Sunday, April 28, 2024

AP | విజయవాడ – మచిలీపట్నానికి 6 లైన్ల రహదారి.. డీపీఆర్‌ కోసం టెండర్‌ ఖరారు

అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి 65 (ఎన్‌హెచ్‌ 65) మహర్దశ పట్టనుంది. మొత్తం నాలుగు రాష్ట్రాల మీదుగా సాగే ఈ ప్రధాన రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పూణ నుంచి మచిలీపట్నం వరకు హైదరాబాద్‌ – విజయవాడ మీదుగా ఉన్న ఈ రహదారిని ఇప్పటికే కొంతవరకు 6 లైన్ల రహదారిగా నిర్మితమై ఉంది. అయితే విజయవాడ నుంచి బందరు వరకు నాలుగు వరసలు రహదారిగానే ప్రస్తుతం ఉన్న నేషనల్‌ హైవేను ఆరు వరుసల రహదారిగా తీర్చి దిద్దేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఇప్పటికే బందరు పోర్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బందరు పోర్టు పనులు మొదలైన నాటి నుంచి ఈ రహదారి మరింత రద్దీగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ విస్తరణకు సంబంధించి డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను తయారు చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను కూడా ఆహ్వానించి వాటిని పూర్తి చేసింది.

- Advertisement -

కేడీఎం ఇన్‌ఫ్రా అనే సంస్థ డీపీఆర్‌ తయారి కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. టెండర్‌ నిబంధనల ప్రకారం ఈ సంస్థ రహదారి విస్తరణ నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటివరకు విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి నాలుగు వరుసల్లో విస్తరించి ఉంది. గతంలో ఈ రహదారి కేవలం రెండు వరుసల రహదారిగా ఉన్నప్పటికీ ఐదేళ్ల క్రితం దీనిని నాలుగు వరుసలుగా విస్తరించారు. బందరు పోర్టు నిర్మాణ పనులు మొదలైన క్రమంలో రైల్వే శాఖ కూడా కనెక్టివిటీని పెంచే పనిలో నిమగ్నమైంది.

ఈ పరిస్థితుల్లో జాతీయ రహదారి ని కూడా విస్తరించాల్సిన అవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆమోదం తెలిపి సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. డిసెంబర్‌ నాటికి డీపీఆర్‌ నివేదికను ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేసి ఆ వెంటనే ఆరు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలన్న ఆలోచనలో ఎన్‌హెచ్‌ఏఐ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణను చేసే పనిలో ఎన్‌హెచ్‌ఏఐ నిమగ్నమైంది.

ఇప్పటికే విజయవాడ – బందరు రహదారి విస్తరణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి భవిష్యత్‌ అవసరాలకు సరిపడా భూమిని సేకరించాలని ఎన్‌హెచ్‌ఏఐ యోచిస్తోంది. భవిష్యత్‌లో ఈ రహదారిని 8 వరుసలకు విస్తరించాలన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్‌ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాలని ఆలోచిస్తోంది. మొత్తం 68 కిలోమీటర్ల మేర ఈ ఆరు వరుసల రహదారిని నిర్మించేందుకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తున్నారు.

ఇంకోవైపు విజయవాడ నుంచి మచిలీపట్నం మార్గంలో ప్రధానంగా బెంజ్‌ సర్కిల్‌ నుంచి దాదాపు 11 నుంచి 12 కిలోమీటర్ల వరకు పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లు ప్రైవేట్‌ ఆస్తులు ఉన్నాయి. దీంతో న్యాయపరమైన చిక్కులతో పాటు భూ సేకరణకు భారీ వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ వచ్చే నాటికి భూ సేకరణ వ్యయానికి సంబంధించి అయ్యే ఖర్చు ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement