Friday, November 1, 2024

గుంటూరులో త‌ల్లీకూతుళ్ల‌పై బ్లేడ్ అటాక్ కేసులో ట్విస్ట్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ వాట్సాప్ చిట్‌చాట్‌!

గుంటూరులో తల్లీకూతురిపై ఓ యువకుడి దాడి చేసిన‌ కేసు కొత్త మలుపు తిరిగింది. గీతా సాయి, ధర్మతేజ మధ్య జ‌రిగిన వాట్సాప్‌ చాటింగ్ బయటకు వచ్చింది. అంతేకాదు తనతో మాట్లాడాల‌ని ధర్మతేజను కోరుతూ గీత ఆత్మహత్యాయత్నం చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం మరో మలుపు తిరిగినట్లయ్యింది. అయితే పోలీసులు మాత్రం అది పాత వీడియో అని చెబుతున్నారు. తల్లీకూతురిపై దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్న‌ట్టు వెల్ల‌డించారు. గుంటూరు పట్టణంలోకి కృష్ణనగర్ ప్రాంతానికి ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసముంటోంది. కొంతకాలంగా ఓ యువకుడు ఆమె వెంటపడుతూ ప్రేమిస్తున్నాన‌ని వేధిస్తున్నారు. అతడి ప్రేమను యువతి అంగీకరించకపోయేసరికి కోపాన్ని పెంచుకున్నాడు. ఉన్మాదంతో విచక్షణ కోల్పోయిన అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

కృష్ణనగర్ పిఎఫ్ కార్యాయలం దగ్గర్లో యువతి కుటుంబం నివాసముండే అపార్ట్ మెంట్ లోకి ఆ యువకుడు బలవంతంగా చొరబడ్డాడు. ప్లాట్ లో యువతితో పాటు ఆమె తల్లి మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో తనవెంట తెచ్చుకున్న బ్లేడ్ తో యువతి గొంతుకోసి చంపడానికి యత్నించాడు. అయితే కూతురు అరుపులు విని తల్లి వచ్చి ఈ దాడిని అడ్డుకుంది. దీంతో ఆమెపైనా దాడికి తెగబడ్డాడు. ఇలా తల్లీకూతుళ్లను బ్లేడ్ తో గాయపర్చాడు ఈ ఉన్మాది. ఈ దాడి త‌ర్వాత‌ అపార్ట్ మెంట్ రెండో అంతస్తు నుండి దూకే ప్రయత్నం చేసాడు ఆ యువకుడు. కానీ, తల్లీకూతుళ్ల కేకలతో గుమిగూడిన అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు పరారయ్యేందుకు యత్నిస్తున్న యువకుడిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి యువకుడిని వారికి అప్పగించారు. ఉన్మాది చేతిలో గాయపడ్డ తల్లీకూతుళ్లను హాస్పిటల్ కు తరలించారు. అలాగే వారిపై దాడికి పాల్పడ్డ యువకుడు కూడా గాయపడగా అతడిని జీజీహెచ్‌కు తరలించారు.

కాగా, ఈ దాడిలో స్వల్పంగా గాయపడటంతో యువతికి, ఆమె తల్లికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. యువకుడి పరిస్థితి కూడా మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా ప్రాథమికంగా నిర్దారించారు. ఉన్మాదంతో యువతిపైనే కాకుండా ఆమె తల్లిపై దాడిచేసి చంపడానికి యత్నించిన యువకుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement