Saturday, April 27, 2024

AP: రైతులు, రైతు కూలీల శ్రేయస్సే లక్ష్యం.. జగన్

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటే అందరం బాగుంటాం, అందుకే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ కంటే ఒక్కొక్క రైతుకు అదనంగా రూ.17,500లు ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్ది అన్నారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో బుధవారం రైతు భరోసా పథకంలో బటన్ నొక్కి 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ చేశారు. వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును, రబీ 2021-22, ఖరీఫ్‌-2022 సీజన్ లలో రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు.

రైతులు, రైతు కూలీలు బాగుండాలి..

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…. మనది రైతు ప్రభుత్వమని, రైతులు, రైతు కూలీలు బాగుండాలని ప్రతి అడుగు వేశామని, క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా కింద సహాయాన్ని అందించామని వివరించారు. పెట్టుబడి సాయాన్ని రైతన్నకు దన్నుగా అందించాం. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతుల కున్న భూమి అర హెక్టారు లోపలే. హెక్టారు లోపల ఉన్న రైతులు 70శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసింది. వంద శాతం రైతులకు 80శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్‌ అయ్యిందని వివరించారు.

- Advertisement -

మేనిఫెస్టోలో చెప్పినదానికంటే ఎక్కువే చేశాం..

సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులకు మేలు చేస్తున్నాం. ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు ఇవాళ విడుదల చేస్తున్న మొత్తం రూ.1,294.38 కోట్లు అందించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతీ పథకంలో దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచామని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12,500 బదులు వేయి పెంచి రూ.13, 500 ఇచ్చాం. 50వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం మనదేనన్నారు. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ముందుకు సాగినట్టు సీఎం తెలిపారు.

ఉచిత విద్యుత్​తో రైతులకు మేలు..

19లక్షల మంది రైతులకు 9గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్‌ కింద ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుంది. ఏడాదికి దాదాపుగా రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. గతంలో ఎప్పుడూ కూడా రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లించలేదని, దేశంలో కూడా ఎక్కడా లేదని సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement