Monday, April 29, 2024

AP : తుపాను నష్టాలపై సమగ్ర నివేదికలు అందించాలి.. కలెక్టర్ పి.రాజాబాబు

మచిలీపట్నం, డిసెంబర్ 6 (ప్రభ న్యూస్): మిచౌంగ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు సంభవించిన నష్టాలపై పూర్తి వివరాలతో నివేదికలు తక్షణమే అందజేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు జిల్లాలోని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్ నుండి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా ప్రత్యేక అధికారి లక్ష్మి శాలు తుపాను కారణంగా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, భవనాలపై సంబంధిత రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యు ఎస్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, పౌరసరఫరాల శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు, ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. దివిసీమలోని నాగాయలంక మండలంలో 29 సబ్ స్టేషన్లలో 30 ఫీడర్లు దెబ్బతిన్నాయని, అలాగే 111 విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, కూలిపోవడం జరిగిందన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతులు చేపట్టి విద్యుత్తు సరఫరా నిలిచిన ప్రదేశాలను తక్షణమే సందర్శించి పునరుద్ధరించాలన్నారు. జిల్లాలో 16 మండలాల్లో విద్యుత్ పునరుద్ధరణకు 52 మొబైల్ టీమ్ లు తుపాను సమయంలో అప్రమత్తంగా ఉండడం చేత 68గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయినప్పటికీ, ఈ టీములు తక్షణమే రంగంలోకి దిగడంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి వీలైందన్నారు. జిల్లాలో జరిగిన పంటనష్టం వివరాలు, చనిపోయిన పాడి పశువు వివరాలు సంబంధిత శాఖల అధికారులు తక్షణమే ఆయా సమాచారాన్ని అందించాలన్నారు. మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర సమాచారంతో కూడిన నివేదికలు అందించాలన్నారు. అలాగే ఉద్యాన శాఖ పంట నష్టంపై నివేదిక అందజేయాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజత సింగ్, జిల్లా రెవెన్యూ అధికారిణి పెద్ది రోజా, వ్యవసాయ, ఉద్యానవన, రెవిన్యూ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement