Monday, May 13, 2024

ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలి.. పార్టీల హక్కులను గౌరవించాలి : వామపక్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని, ఇతర రాజకీయ పార్టీల హక్కులను కూడా గౌరవించాలని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. చలో అమలాపురం బయలు దేరుతున్న ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ- అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజనాథ్‌, పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేయడం అమానుష చర్య అని ఖండించాయి. బెజవాడలో బుధవారం ఛలో అమలాపురం భగ్నం చేసిన పోలీసులు పీసీసీ అధ్యక్షునితోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. అరెస్టులపై స్పందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి పరామర్శించారు. జరిగిన ఉదంతంపై శైలజానాధ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ, వి శ్రీనివాసరావులు మాట్లాడుతూ జగన్‌ మూడేళ్ల పాలనలో పోలీసులను ఉపయోగించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు అమలాపురం వెళితే శాంతి భద్రతల సమస్య ఉండదు కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పదేపదే తప్పులు చేస్తోందని ఆరోపించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి బయలుదేరుతున్న కాంగ్రెస్‌, వి.సి.కె. తదితర పార్టీల నాయకులను విజయవాడలోనే అరెస్టు చేయడాన్ని తమ పార్టీ లు ఖండిస్తున్నాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement