Wednesday, May 15, 2024

డిస్కమ్‌ల బలోపేతం తక్షణ అవసరం.! : ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణి సంస్థ (డిస్కమ్‌)లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యుత్‌ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థలు మున్ముందు మనుగడ సాగించాలన్నా, వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్‌ సరఫరా మరింత పటిష్టంగా కొనసాగాలన్నా అలాగే రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకోవాలన్నా డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడం తప్పనిసరని తెలిపారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డికు రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచంద్రన్‌ ప్రతిష్టాత్మకమైన ‘ది గ్రేట్‌ సన్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డును బహుకరించిన సందర్భంగా సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ (సీపీడీసీఎల్‌) సీఎండీ జె పద్మ జనార్ధన రెడ్డి నేతృత్వంలో ఆయనకు సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఏపీఈఆర్సి చైర్మన్‌ మాట్లాడుతూ, డిస్కమ్‌లను ఆర్థికంగా సాంకేతిక పరంగా బలోపేతం చేయటం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందేలా చేయటమే ఏపీఈఆర్సీ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి సాధించాలంటే ఆర్థికంగా పటిష్టమైన విద్యుత్‌ వ్యవస్థ అత్యావశ్యకమని స్పష్టం చేశారు. త్వరతగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మున్ముందు ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని దీనివల్ల విద్యుత్‌ డిమాండ్‌ అనేక రెట్లు పెరిగిపోతుందని ఆయన తెలిపారు. ఈదృష్ట్యా సమర్ధవంతమైన, ఆరోగ్యకరమైన, సాంకేతికంగా ఆర్థికంగా బలంగా ఉన్న విద్యుత్‌ సంస్థలను నిర్మించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందన్నారు. విద్యుత్‌ సంస్థలు ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతుండడం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఈదృష్ట్యా రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలు ఎదుర్కొంటు-న్న ఆర్థిక సమస్యలు పరిష్కరించి విద్యుత్‌ రంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేరొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్‌ భవిష్యత్‌లో కొనసాగాలన్నా ఈ చర్యలు తప్పనిసరని పేర్కొన్నారు.

అంతరం పెరిగిపోతోంది..

విద్యుత్‌ సంస్థల ఆదాయ-వ్యయాలకు మధ్య అంతరం పెరిగిపోతుందని, దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ కాస్ట్‌ అఫ్‌ సర్వీస్‌ 2016-17లో యూనిట్‌కు రూ. 5.33 ఉండగా అది 2020-21 నాటికి రూ. 6.87కు పెరిగిందన్నారు. అలాగే 24/7 నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగించే లక్ష్యంతో డిస్కమ్‌లు కొన్ని సమయాల్లో యూనిట్‌కు రూ.20 వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుచేసి వినియోగదారులకు సరఫరా చేస్తుందని తెలిపారు. దీనివల్ల విద్యుత్‌ సంస్థలపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఇదే గాక మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా విద్యుత్‌ సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టు-మిట్టాడుతున్నాయన్నారు. ఈదృష్ట్యా డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వినియోగదారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.

నిబద్ధతతో కృషిచేసిన ప్రతి ఒక్కిరీ గుర్తింపు..

సమాజానికి సేవ చేయాలనే నిబద్ధతతో కృషి చేసిన ప్రతి ఒక్కరిని సమాజం గుర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే గుర్తింపుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు తాను నివసిస్తున్న సమాజానికి ఎదో ఒక మేలు చేసేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సేవే లక్ష్యంగా ప్రతీ ఒకరు బాధ్యతతో మెలగాలన్నారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రతి నిత్యం సమాజానికి సేవ చేసే భాగ్యం లభిస్తుందన్నారు. దీనిని ప్రతి ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇంధన సామర్ధ్య జీవన శైలిని అలవరుచుకోవటం ద్వారా ప్రతి ఒక్కరు పర్యావరణానికి తద్వారా సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని చెప్పారు. విద్యుత్‌ రంగంలో ఇంధన సామర్ధ్య చర్యలను ప్రోత్సహించడం ద్వారా విద్యుత్‌ సంస్థలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు- వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు దోహదపడుతుందని తెలిపారు. అలాగే దైనందిన జీవితంలో ఇంధనం సామర్ధ్య చర్యలను అవలంబిచే వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులు కొంత మేర తగ్గే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

సమిష్టి కృషితోనే..

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థలన్నీ సంయుక్తంగా కృషి చేయడం ద్వారా ఇంధన సామర్థ్యం పెంపొందించడంతోపాటు పర్యావరణానికి, వినియోగదారులకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో డిస్కమ్‌లను ఆదుకుంనేందుకు ప్రభుతం రూ. 30 వేల కోట్ల మేర ఆర్థిక సహకారం అందించిందని ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్‌ తెలిపారు. విద్యుత్‌ సంస్థలను ఆదుకునేందుకు ఇంత పెధ్ద ఎత్తున ఆదుకున్న రాష్ట్రం మారేదీ ఉండకవచ్చునని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా ఆర్థిక, నైతిక సహకారం అందిస్తునప్పటికీ ఏటా రెవిన్యూ గ్యాప్‌ పెరిగిపోతూనే ఉందన్నారు. ముఖ్య మంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిల సహకారంతో విద్యుత్‌ సిబ్బంది వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ పృది తేజ్‌ , జేఎండీ విజిలెన్స్‌ బీ మల్లా రెడ్డి, డిస్కామ్‌ల సీఎండీలు హెచ్‌ హరనాథ రావు, జె పద్మ జనార్ధన రెడ్డి, కే సంతోష రావు ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement