Wednesday, June 19, 2024

Big Story | ముగిసిన వేటవిరామం.. కడలి కెరటాలపై బతుకు సమరానికి సై

అమరావతి, ఆంధ్రప్రభ:దీర్ఘ విరామం తర్వాత గంగపుత్రులు వేటకు సమాయత్తం అయ్యారు. బుధవారం నుంచి సముద్రుడి వైపు తమ జీవన పయనానికి శ్రీకారం చుట్టారు. మత్స్య సంపద వృద్ధి, చేపలు గుడ్లు పెట్టే కాలం కావడంతో ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేటను ప్రభుత్వం నిషేధించింది. . ఈ సమయంలో మత్స్య సంతతి వృద్ధి అయ్యే రోజులుగా పరిగణించి ప్రభుత్వం వేట నిషేధం అమలు చేస్తోంది.

ఫలితంగా సముద్రం ఆధారంగా సాగే అన్ని లావాదేవీలు నిలిచిపోయాయి. చేపల వేట, విక్రయాలు, రవాణా, ఇతర కార్యకలాపాల ద్వారా జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న తీరం ఆధారంగా నెలకు సుమారు రూ.500 కోట్లకు పైగానే లావాదేవీలు జరుగుతుంది.

- Advertisement -

పటిష్ఠ నిఘా..

వేట నిషేధ సమయంలో మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. బోటు అనుమతులు, ప్రభుత్వ రాయితీలు, ఇతర పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించడంతో ఎవరూ సాహసించలేదు. దీంతో తీర ప్రాంతంలో పూర్తిస్థాయిలో వేట నిషేధం అమలైంది. వేట నిషేధం తొలగిపోనున్న నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు తెప్పలు, వలలు, ఇంజిన్లు, బోట్లను సరిచూసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతంలో వేట నిషేధం కారణంగా తొమ్మిది తీర మండలాల్లో వేలాది బోట్లు ఒడ్డుకే పరిమితం కాగా, లక్షకు పైగా కుటుంబాలు ఉపాధికి దూరమయ్యాయి. అర్హత కలిగిన కుటు-ంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుత నిషేధ కాలానికి సంబంధించి గత నెలలో నిధులు అర్హుల ఖాతాల్లో జమ చేశారు. ఇందుకోసం ఏప్రిల్‌లోనే మత్స్యశాఖ అధికారులు గ్రామాల్లో సర్వేచేసి అర్హుల జాబితా తయారు చేశారు. వీరందరికీ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 వేలు జమ చేశారు.

సముద్రంలో వేట సాగించే డీజిల్‌పై రాయితీ సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతున్నా.. అది కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని మత్స్యకారులు వాపోతున్నారు. గతేడాది నుంచి తమకు సక్రమంగా రాయితీ అందడం లేదని కొందరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందే అన్ని సౌకర్యాలపై అధికారులు సమీక్ష నిర్వహించాల్సిఉన్నా ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదని గంగపుత్రులు వాపోతున్నారు.

రాష్ట్రంలో సుమారు 15000 వరకు డీజిల్‌ కార్డులున్నాయి. వీటిపై మెకనైజ్డ్‌ బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, మిగతా బోట్లకు నెలకు 300 లీటర్ల డీజిల్‌ అందిస్తారు. ఈ కార్డు ద్వారా లీటరుకు ప్రభుత్వం రూ.9.75 రాయితీ కల్పిస్తోంది. వీరిలో చాలామంది కార్డుల గడువు ముగియడం, కొందరు తమ కార్డులు పోగొట్టు-కోవడం జరిగింది. వీరికి ఇప్పటివరకు కొత్త డీజిల్‌ కార్డులు ఇవ్వలేదు. దీంతో సౌకర్యాలు కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement