2024

AP: అందరికీ అండగా ఉంటా.. బాధితులందరినీ ఆదుకుంటా.. జగన్

వాకాడు (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : ” మైచాంగ్ తుఫాను బాధితులందరికీ అండగా ఉంటాం. నాలుగు రోజుల్లో ఒకవైపు పరిహారం చెల్లింపులు, మరోవైపు అధికారుల నివేదిక మేరకు రూ.32 కోట్ల తక్షణ పునరుద్దరణ పనులు యుద్ధ ప్రతిపదికన పూర్తి చేస్తాం. దెబ్బతిన్న ప్రతి ఎకరా పంటకు పరిహారం చెల్లించే చర్యలు తీసుకుంటాం. ఎవ్వరూ అధైర్య పడవద్దు. ” అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తుఫాను దెబ్బతిన్న ప్రాంతాల సందర్శనలో భాగంగా ఈరోజు ఆయన తిరుపతి జిల్లా వాకాడు మండలానికి వచ్చారు. మండలంలో స్వర్ణముఖి నదికి పడిన గండిని పరిశీలించారు. బాలిరెడ్డి పాలెం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా ఇటు తిరుపతి అటు నెల్లూరు జిల్లాల్లో నష్టాన్ని తిలకించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ తమ జిల్లా పరిధుల్లో సంభవించిన నష్టాలను వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటైన సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… కురవాల్సిన వర్షపాతంలో సగం వర్షం నాలుగైదు రోజుల్లో కురవడంతో జిల్లాలో అపార నష్టం సంభవించిందని గుర్తించామన్నారు.

పటిష్టమైన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా నీటి ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో అధికారులు కృషి చేశారన్నారు. తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి తక్షణ ఉపశమన సహాయం కింద రూ.2,500 అందిస్తున్నామని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో పరిహారం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ తక్షణ మరమ్మతులతో చేసే పునరుద్దరణ పనులు కూడా చేపట్టేందుకు అధికారుల ప్రతిపాదన మేరకు రూ.32 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 13వేల ఎకరాల వరిపంట, 7 వందల ఎకరాల ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని, ఆ నష్టానికి పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతూ నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందుతుందని, ఆ విషయంలో రైతులు ధైర్యంగా ఉండాలని కోరారు. స్వర్ణముఖి గండి పడిన చోటిని చూశానని, స్థానికుల కోరికపై శాశ్వత పరిష్కారం కింద రూ.30 కోట్లతో బ్రిడ్జిని నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆపై వేదిక వద్ద కొందరు బాదితులతో మాట్లాడి వారినుంచి వినతి పత్రాలను స్వీకరించారు.


అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కోట మండలం కేంద్రం విద్యానగర్ మైదానం చేరుకున్నారు. ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కె.నారాయణ స్వామి, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి వున్నారు. విద్యానగర్ హెలిప్యాడు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణ, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం.గురుమూర్తి, నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ అరుణమ్మ, ఎమ్మెల్సీ లు యం.మురళి, కల్యాణ చక్రవర్తి, పి.చంద్ర శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యవేడు – గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఆదిమూలం, వరప్రసాద్, సంజీవయ్య, విక్రమ్ రెడ్డి -వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జి రామ్ కుమార్ రెడ్డి, తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement