Sunday, May 5, 2024

Tirupati | చిరుత జాడెక్కడ..? నడక మార్గంలో తగ్గుతున్న భక్తులు

అమరావతి, ఆంధ్రప్రభ : తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి కాలినడక మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. దేవుడి దర్శనం సంగతి తర్వాత.. ముందు ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంగారు పడుతున్నారు. తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, పాముల సంచారం సాధారణమైయాయి. దీంతో శ్రీవారి భక్తులను చిరుత భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం సమీపంలో చిరుత, ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డు అయిన తర్వాత.. వాటి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు.

దీంతో భక్తులు నడక మార్గంలో వెళ్లాలంటే భయపడి పోతున్నారు. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోననే భయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. కాలి నడక మార్గంలో భక్తుల సంఖ్య కూడా తగ్గినట్లు సమాచారం. ఏదైనా సంఘటన జరిగితే హడావుడి చేస్తున్న టీటీడీ, అటవీశాఖ అధికారులు..ఇప్పుడు చిరుత ఆచూకిని గుర్తించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

చిన్నారి లక్షిత పై దాడి చేసి చంపిన తర్వాత చిరుతలను బంధించేందుకు టీటీడీ, అటవీశాఖలు సంయుక్తంగా చేసిన తీసుకున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరించిన దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డు అయి పది రోజులు గడిచినా ఇంత వరకు ఆ చిరుత ఆచూకీ కనిపించక పోవడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిరుతను బంధించేందుకు అధికారులు తీ సుకున్న చర్యలు నామమాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. శేషాచలం అడవుల్లో చిరుత సంచారం ఎక్కువైన విషయం తెలిసిందే. అయితే లక్షిత పై దాడి చేసిన తర్వాత ఆరు చిరుతలను అధికారుల బంధించినప్పటికీ, మరో చిరుత సంచరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లు శేషాచలం అడవులకే పరిమితమైన వన్యమృగాలు తిరుమల నడక మార్గానికి వచ్చి మరీ భక్తులపై దాడి చేయడం, సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వెనుకడుగు వేస్తున్నారు.

ఇప్పటి వరకు నడక మార్గంలో క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి కానీ ఎవరిపై దాడి చేసిన ఘటన చాలా అరుదుగా ఉండేవి. ఎవరి దారిలో వారు వెళ్లిపోయే వారు కానీ ఈ మధ్య కాలంలో చిరుత దాడులు ఎక్కువైపోయాయి. ఈ ఏడాదిలోనే ఇద్దరు చిన్నారుల పై దాడి చేయడం, అందులో లక్షిత చిరుత దాడిలో మృతి చెందడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. తిరుమల శ్రీనివాసుడు అంటేనే కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవం.

అలాంటి దేవుని వద్దకు వెళ్లే మార్గంలో కూడా భక్తులు సెంటిమెంట్‌ పాటిస్తుంటారు. కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకుంటారు. అలా వెళ్లాలనుకున్న వారిలో భయాందోళనలు వెంటాడుతోంది. కౌశిక్‌ అనే బాలుడి పై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన.. తర్వాత లక్షిత అనే బాలిక చిరుత దాడిలో మృతి చెందిన ఘటన తర్వాత కాలినడక మార్గంలో చిరుత పులల సంచారం పై మరింత ఆందోళన పెరిగింది.

బాలిక పై దాడి ఘటన తర్వాత టీటీడీ కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలతో పాటు, 36 బోన్లను కూడా ఏర్పాటు చేయగా, ఆరు చిరుతలు చిక్కాయి. అయితే ఆరు చిరుతల పట్టివేత తర్వాత శేషాచలం అడవుల్లో చిరుతల సంచారం లేదని భావించి ఊపిరి పీల్చుకున్న తరుణంలో గత నెల 24,27 తేదిల మధ్యలో మరో చిరుతతో పాటు-, ఎలుగుబండి కూడా ఆదే నడక మార్గంలో సంచరించడం కలవర పెడుతోంది. అయితే, ఈ చిరుతను బంధించేందుకు అధికారుల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదని భక్తులు అంటున్నారు.

లక్షిత పై దాడి చేసిన చిరుత ఏది..?

ఇదిలా ఉండగా గత ఆగస్టు 11వ తేదిన లక్షిత పై దాడిచేసి చంపిన చిరుతను గుర్తించడంలో అటవీశాఖ విఫలమైంది. లక్షిత పై దాడి అనంతరం నడక మార్గంతో చిరుతలను బంధించేందుకు అటవీశాఖ, తీసుకున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. మొత్తం నడక మార్గంలో ఆరు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే. బంధించిన 6 చిరుతల్లో ఒక చిరుతను తలకోన అటవీ ప్రాంతంలో, మరో చిరుతను గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతంలో, ఇంకో చిరుతను వి శాఖ జూకు తరలిం చారు.

ప్రస్తుతం తిరుపతి జూలో ఉన్న మూడు చిరుతల్లో రెండు చిరుతలకు కోరపళ్లు లేకపోవడంతో జూలోనే ఉం చారు. మరో చిరుతను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే జూలో ఉన్న మూడు చిరుతల్లో లక్ష్మితపై దాడిచేసిన చిరుత ఉందేమోనన్న అనుమానంతో నమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది. కానీ ఇంత వరకు అందుకు సంబంధించిన రిపోర్టులు రాలేదు. దీంతో అటవీశాఖ లక్షితపై దాడిచేసిన చిరుతను నిర్ధారించలేకపోతోంది. రిపోర్టులుకు వచ్చేంత వరకు ఆ మూడు చిరుతలను తిరుపతి జూలోనే ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement