Friday, May 3, 2024

పోలీస్ స్టేషన్ కే క‌న్నం – సీజ్ చేసిన గంజాయి బ‌స్తాలు మాయం

మంగళగిరి క్రైమ్, ఏప్రిల్ 23,(ప్రభ న్యూస్): ఎవరింట్లో అయినా దొంగలు పడితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి ఆ పోలీస్‌స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? అలాంటి ఘటన మంగళగిరి రూరల్ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం అర్థరాత్రి చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూరల్ పోలీస్ స్టేషన్ లోని పై అంతస్తులోకి చొరబడిన గుర్తు తెలియని దుండగుడు గతంలో పోలీసులు సీజ్ చేసిన గంజాయి బస్తాల్లో ఓ బస్తా ను చాకచక్యంగా చోరీ చేసి సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు మోసుకుంటూ వచ్చాడు. ఇంతలో నైట్ బీట్ పోలీసులు గమనించి దుండగుడిని వెంబడించడంతో గంజాయి బస్తాను వదిలి పారిపోయాడు. దీంతో పట్టణ పోలీసులు దుండగుడు వదిలి వెళ్లిన గంజాయి బస్తాను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు.

గత ఆరునెలల క్రితం కూడా ఇదే తరహాలో ఓ గుర్తు తెలియని దుండగుడు రూరల్ స్టేషన్ పై అంతస్తులో సీజ్ చేసిన ఓ గంజాయి బస్తాను చోరీ చేయగా గమనించిన పోలీసులు వెంబడించినా దుండగుడు చాకచక్యంగా తప్పించుకున్నాడనే ఆరోపణలు లేకపోలేదు. తాజాగా మరో దుండగుడు రూరల్ పోలీస్ స్టేషన్ పై అంతస్తులో కి చొరబడి గంజాయి బస్తాను మాయం చేయడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. రూరల్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గంజాయి బస్తాను ఎవరు దొంగిలించారనే దానిపై పోలీస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై రూరల్ సీఐ భూషణం ను వివరణ కోరగా రూరల్ స్టేషన్ లో గంజాయి బస్తా చోరికి గురి అయిందనే విషయం అవాస్తవమని, అటువంటిదేమీ జరగలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement