Monday, April 29, 2024

తోతాపురి కేజీ రూ.12లు : ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం .. కలెక్టర్ షణ్మోహన్

చిత్తూరు, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : జిల్లాలో మామిడి రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఒక కేజీ తోతాపురి మామిడి ధర రూ.12లు గా నిర్ణయించామని తెలియచేస్తూ.. ఉల్లంఘించిన ఫ్యాక్టరీలను, మండీలను, ర్యాoప్ లను సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ హెచ్చరించారు. ఈరోజు స్థానిక జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో మామిడికి గిట్టుబాటు ధరపై సంబందిత అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్
షణ్మోహన్ మాట్లాడుతూ… ఈ ఏడాది జిల్లాలోని మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటి వరకు మన జిల్లాతో పాటు సరిహద్దులోని రాష్ట్రాలు, జిల్లాల నుండి మామిడి పంటను దిగుమతి చేసుకున్నాయని తెలిపారు. వీటి ధర తక్కువగా, నాణ్యత కాస్త మెరుగ్గా ఉన్న కారణంగా గతంలో రెండు మార్లు తోతాపురి మామిడి పంటకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరలు స్థిరంగా కొనసాగించడం వీలుపడలేదని తెలిపారు.

ప్రస్తుతం మన జిల్లా సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో మామిడి పంట కోత పూర్తి అయినదని, మన జిల్లాలో పంట దిగుబడి పూర్తి నాణ్యతతో ఉన్నందున, మామిడి రైతులు, ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసామన్నారు. ఈ సమావేశంలో రవాణా చార్జీలు కాక, ఒక కేజీ తోతాపురి మామిడి గిట్టుబాటు ధర రూ.12లుగా నిర్దేశించామని తెలిపారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు జులై 1 నుంచి అమలులో ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులను నియమించి ధరల అమలును పరిశీలించడం జరుగుతుందని చెబుతూ ఉల్లంఘించిన వారి ఫ్యాక్టరీ, మండీలను, ర్యాoప్ లను సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement