Thursday, May 9, 2024

కుక్కలకు షెల్టర్ గా.. ఏటీఎం సెంటర్!

ఆ గ్రామం..పెద్ద వ్యాపార కేంద్రం… నిత్యం కోట్లలో వ్యాపార లావాదేవీలు సాగుతుంటాయి. మండలంలోని 20 గ్రామాలకు పైగా ప్రజలు నిత్యం ఆ గ్రామం నుండి రాకపోకలు కొనసాగిస్తూ… కొనుగోలు తోపాటు వ్యాపార లావాదేవిలు జరుగుతాయి. ఆ..బ్యాంకు శాఖలో వేలల్లోనే ఖాతాదారులు సైతం ఉన్నారు. బ్యాంకు లావాదేవీలు జరుపుకునేందుకు మాత్రం ఉన్న ఒక్క  ఏటీఎం సెంటర్ పని చేస్తే ఒట్టు. నగదు లావాదేవీలు జరుపుకోవాలంటే ప్రైవేటు బ్యాంకు లావాదేవి సెంటర్లకు వెళ్లి కమీషన్లు చెల్లించుకుని ఖాతాదారులు జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిందే. ఇవన్నీ తెలిసి కూడా బ్యాంక్ అధికారులు ATM నిర్వహణను గాలికొదిలేసి మీనమేషాలు లెక్కిస్తూ ఉండటంతో ఏటీఎం సెంటర్ కుక్కలకు నిలయంగా మారింది. దుర్గంధం వెదజల్లుతూ బ్యాంకు అధికారుల తీరుకు దర్పణం పడుతుంది.

ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు యూనియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ మండలంలోని అతిపెద్ద వాణిజ్య గ్రామమైన ఉప్పు గుండూరు యూనియన్ బ్యాంక్ ఎటిఎం రోజుల కొద్దీ పనిచేయక పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు అధికారులు సి డి ఎం మిషన్ ను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకు రాకపోగా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బ్యాంకు ఆవరణలోనే ఉన్నఏటీఎంకు కేటాయించిన గది కుక్కలకు ఆవాసంగా మారింది. దీన్ని చూస్తేనే బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటర్ పై ఏ మాత్రం దృష్టిసారిస్తున్నారో తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే ఉప్పుగుండూరు యూనియన్ బ్యాంక్ పరిధిలో వేలమంది ఆ బ్యాంకులో ఖాతాదారులు తమ బ్యాంకు కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. బ్యాంకు భవనంలోనే సిడిఎంను ఏర్పాటు చేసిన అధికారులు దాని నిర్వహణను గాలికొదిలేసి పట్టించుకోకపోవడంతో కుక్కల నిలయంగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. అతిపెద్ద వాణిజ్య గ్రామం ఉప్పుగుండూరు కావడంతో నిత్యం చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల ప్రజలు ఇక్కడి నుండే రాకపోకలు తోపాటు ,వ్యాపార ఆర్థిక కార్యకలాపాలను సైతం ఇక్కడి నుండే కొనసాగిస్తుంటారు.

ఉప్పుగుండూరు గ్రామంలో తొలిగా ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంకు నేడు యూనియన్ బ్యాంక్ లో విలీనమయ్యి యూనియన్ బ్యాంక్ శాఖగా కొనసాగుతుంది. ఈ బ్యాంకులో వందల మంది వ్యాపారస్తులు ప్రతిరోజు తమ వ్యాపార ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తుంటారు. గతంలో ఇక్కడ అ ఏటీఎం సెంటర్ అవసరమని గ్రామస్తులు పలుమార్లు బ్యాంకు అధికారులకు, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులకు విన్నవించుకోవడం తో ఇక్కడి ఆంధ్ర బ్యాంకు శాఖ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రా బ్యాంక్ నవ శక్తి పథకం ద్వారా బ్యాంకు శాఖ ను అభివృద్ధి చేసిన అధికారులు ఏటీఎం సెంటర్ తో పాటు ఖాతాదారుల సౌలభ్యం కొరకు (సిడిఎం) క్యాష్ డిపాజిట్ మిషన్ లను సైతం ప్రారంభించారు. అప్పట్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇక్కడ ఉన్న ఏటీఎం వేరొక ప్రాంతానికి బ్యాంకు అధికారులు తరలించారు. అప్పటి నుండి(సి డి ఎం ) మిషన్ ద్వారానే ఏటీఎం గాను, మరియు నగదు జమ చేసేందుకు రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా బ్యాంకు భవనంలోనే ఓ గదిలో నిర్వహిస్తున్నారు. దీంతో ఖాతాదారులు, విద్యార్థులు, వ్యాపారస్తులు వివిధ గ్రామాల నుండి రాకపోకలు సాగించే ప్రజలు సైతం ఇక్కడి సి డి ఎం సెంటర్ నుండి నగదు లావాదేవీలు కొనసాగిస్తున్నారు.

కాగా ఇటీవల కొద్ది రోజుల నుండి ఇక్కడి బ్యాంకు సిబ్బంది సిడియం సెంటర్ నిర్వహణ బాధ్యతను గాలికొదిలేసి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సిడిఎమ్ మిషన్ పనిచేయక ఖాతాదారులు,  ప్రజలు నగదు లావాదేవీలు కొనసాగించే వీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ ఆర్థిక అవసరాల రీత్యా గ్రామంలోని ఇంటర్నెట్ సెంటర్లు, ప్రైవేటు బ్యాంకు లావాదేవీల సెంటర్లకు వెళ్లి అదనంగా డబ్బులు చెల్లించుకుని నగదు లావాదేవీలు కొనసాగించాల్సి వస్తుందని వాపోతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు కనుగుణంగా ఖాతాదారుల తమ బ్యాంకు ఏటీఎం మిషన్ ద్వారా కాకుండా వేరొక బ్యాంకు ఏటీఎం మిషన్ ద్వారా నగదు లావాదేవీలు కొనసాగిస్తే అందుకు సర్వీస్ చార్జి వసూలు చేస్తుండటంతో ఖాతాదారులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది.

- Advertisement -

యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు తమ శాఖ ఏటీఎం సెంటర్ పనిచేయకపోవడంతోబ్యాంకు సమయంలో నగదు లావాదేవీలు జరుపుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాదారులతో బ్యాంకు కిటకిటలాడుతూ ముందు ఉన్న వాళ్ళకే నగదు లావాదేవీలు జరుపుకునే పరిస్థితి ఉందని వెనక ఉన్న వాళ్లు మరో రోజు వచ్చి లావాదేవీలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు గ్రామంలో ఉన్న బ్యాంకు సేవల దుకాణదారులుతో కుమ్మక్కై వారి దగ్గర నుండి కమిషన్లు తీసుకుంటూ  సిడిఎమ్ మిషన్ ను ఖాతాదారులకు  అందుబాటులోకి తీసుకు రాకుండా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారు వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు  బ్యాంకు అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించి ఉప్పుగుండూరు గ్రామం లోని సిడిఎమ్ మిషన్ ను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చి వెతలు తీర్చాలని ఖాతాదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement