Sunday, May 5, 2024

AP | ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ.. ఒకే స్టేజ్‌పై బాబు, పవన్ కల్యాణ్

సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ ‘విధ్వసం’ పుస్తకాన్ని రచించారు. మొత్తం 185 అంశాలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు తొలి కాపీని పవన్ కల్యాణ్‌కు అందజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షం వహించి, ఈ పుస్తకాన్ని రచించారని, మొదటి పేజీ చదివితే ఈ విషయం అర్థమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జరిగిన ఘటనలను జరిగినట్టుగా, ఎలాంటి భావోద్వేగాలు, పక్షపాతం లేకుండా రాశారని అన్నారు. కాగా ఇదే వేదికపై మరో సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన ‘అక్షరాస్త్రం’ పుస్తకాన్ని కూడా చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ నీరుకొండ ప్రసాద్ ఈ పుస్తకాన్ని రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement