Monday, April 29, 2024

ఈవోటీ జరిమానాలు సరళతరం.. ఏపీఐఐసీ బోర్డు నిర్ణయాలకు ఆమోదం

అమరావతి, ఆంధ్రప్రభ : ఎక్స్ టెన్షన్‌ ఆఫ్ టైమ్‌ (ఈవోటీ)కి సంబంధించి జరిమానాలను సరళతరం చేసే విధివిధానాల దిశగా ఏపీఐఐసీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 1-4-2020కి ముందు చేసిన కేటాయింపుల కోసం 10 సంవత్సరాల వరకు ప్రాజెక్ట్‌ల అమలు కోసం గడువు పొడిగింపును పరిగణనలోకి తీసుకునే మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన ఏపీఐఐసీ 234వ బోర్డు మీటింగ్‌ గురువారం మంగళగిరి కార్యాలయంలో జరిగింది. సరికొత్త నిర్ణయాలను బోర్డు సభ్యులు ఆమోదించారు. అనుమతులిచ్చిన నాటికి ఉన్న భూమి ధరకు బదులుగా ఆలస్య జరిమానా విధించడానికి వాణిజ్య ఉత్పత్తి మొదలైన తేదీ నాటి భూమి ధరను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులలో రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, సైన్‌ బోర్డుల ఏర్పాటు, మొక్కల పెంపకం, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తీర్మానించారు.

ఏపీఐఐసీకి చెందిన ఇండస్ట్రియల్‌ పార్కుల్లోని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ యూనిట్లకు లోన్‌ తీసుకునే విధంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకునే వెసులుబాటుకు బోర్డు అంగీకరించింది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని జగనన్న మెగా ఇండయల్‌ హబ్‌, వైఎస్‌ఆర్‌ ఈఎంసీ(కొప్పర్తి) తో పాటు కర్నూలు జిల్లాలో ఓర్వకల్‌ నోడ్‌లకు నీటి సరఫరా పథకం కోసం ఇవ్వడానికి లేదా ఎస్పీవీకంపెనీకి భరోసా అందించాలని నిర్ణయించారు. ఆక్యుపేషన్‌ ఛార్జీలను లెక్కించడానికి సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలకు ఆమోదించారు. సమావేశం అనంతరం ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. విప్లవాత్మక మార్పుల దిశగా ఏపీఐఐసీ అడుగులు వేస్తోందన్నారు. పారిశ్రామిక పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement