Sunday, May 5, 2024

ఇవిగో ఆధారాలు, చెరువు భూముల్లో అక్రమ కట్టడాలు.. పట్టించుకోని అధికారులు

పిడుగురాళ్ల, (ప్రభ న్యూస్): గుంటూరు జిల్లా పిడుగురాళ్ల‌ పట్టణంలోని చెరువు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు స్థలాలు, రోడ్డు మార్జిన్ స్థలాలలో కొందరు అక్రమార్కులు పక్కా భవనాలను నిర్మిస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ జాగా లేదా చెరువుల భూములు, ఖాళీ స్థలాలు కనపడ్డాయా పాగా వేసేయ్, ఇల్లు కట్టెయ్, గుడి కట్టేసెయ్ అన్నట్లుంది పట్టణంలో పరిస్థితి. పట్టణానికి ఎక్కడో సుదూరంలో నివసించడానికి కూడా కష్టంగా ఉండే ప్రాంతంలో ఒక పేదవాడు పూరి గుడిసె వేసుకుంటే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు హుటాహుటిన బందోబస్తుతో వెళ్లి దాన్ని జేసీబీతో కూలదొయందే నిద్రపోని అధికారులు. ఒక వ్యక్తి సొంత పట్టా భూమిలో నివాసం నిర్మించాలనుకుంటే ఎన్ని అనుమతులు కావాలో అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రభుత్వ , చెరువుల భూములలో రోడ్డు మార్జిన్ స్థలాలలో గృహ నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేశారనేది ప్రశ్నార్థ‌కంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మిన్నకుండి పోవడంలో వారి పాత్ర కూడా ఉండొచ్చని ప్రజలు విమ‌ర్శిస్తున్నారు.

చెరువుల భూములపై కన్నేసిన కొందరు అక్రమార్కులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ అండదండలతో ఆక్రమించి ఇళ్ళు కట్టేస్థున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేయడానికి అనుమతులు ఎలా మంజూరు చేస్తున్నారని, మార్కెట్ యార్డు దగ్గర ఆంజనేయస్వామి దేవాలయం పక్కన భవన నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. ఎంపీడీవో ఆఫీస్ ముందు కొత్తగా నిర్మాణాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ భూములలో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. 128.83 ఎకరాల భూమి ఉన్న చెరువు ఇప్పటికే ఆక్రమణలతో కుంచించుకుపోయింది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో పట్టణ ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. భూగర్భజలాలు అడుగంటినపుడు చెరువులలో నీరు నిల్వ చేయడం ద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువుల భూముల్లో అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ముడేల శ్రీనివాస రెడ్డి, కోట్ల గోవిందరెడ్డి, కోట్ల అంకిరెడ్డి, వజ్రాల ప్రభావతి, గాదె బ్రహ్మారెడ్డి,కె నాగేశ్వరరావు,దమ్ము రాధిక, కోట్ల ఆనందకుమార్ అనే బాధితులు పురుగు మందు డబ్బాలు తీసుకుని త‌మ‌కు న్యాయం జరగకపోతే ఈ స్థలంలోనే మందు తాగి చనిపోతానని మీడియా ముందు వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement